logo

చెత్త కుప్పల్లో కాసుల వేట!

భీమవరంలో చెత్తకుప్పలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. పురపాలక వాహనాలను మూలకు చేర్చి వాటిస్థానే అద్దెవి ఉపయోగిస్తూ నిధులు స్వాహా చేస్తున్నారు.

Published : 29 Aug 2023 05:45 IST

లెక్కలకందని ఇంధన బిల్లులు

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో నిత్యం సేకరించే చెత్తను వేసే యనమదుర్రు కాలువ గట్టు ఇది. ఈ చెత్త సర్దడానికి వినియోగించే యంత్రాలు ఒక్క రోజులోనే 100 లీటర్లు తాగేస్తున్నాయట. ఒకట్రెండు రోజులు కాదు ఈ నెల ఆరంభం నుంచి ఇలా వేల లీటర్ల డీజిల్‌ ఖర్చయినట్లు లెక్క చూపుతున్నారు. ఎన్ని గంటల పాటు చెత్తను సర్దితే ఇంత ఇంధనం ఖర్చవుతుందనే దానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.


భీమవరం పురపాలక సంఘానికి చెందిన జేసీబీ ఇది. కొన్నేళ్ల క్రితం మరమ్మతులకు గురవడంతో ఇలా మూలకు చేర్చారు. అప్పట్లో కొద్ది మొత్తం వెచ్చిస్తే ఇది వినియోగంలోకి వచ్చేది. కానీ పక్కన పెట్టేయడంతో ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది. దీని స్థానంలో అద్దె యంత్రం వినియోగిస్తున్నారు. దీనికి గంటకు రూ.1100 అద్దె, అదనంగా డీజిల్‌ ఖర్చు చేస్తున్నారు. డంపింగ్‌ యార్డులో చెత్తను సర్దడానికే మూడు, నాలుగు నెలలకోసారి రూ.5 లక్షల విలువైన టెండరు ఖరారు చేస్తున్నారు.


భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలో చెత్తకుప్పలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. పురపాలక వాహనాలను మూలకు చేర్చి వాటిస్థానే అద్దెవి ఉపయోగిస్తూ నిధులు స్వాహా చేస్తున్నారు. దీనికి అధికార పార్టీ నాయకుల అండదండలుండటంతో పట్టించుకునే వారే కరవయ్యారు. ఎంత బిల్లు పెడితే అంతా చెల్లించాలనే పరిస్థితి ఉంది. నిత్యం సేకరించే చెత్తను తరలించే వాహనాలన్నింటికీ అయ్యే ఖర్చుకంటే కేవలం వ్యర్థాలను సరిచేయడానికి అయ్యే వ్యయం రెట్టింపు ఉంటుందంటే చెత్తలో కాసుల వేట ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
పురపాలక సంఘానికి దాదాపు రూ.40 లక్షల విలువైన జేసీబీ ఉంది. దానికి చిన్నపాటి మరమ్మతులు చేయించేందుకు  రూ.2 వేలు అవుతుందని మూడేళ్ల కిందట అధికారులు చెప్పారు. కానీ  చేయించకుండా మూలకు చేర్చారు. పట్టణంలో ఎక్కడైనా మట్టి, చెత్త ఇతరత్రా అడ్డంకులు ఉంటే తొలగించేందుకు  దీన్ని ఉపయోగించేవారు. దీనిస్థానే అద్దె యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఓ జేసీబీని యనమదుర్రు కాలువగట్టున చెత్త సర్దేందుకు ఉపయోగిస్తున్నారు. అక్కడ చేస్తున్న పనికి ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు గంటకు రూ.1100 చొప్పున అద్దెతో పాటు డీజిల్‌ రోజుకు 100 లీటర్లు వినియోగించినట్లు లెక్కలు చూపడం చర్చనీయాంశమైంది. పురపాలక సంఘానికి చెందిన మూడు చిన్న జేసీబీలు(హీమ్యాన్‌) ఉన్నాయి. అవి ఎక్కడ పనిచేస్తున్నాయో తెలియదు గానీ నిత్యం ఒక్కో దానికి 40 లీటర్ల చొప్పున డీజిల్‌ వినియోగిస్తున్నట్లు లెక్క చూపుతున్నట్లు సమాచారం.  
మరో మతలబు.. కొన్నేళ్లుగా వేస్తున్న చెత్తను తరలించే పనిని ప్రైవేటు ఏజెన్సీకి టెండరు ద్వారా అప్పగించారు. ఆ సంస్థకు చెందిన సిబ్బంది యార్డులో చెత్తను వేరుచేసుకుని తరలించుకెళ్తున్నారు. పురపాలక సంఘం అద్దె ప్రాతిపదికన వినియోగిస్తున్న యంత్రంతో దారిలో ఉన్న చెత్తను మాత్రమే సర్దుతున్నారు. దీనికే మూడు నాలుగు నెలలకోసారి రూ.5 లక్షల విలువైన టెండరు ఖరారు చేస్తుండటం గమనార్హం.
పర్యవేక్షణ శూన్యం.. అధికారుల సమగ్ర పరిశీలన తర్వాతే బిల్లు చెల్లించాల్సి ఉండగా ఓ వ్యక్తి చేతికి తాళాలు ఇచ్చి అంతా చక్కబెట్టేయమనడంతో డీజిల్‌ కూపన్లు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఇటీవల జరిగిన సమీక్షలో పురపాలక అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలోనే కొందరు రాజకీయ అండ దండలతో విషయం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే ఇంధన కుంభకోణంలో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


జీపీఎస్‌ అమలు చేస్తాం..

పురపాలక వాహనాలన్నింటికీ  జీపీఎస్‌ విధానం అమలు చేస్తాం. ఏ వాహనానికి ఎన్ని లీటర్ల ఇంధనం ఉపయోగిస్తున్నారో, కూపన్లు, ఇతరత్రా వివరాలను ఇటీవల జరిగిన సమావేశంలో తెలుసుకున్నా. వాహనాల పర్యవేక్షణ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించాలని ప్రజారోగ్య విభాగం ఎస్‌ఈని కోరాం. 

ఎం.శ్యామల, భీమవరం పురపాలక కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని