logo

శుద్ధ జలం.. అందని దైన్యం!

మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి.

Published : 29 Mar 2024 04:13 IST

వాగులు, వంకల నీరే దిక్కు
వ్యాధుల బారిన పడుతున్న గిరిజనం

మూడేళ్లుగా తెరుచుకోని తాట్కూరుగొమ్ము జలశుద్ధి కేంద్రం

వేలేరుపాడు, న్యూస్‌టుడే: మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. దీంతో విలీన మండలం వేలేరుపాడులోని గోదావరి, పెదవాగు పరీవాహకంలోని అన్ని గ్రామాల వారు వాగులు, వంకలపై ఆధారపడి గొంతులు తడుపుకొంటున్నారు.

అలంకార ప్రాయంగా..

వేలేరుపాడు మండలంలోని గోదావరి, పెదావాగు పరీవాహకంలో గల కొయిదా, కట్కూరు, నార్లవరం, తిరుమలాపురం, తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము, రామవరం, మేడేపల్లి పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ప్రవాహపు, చెలమ నీటిని తాగి డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి ప్రాణాంతక జ్వరాల బారిన పడటంతో పాటు చర్మ వ్యాధుల బారిన పడుతుండటంతో 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ శుజల పథకం పేరుతో ఒక్కో శుద్ధిజల కేంద్రానికి రూ.2.18 లక్షలు చొప్పున కేటాయించి ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల పాటు బాగానే పని చేసిన శుద్ధి జల కేంద్రాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూలనపడ్డాయి. రేపాకగొమ్ము పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సచివాలయ సిబ్బంది విధుల కోసం పూర్తిగా ఎత్తివేశారు. రుద్రంకోటలో ఇటీవల పంచాయతీ నిధులతో మరమ్మతులు చేయించడంతో గ్రామంలోని వారంతా తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. మిగిలిన ఎనిమిది గ్రామాల ప్రజలు చేతిపంపులు, చెలమలపై ఆధారపడి దాహార్తిని తీర్చుకుంటున్నారు. ‘పెదవాగు, గోదావరి పరీవాహకంలో మరమ్మతులకు గురైన ఎనిమిది శుద్ధి జల కేంద్రాలను బాగు చేయించేందుకు వెంటనే కేఆర్‌పురం ఐటీడీఏ పీవో, ఇతర జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తాం. నిధులు విడుదలైన వెంటనే అన్ని శుద్ధిజల కేంద్రాలను అందుబాటులోకి తెస్తాం’ అని ఎంపీడీవో శ్రీహరి తెలిపారు.

కొనుక్కొని తాగాల్సిందే

ఏటా వర్షాకాలంలో తాగునీటి పథకాలు పనిచేయక పోవడంతో ఇంటిల్లపాదీ బిందెలు, కావిళ్లలో సమీపంలోని గోదావరికి వెళ్లి బురద నీటిని తెచ్చుకుని గొంతులు తడుపుకుంటున్నాం. శుద్ధిజల కేంద్రం మూత పడటంతో వరదల సమయంలో రూ.20తో 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ క్యాన్‌ కొనుగోలు చేసి తాగుతున్నాం.

పనగంటి సత్యవతి, రేపాకగొమ్ము

చెలమ నీరే పన్నీరు

గ్రామంలోని వారందరికీ శుద్ధి జలం అందించేందుకు కోయమాదారంలో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ మూలన పడి ఏళ్లు గడుస్తున్నా దాని బాగోగుల గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. చెలమ నీటిని తాగి దాహార్తిని తీర్చుకుంటున్నాం.

కుంజా లక్ష్మయ్య, మేడేపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని