logo

బూటకం.. జగన్నాటకం

సీఎం జగన్‌.. విశ్వసనీయత గురించి వేదికలపై ఊక దంపుడు ప్రసంగాలిస్తారు. ‘చెప్పాడంటే.. చేస్తాడంతే’ అంటూ పాటల ప్రచారం చేయించుకుంటారు. మాట తప్పను మడం తిప్పను అంటూ మాటలతో మేడలు కట్టేస్తారు.

Updated : 16 Apr 2024 06:11 IST

భీమవరం హామీలు గాలికి
నరసాపురం వాగ్దానాలు హుష్‌కాకి
ప్రచార ఆర్భాటమే తప్ప పూర్తికాని పనులు
జనంతో ఓట్లాట
ఈనాడు, భీమవరం, ఈనాడు డిజిటల్‌, భీమవరం, న్యూస్‌టుడే, సరసాపురం

సీఎం జగన్‌.. విశ్వసనీయత గురించి వేదికలపై ఊక దంపుడు ప్రసంగాలిస్తారు. ‘చెప్పాడంటే.. చేస్తాడంతే’ అంటూ పాటల ప్రచారం చేయించుకుంటారు. మాట తప్పను మడం తిప్పను అంటూ మాటలతో మేడలు కట్టేస్తారు. క్షేత్రస్థాయిలో అందులో  ఇసుమంతైనా నిజం లేదని అర్థమవుతుంది. పశ్చిమ రూపురేఖలు మారుస్తామంటూ నరసాపురం, భీమవరం పర్యటనల్లో జిల్లా అభివృద్ధికి వరాలు కురిపించారు. రూ.వేల కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. నెలలు గడుస్తున్నా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు.

‘ఒకే రోజు సుమారు రూ.3300 కోట్ల విలువైన 15 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం నరసాపురం చరిత్రలో           మునుపెన్నడూ జరిగిన  దాఖలాలు లేవు. నియోజకవర్గం రూపురేఖలు మార్చేందుకు జరుగుతున్న గొప్ప ప్రయత్నమిది’.

ఏడాదిన్నర క్రితం నరసాపురం బహిరంగ సభలో సీఎం జగన్‌  మాటలివి.

భీమవరం, వీరవాసరం మండలాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అడిగిందే ఆలస్యం.. ఇచ్చేస్తున్నాం’.

గతేడాది భీమవరం సభలో సీఎం జగన్‌ చెప్పుకొన్న గొప్పలు

కానీ

ప్రజలను దారుణంగా మోసం చేశారు. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి పని జరిగిందంటే  ఒట్టు. భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో డ్రెయిన్లు లేక మురుగంతా రోడ్లపైకి చేరుతోంది. భీమవరం గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య వెంటాడుతూనే ఉంది. వంతెనల నిర్మాణ మాటలు ఉత్తిదే అయ్యాయి. ఇక నరసాపురం నియోజకవర్గంలో గాలిమాటల జాబితా చాంతాడంత.

గుత్తేదారులకు నమ్మకం లేదు

జగన్‌ మాటలు నమ్మితే కొంప కొల్లేరవుతుందని జిల్లా ప్రజలకు పూర్తిగా అర్థమైంది. సముద్రపు నీరు కొల్లేరులో చొరబడకుండా నిరోధించి..5వ కాంటూరు వరకు మంచి నీరు నిల్వ చేయడానికి ఉప్పుటేరుపై మోళ్లపర్రులో రెగ్యులేటర్‌, వంతెన, లాక్‌ నిర్మాణం చేసేస్తామంటూ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. వైకాపా సర్కారులో పని చేస్తే ఒక్క పైసా రాదని గుత్తేదారులు పత్తా లేకుండా పోయారు. రూ.188.40 కోట్ల విలువైన పనులకు ఇప్పటికి మూడు సార్లు టెండర్లు పిలిచినా మా వల్ల కాదు మహా ప్రభో అంటూ దండం పెట్టేశారు. ఏడాదిన్నర గడిచినా జగన్‌ ప్రభుత్వ వైఫల్యాల వల్లే పనులు మొదలు కాలేదు.

భూగర్భ డ్రెయినేజీని భూస్థాపితం చేశారు

జగన్‌ మీ స్థాయికి మురుగు సమస్య కూడా తీర్చలేరా..అంటూ డ్రెయినేజీ సమస్యతో నరకం చూస్తున్న నరసాపురం పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చినుకు పడినప్పుడల్లా మురుగు కంపు భరించలేక జగన్‌ హామీ గుర్తొచ్చి ఎంత మోసం చేశావ్‌ జగన్‌ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని బూటకపు మాటలు చెప్పి ఆ హామీని భూస్థాపితం చేశారు. రూ.85 కోట్లతో చేపట్టే పనులకు ఏడాదిన్నర కిందట శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు ప్రతిపాదనలు కూడా చేయలేదంటే జగన్‌కు ప్రజలపై ఎంతటి కపట ప్రేమ ఉందో అర్థమవుతోంది.

వాటర్‌ గ్రిడ్‌  గోదాట్లోనే..

‘ఓ పక్క గోదావరి..మరోపక్క సముద్రం ఉన్నా గుక్కెడు తాగునీరు లేని దుస్థితి చూశా..ఈ ప్రాంత ప్రజల ఆవేదన తొలగించేందుకు రూ.1400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా ఉమ్మడి పశ్చిమకు తాగునీరు అందిస్తా.’ అని చెప్పిన సీఎంకు అయిదేళ్లయినా మా దాహం కేకలు వినిపించలేదా అంటూ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాటలు చెబితే మంచినీళ్లు రావని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నా వైకాపా ప్రభుత్వానికి చీమకుట్టినట్టే లేదు. విజ్జేశ్వరం దగ్గర గోదావరి నీటిని ర్యాపిడ్‌ శాండ్‌ ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి పైపులైన్ల ద్వారా అందించాలన్న హామీని గోదాట్లో ముంచేశారు.

గోదారోళ్లంటే అంత చులకనా

పంటు దొరికితే కానీ  ప్రయాణం చేయలేని ప్రజల కన్నీళ్లను ఓట్లు చేసుకున్న జగన్‌ కోనసీమ, పశ్చిమ జిల్లాల ప్రజలను గోదాట్లో ముంచేశారు. నరసాపురం, మొగల్తూరు మండలాలను కోనసీమతో అనుసంధానం చేస్తానంటూ నమ్మక ద్రోహం చేశారు. సీఎంకు గోదారోళ్లంటే అంత చులకన కాబోలు. రూ.26 కోట్ల అంచనాతో వశిష్ఠ వారధికి సీఎం శంకుస్థాపన చేసి సరిపెట్టారు. గోదావరి నదిపై గాజులలంక సమీపంలో వంతెనతో పాటు రహదారులు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీని వల్ల ఈ వంతెన మీదుగా సరాసరి సఖినేటిపల్లి, మల్కిపురం, రాజోలు వెళ్లేందుకు సులువుగా ఉంటుంది. రెండు జిల్లాల ప్రజలకు ఉపయోగం. ఏడాదిన్నర గడిచినా వంతెన పనులు పట్టాలెక్కలేదు.

ఇవేనా మీరు నిర్మించే ఊళ్లు

మేం కట్టేది ఇళ్లు కాదు ఊళ్లు అంటూ జగన్‌ ఊదరగొట్టారు. భీమవరం జగనన్న కాలనీల్లో లెవిలింగ్‌, రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధికి రూ.39.84 కోట్లు మంజూరు చేస్తున్నట్లు అట్టహాసంగా ప్రకటించారు. నాలుగు నెలలు గడిచినా పత్తా లేకుండా పోయారు. భీమవరంలో 4,957 ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటికి 1193 మాత్రమే పూర్తయ్యాయి. లబ్ధిదారులు అక్కడికి వెళ్లేందుకు సరైన రోడ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్‌ తరలింపు కష్టమవ్వటంతో జగన్‌ని తిట్టని నోరు లేదు.

ఈ సారీ కష్టాలు మామూలే.. నరసాపురం పర్యటనలో రుస్తుంబాదలో 220/132/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం కట్టేస్తాం అంటూ సీఎం నరసాపురం, యలమంచిలి, పాలకొల్లు, మొగల్తూరు మండలాల ప్రజలను నమ్మించి మోసం చేశారు. ఉపకేంద్రం పనులు సంగతి దేవుడెరుగు జగన్‌ ప్రభుత్వం నిర్మాణానికి స్థల సేకరణ కూడా చేయలేక బేల చూపులు చూస్తోంది. దీంతో వేసవిలో సైతం విద్యుత్తు కోతలు, సరఫరాల్లో హెచ్చుతగ్గులు పరిశ్రమలకు ఇబ్బందులు తప్పవు.

వంతెన కూడా కట్టలేవా.. మత్స్యపురి తొక్కోడు డ్రెయిన్‌ వద్ద ఉన్న తూముల వంతెన స్థానే శ్లాబు వంతెన నిర్మిస్తామని సీఎం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటి వరకు ప్రతిపాదనలు కూడా లేవు. ఈ కాలువ ద్వారా 3వేల ఎకరాల్లో మురుగునీరు బయటికి వెళుతుంది. నిర్వహణ లేక తూడు అడ్డబడి నీటి ప్రవాహం ఉండటం లేదు. ఒక్క వంతెన కూడా కట్టలేవా జగన్‌ అంటూ ప్రజలు తిట్టుకుంటున్నారు.

విలువ లేని హామీలెందుకు జగన్‌

భీమవరం పట్టణంలోని యనమదుర్రు డ్రెయిన్‌ పైనున్న ఫుట్‌పాత్‌ వంతెన పక్కన మరో వంతెన నిర్మాణానికి రూ.5.80 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. సభ ముగిసిన వెంటనే హామీని పక్కన పెట్టేశారు. ప్రజలు మాత్రం నరక యాతన అనుభవిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పనుల గురించి అధికారుల నుంచి ఎలాంటి హామీ రాలేదంటే సీఎం మాటకు ఎంత విలువుందో తెలుస్తోంది.

వియర్‌ ఛానల్‌కు అంతరాయం

వియర్‌ కాలువను ఏర్పాటు చేసి మొగల్తూరు మండలంలో శివారు ప్రాంతాల రైతులకు సాగునీరు తరలిస్తామని సీఎం ఊక దంపుడు మాటలు చెప్పుకొచ్చారు. రూ.24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఏళ్లు గడుస్తున్నా అన్నదాతలకు ఆక్రందనలే మిగిలాయి. జగన్‌ పుణ్యమా అని శివారు ప్రాంతాల పంటలు నీరు లేక నిలువునా మాడిపోతున్నాయి. 2వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉన్నా ప్రభుత్వ అసమర్థతతో ఇప్పటికీ కాలువ నిర్మాణం సాకారం కాలేదు.

స్లూయిజ్‌ల నిర్మాణంలోనూ వంచనే

జగన్‌ అసమర్థతతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. నరసాపురంలోని కాజ, ఈస్ట్‌కుక్కిలేరు, ముస్కేపాలెం, అయిదు తూములు ప్రాంతాల్లో స్లూయిజ్‌లు ఏర్పాటు చేస్తామంటూ రైతులను నయవంచన చేశారు. శంకుస్థాపన చేసి గాలికొదిలేశారు. దీంతో ఏటా వరదల సమయంలో శిథిలావస్థలో ఉన్న స్లూయిజ్‌లు ఎప్పుడు కొట్టుకుపోయి పంటలను మింగేస్తాయో అని రైతులు గుండెలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. రూ.9 కోట్లతో నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క గుత్తేదారు కూడా తొంగి చూడకపోవటం వైకాపా ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని