logo

యంత్రాంగం ఉండీ.. ఎందుకీ మంత్రాంగం?

ఇంటింటి పింఛన్ల పంపిణీపై వైకాపా మరో కొత్త కుట్రకు శ్రీకారం చుట్టింది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉన్నా.. సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని వృద్ధుల ప్రాణాలతో  చెలగాటమాడింది.  మే నెల పింఛన్లు బ్యాంకులో వేస్తామంటూ కొత్తగా జగన్నాటకం మొదలు పెట్టింది.

Published : 30 Apr 2024 06:32 IST

ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర

బ్యాంకులో జమ చేస్తామంటూ కొత్త నాటకం

 వేసవిలో వృద్ధుల ప్రాణాలతో చెలగాటం  

 రాజకీయ లబ్ధికై తెదేపాపై నెపం వేసే కుతంత్రం


ఈనాడు, ఏలూరు, ఈనాడు, డిజిటల్‌,  భీమవరం,  న్యూస్‌టుడే, ఏలూరు నగరం: ఇంటింటి పింఛన్ల పంపిణీపై వైకాపా మరో కొత్త కుట్రకు శ్రీకారం చుట్టింది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉన్నా.. సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని వృద్ధుల ప్రాణాలతో  చెలగాటమాడింది.  మే నెల పింఛన్లు బ్యాంకులో వేస్తామంటూ కొత్తగా జగన్నాటకం మొదలు పెట్టింది.
45 డిగ్రీల మండు వేసవిలో వృద్ధులు, దివ్యాంగులను బలి చేసేందుకు కంకణం కట్టుకుంది. గిరిజనులకు కొండలు..గుట్టలు ఎక్కించి..వాగులు వంకలు దాటించే దుర్మార్గపు రాజకీయ వికృత క్రీడకు తెరతీసింది. ఇంటింటికీ పింఛను అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించినా పట్టించుకోకుండా ప్రతి పక్షాలపై విషం చిమ్మేందుకు మరోమారు సిద్ధమైంది. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడే చాలా సులభంగా పింఛన్లు పంపిణీ చేశామని విశ్రాంత అధికారులు, ఉద్యోగులు బల్లగుద్ది చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఒక్కో సచివాలయం పరిధిలో సగటున 8 మంది సిబ్బంది పని చేస్తున్నారు. పంపిణీ చేయాల్సిన పింఛన్లు 273 వరకు ఉంటాయి. అంటే ఒక్కో సచివాయ ఉద్యోగికి సగటున వచ్చేది 34 మంది మాత్రమే. వాలంటీర్లు పంపిణీ చేసినప్పుడే నాలుగైదు రోజుల సమయం పట్టేది. సచివాలయ ఉద్యోగుల ద్వారా కేవలం రెండు రోజుల్లో జిల్లాలోని 5,06,679 మంది లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పింఛను పంపిణీ చేయొచ్చు. ప్రస్తుతం ఎన్నికల సమయం కాబట్టి సచివాలయ సిబ్బందికి ఎలాంటి పని ఒత్తిడి లేదు. ఇంత సులభమైన మార్గం ఉన్నా వైకాపా అమలు చేయకుండా సచివాలయాల దగ్గరే పింఛను పంపిణీ చేస్తామని వృద్ధులు, దివ్యాంగుల ప్రాణాలతో ఓట్లాటాడుతోంది. రావాలని ఇంటింటి పింఛను పంపిణీ చేయకపోవడానికి ప్రతిపక్షాలే కారణం అంటూ ఓట్ల కోసం దిగజారి విష ప్రచారం చేయిస్తోంది.

గిరిజన వేదన.. అరణ్య రోదన

వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి, కాకిస్‌నూరు, టేకుపల్లి గ్రామాలు గోదావరి పరిసరాల్లోని గుట్టలపై ఉంటారు. వీరు పింఛను తీసుకోవాలంటే 50 కిమీ ప్రయాణించి వేలేరుపాడులో బ్యాంకుకు రావాలి. వీరు గోదావరిలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గంటపాటు బోటులో ప్రయాణించాలి. మోదెల, గుండ్లమడుగు, కుంకుడుకొయ్యలపాకలు తదితర గ్రామాల ప్రజలు వేలేరుపాడు బ్యాంకుకు రావాలంటే 30 కిలోమీటర్లు మేర కొండలు, గుట్టలు, వాగులు దాటుకుండా కాలినడకన రావాలి. అక్కడ నుంచి ఆటోల్లో మరో 40 కిమీ ప్రయాణించాలి. వీరిలో 40 శాతం మందికి బ్యాంకు ఖాతాలే లేవు. ఇలా ఏజెన్సీలోని వందలాది మంది పింఛనుదారులుపింఛన్‌ కోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి.
పింఛనుదారుల ఉసురు తీస్తావా జగన్‌.. గత నెల సచివాలయాల్లో పింఛను తీసుకునేందుకు వచ్చి ఇద్దరు వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉంగుటూరు మండలం కైకరానికి చెందిన రెడ్డి అప్పలనరసమ్మ(78) పింఛను కోసం రెండుసార్లు సచివాలయానికి వెళ్లినా నగదు రాలేదని చెప్పారు. తీవ్ర ఎండలో తిరగటంతో అలసిపోయి మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన పాతకొకల పెద్దిరాజు(63) సచివాలయానికి బయల్దేరి..దారిలో ఆయాసం రావటంతో కుప్పకూలి మృతి చెందారు.

మండుటెండలో వృద్ధులతో ఆటలా..

ఉమ్మడి జిల్లాలో మొత్తం 900పైగా పంచాయతీలుంటే బ్యాంకులు 560 వరకు మాత్రమే ఉన్నాయి. దాదాపు సగం గ్రామాల్లో బ్యాంకుల్లేవు. దీంతో దూర ప్రాంతాలకు ఎండలో వెళ్లాల్సిందే. మొత్తం 5.1 లక్షల పింఛనుదారులుంటే అందులో దాదాపు 2.6 లక్షల మంది వృద్ధులే. వీరిలో 90శాతం మంది ఒంటరిగా బ్యాంకులకు వెళ్లలేనివారే. దీంతో మరొకరిని బ్యాంకుకు తీసుకువెళ్లాలంటే రూ.200-400 వరకు రవాణా ఖర్చు భరించాల్సిందే. పింఛనుదారుల్లో సుమారు 30 శాతం మందికి బ్యాంకు ఖాతాలే లేవు. ఉన్నవారిలో మరో 20 శాతం మందికి పైగా ఆధార్‌ అనుసంధానం కాలేదు.  సచివాలయానికి వచ్చి ఖాతాను సరి చూసుకుని మళ్లీ బ్యాంకుకు వెళ్లాలి. 45 డిగ్రీల ఎండలో వృద్ధులను నరయాతనకు గురి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

వాలంటీర్లు లేనప్పుడే ఇంటింటికీ ఇచ్చాం.. ప్రస్తుతం వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులున్నా ప్రభుత్వం పింఛనుదారులను ఇబ్బంది పెట్టేందుకు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోంది. వీరెవరూ లేనప్పుడు రెండు మూడు రోజుల్లో సులభంగా పింఛన్లు పంపిణీ చేశాం. సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసే అవకాశం ఉన్నా..పింఛనుదారులను ఇబ్బందిపెట్టి నెపాన్ని  ప్రతి పక్షాలపై వేసేందుకు వైకాపా కుట్ర చేస్తోంది.

- డా.రాజేంద్రప్రసాద్‌, ప్రాంతీయ సంచాలకులు, పురపాలకశాఖ

పని విభజన చేస్తే సరిపోతుంది.. పెరిగిన సాంకేతికత, సచివాలయ వ్యవస్థ ద్వారా సామాజిక పింఛన్లను ఇంటింటికి పంపిణీ చేయడం చాలా సులభం. ఉన్న సిబ్బందికి పని విభజన చేస్తే సరిపోతుంది. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పంపిణీ చేయాల్సిన పింఛన్లు సచివాయానికి 300 మించి ఉండవు. ఒక్కొక్క ఉద్యోగి 34 మందికి రెండు రోజుల్లో పంపిణీ చేయొచ్చు.

- విశ్రాంత పురపాలక శాఖ ఉద్యోగి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని