logo

మావయ్యా.. మా బాల్యంతో ఆడుకున్నావ్‌!

ప్రతి అక్కచెల్లెమ్మల బిడ్డలకు నేను మేనమామ లెక్క. ఆ హోదాలో వారి చదువులు సాగించేందుకు అండగా నిలబడి నేను తోడుంటా.. అంటూ ప్రతి సభలోను ఊదరగొట్టే సీఎం జగన్‌ పురిటి బిడ్డ మొదలుకుని 15 ఏళ్ల బాలబాలికల బాల్యం కోసం చేసిందేమీలేదు.

Published : 07 May 2024 06:00 IST

పురిటి బిడ్డ టీకా నుంచి పిల్లల ట్యాబ్‌ల వరకు ఇబ్బందులే  

వసతుల కల్పనలోనూ చేతులెత్తేసిన వైకాపా సర్కారు

 

పాలకొల్లు, న్యూస్‌టుడే: ప్రతి అక్కచెల్లెమ్మల బిడ్డలకు నేను మేనమామ లెక్క. ఆ హోదాలో వారి చదువులు సాగించేందుకు అండగా నిలబడి నేను తోడుంటా.. అంటూ ప్రతి సభలోను ఊదరగొట్టే సీఎం జగన్‌ పురిటి బిడ్డ మొదలుకుని 15 ఏళ్ల బాలబాలికల బాల్యం కోసం చేసిందేమీలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వైకాపా ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి జిల్లాలోని లక్షలాది మంది బాల్యం బుగ్గిపాలయ్యింది. పసికందు వయసు నుంచి పదో తరగతి పూర్తిచేసుకునే వరకు ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన పలు పథకాలకు కోతేశారు.

ఇదేనా వాత్సల్యం..

కొవిడ్‌-19 సమయం నుంచి 2022 వరకు తల్లిదండ్రులను కోల్పోయిన ఏడాది వయసున్న పిల్లల నుంచి         18 ఏళ్ల వయసున్న విద్యార్థులను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన మిషన్‌ వాత్సల్యను జగన్‌ మామయ్య మూడేళ్లుగా పట్టాలెక్కించలేదు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలంలోను సరాసరిన 150 మంది అర్హులు ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్నారు. నెలకు రూ.500 చొప్పున చేయూత ఇవ్వాల్సి ఉండగా మొండి చేయి చూపించారు.

టీకాల నుంచి బేబీకిట్ల వరకు..  

ఉమ్మడి జిల్లాలో ఏటా 40 వేల మంది పైగా గర్భిణులు ప్రసవాల నిమిత్తం వివిధ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. పసికందుల నుంచి అయిదేళ్ల వయసున్న చిన్నారులు మరో 1.20 లక్షల మంది ఉంటున్నారు. వీరికి గవద బిళ్లలు, పొంగు వంటి వ్యాధులు రాకుండా అందించే ఎంఆర్‌ టీకాల సరఫరాకు ఇటీవల ప్రభుత్వం బ్రేకేసింది. అప్పుడే జన్మించిన నవజాత శిశువు లకు తెదేపా హయాంలో బేబీ కిట్లు అందించేవారు. వైకాపా ప్రభుత్వంలో పేద కుటుంబాలు వాటిని కూడా అందుకోలేక బయట మార్కెట్లో కొనుక్కోలేక పసికందులకూ పేదరికం తెలిసేలా సాకుతున్నారు.

ఇరుకు గదుల్లో బాల్యం..

రెండేళ్లు నిండిన పసిపిల్లలకు ఓనమాలు దిద్దుతూ విద్యాబుద్దులు నేర్చేది అంగన్‌వాడీల్లోనే. పసి వయసులో పౌష్టికాహారం అందించడంతో పాటు మానసిక ఉల్లాసానికి తోడ్పడే అంగన్‌వాడీలకు మేనమామ సొంత భవనాలను కల్పించలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో 17 ప్రాజెక్టుల పరిధిలో 3,851 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 1.83 లక్షల మంది చిన్నారులు వీటిలో నిత్యం ఆటపాటల ద్వారా విద్యాభ్యాసం చేస్తుంటే సగానికి పైగా అద్దె భవనాల్లోనే కొనసాగించారు. ఉదాహరణకు పశ్చిమలో మొత్తం 1626 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 587 మాత్రమే సొంత భవనాలున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కడుపునిండా పెట్టిందేలే.. 

నా ఎస్సీ, నాబీసీలని చెప్పుకొనే సీఎం జగన్‌ వారి పిల్లలకు మేనమామ అయ్యుండి ఏఒక్క రోజూ కడుపు నిండా తిండి పెట్టిందే లేదు. ఉమ్మడి జిల్లాలో పాఠశాల స్థాయి సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 25 ఉండగా 700 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. బీసీ వసతి గృహాలు 14 ఉండగా 600 మంది విద్యార్థులున్నారు. ఆయా వసతి గృహాలకు నెలల తరబడి బిల్లులు విడుదల చేయక నిర్వాహకులు సరిగ్గా ఆహారం అందించని దుస్థితి కొనసాగుతుందంటే జగన్‌ జమానాలో పేద పిల్లల బాల్యం ఎలా బుగ్గిపాలయ్యిందో తెలుసుకోవచ్చు.

ఆత్మరక్షణకు ఎసరు..

ఉమ్మడి జిల్లాలో 8, 9 తరగతులు చదివే బాలికలకు ఆత్మరక్షణ విద్య పేరిట ఏటా 20 వేల మందికి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శిక్షణ ఇచ్చేవారు. అవసరమైన సందర్భాల్లో ఆగంతుకుల నుంచి బాలికలు స్వీయ రక్షణ పొందడానికి వీలుండేది. మేనమామ అధికారంలోకి వచ్చాక తోడుంటానని చెప్పడమేగాని ఏ పథకానికి తోడు రాలేదని బాలికలు వాపోయే దుస్థితి తీసుకొచ్చారు.

కళ్లజోడు కరువే..

ఒకటి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం తెదేపా హయాంలో కంటి వెలుగు పేరిట వైద్యులు పరీక్షలు చేసి అవసరమైన విద్యార్థులకు కళ్లజోడు ఉచితంగా అందించేవారు. 2019 వరకు నిర్విరామంగా జరిగిన కంటివైద్యానికి వైకాపా వచ్చాక చీకట్లు వచ్చాయి. పరీక్షలు చేసి, కళ్లజోడు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సుమారు 2,626 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2.30లక్షల పేద విద్యార్థుల్లో ఎంతో మంది కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు. వీరికి దాతలు దయదలిస్తేగాని కళ్లజోళ్లు అందడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు