logo

భూమేతల గుండెల్లో గుబులు!

పీలేరులో భూ ఆక్రమణదారులు నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. అక్రమాన్ని సక్రమం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రభుత్వం మారుతుందనే భయం వారిని వెంటాడుతోంది.

Published : 23 May 2024 03:09 IST

ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటని ఆందోళన 
తామేం చేయలేమని చేతులెత్తేస్తున్న అధికారులు 
వైకాపా పెద్దల వద్దకు ఆగమేఘాలపై పరుగులు 

పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె సమీపంలో ఆక్రమిత భూమి

పీలేరులో భూ ఆక్రమణదారులు నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. అక్రమాన్ని సక్రమం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రభుత్వం మారుతుందనే భయం వారిని వెంటాడుతోంది. ఈ లోగా సర్దుకునే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ పరిపతిని వినియోగించి రెవెన్యూ అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా వచ్చిన తామంతా ఓట్ల లెక్కింపు అనంతరం తిరిగి వెళ్లిపోతామని, తాము ఏమాత్రం సాయపడలేమని అధికారులు తేల్చి చెబుతున్నారు. పీలేరు పరిసరాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరిగాయంటూ లోకాయుక్త సైతం నిగ్గుతేల్చింది. అంతకు ముందే రెవెన్యూశాఖ పరంగా చేపట్టిన విచారణలోనూ అక్రమాలు వెలుగుచూశాయి. దీనిపై కన్నెర్ర చేసిన సీసీఎల్‌ఏ సైతం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. రాజకీయ ముసుగులో అక్రమార్కులు తప్పించుకున్నారు. తాజాగా ఆక్రమణదారులు అక్రమాలను సక్రమం చేసుకునేందుకు అన్ని రకాల అడ్డదారులు తొక్కడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.   

ఈనాడు, కడప : పీలేరు చుట్టూ అయిదు కిలోమీటర్ల పరిధిలో భారీఎత్తున ప్రభుత్వ, డీకేటీ భూముల ఆక్రమణలు జరిగాయి. రూ.వందల కోట్ల విలువైన ఈ భూములు ఆక్రమణకు గురయ్యాయంటూ రెండేళ్లుగా వివిధ రూపాల్లో వెలుగులోకి వచ్చాయి. తెదేపా యువ నేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా పీలేరు బహిరంగ సభలో అధికార పార్టీ నాయకుల భూదందాపై సర్వే నంబర్లతో సహా బయట పెట్టారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సైతం అసెంబ్లీ వేదికగా పీలేరు భూ ఆక్రమణల వ్యవహారంపై గళం విప్పారు. తెదేపా నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సైతం పోరాటం చేశారు. తదనంతర పరిణామాలతో లోకాయుక్త నివేదిక వెలువడింది. ఇక్కడ జరిగిన ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ఉన్నతాధికారులను లోకాయుక్త దేశించినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  

అధికార పార్టీదే దందా

అధికారమే అండగా వైకాపా నేతలు పీలేరు మండలంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ, డీకేటీ భూములున్నాయో ఆరా తీశారు. చాపకింద నీరులా ఆక్రమణలకు తెరలేపారు. గతంలో ఉమ్మడి చిత్తూరు కలెక్టర్‌ హరి నారాయణ్‌ ఆదేశాల మేరకు మదనపల్లె సబ్‌ కలెక్టరు జాహ్నవి పీలేరు, బోడుమల్లువారిపల్లె, గూడరేవుపల్లె, దొడ్డిపల్లె, ముడుపులవేముల, ఎర్రగుంటపల్లె పంచాయతీల పరిధిలో విచారణ చేపట్టారు. మొత్తం 84 మంది రెవెన్యూ అధికారులను ఆరు బృందాలుగా ఏర్పాటు చేసి సమగ్ర సర్వే చేయించారు. పది రోజుల పాటు ఆక్రమణలపై విచారణ చేపట్టిన అధికారులు సమగ్ర నివేదికను సబ్‌ కలెక్టర్‌కు ఆందజేశారు.

నిగ్గు తేలిన భూ ఆక్రమణలివే

ఆరు పంచాయతీల్లో మొత్తం 1,500 ఎకరాల్లో సమగ్ర సర్వే నిర్వహించారు. రికార్డు స్థాయిలో రూ.కోట్ల విలువైన 165 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు తేలింది. వ్యవసాయం నిమిత్తం వినియోగించాలనే లక్ష్యంతో ఉన్న 80 ఎకరాల డీకేటీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఇలా ఆక్రమణకు గురైన భూముల్లో రాజకీయ పలుకుబడితో చదును చేసి పాట్లు వేసి అమ్మకానికి పెట్టారు. మీకేం భయం వద్దంటూ కొనడానికి వచ్చిన ప్రజలకు భరోసా ఇస్తూ అక్రమ ప్లాట్లను వారికి అంటగట్టారు. పంచాయతీల వారీగా సర్వే సంఖ్యలతో సహా సమగ్రంగా సర్వే బృందం అక్రమ చిట్టాను అందజేసింది. 

విచ్చలవిడిగా అనధికార లేఅవుట్లు

పరిసర మండలాల ప్రజలు పిల్లల చదువులు, వ్యాపారాల నిమిత్తం పీలేరుకు వలస వస్తున్నారు. కొందరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి రూ.లక్షలు వ్యయం చేసి ఇళ్లస్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన స్థిరాస్తి వ్యాపారులు రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతుల్లేకుండా ప్లాట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా కేవలం ఒప్పంద పత్రం రాసుకుని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని వచ్చే పేద, మధ్య తరగతి ప్రజానీకానికి అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లును అంటగట్టారు. ఇలా ఆరు పంచాయతీల పరిధిలో 282 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వెలిశాయంటే ప్రభుత్వ ఆదాయానికి ఏ మేరకు గండి పడిందన్నది అర్థమవుతోంది. 

ముఖ్య నేతల వద్దకు పరుగులు

భూముల ఆక్రమణలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేతలందరూ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరందరూ ప్రస్తుతం అపద్ధర్మ ప్రభుత్వ పెద్దల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ దందా సాగించిన వారిలో నలుగురైదుగురు పదవులు కూడా అనుభవిస్తున్నారు. ఆక్రమించుకున్న భూములు విలువ ప్రస్తుతం రెట్టింపు కావడంతో కాపాడుకోవడానికి ముఖ్య నేతల వద్దకు వెళుతూ  ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ, డీకేటీ భూములు ఆక్రమణలు చోటు చేసుకోవడంలో కిందిస్థాయి రెవెన్యూ అధికారుల పాత్ర ఉంది. ఈ మేరకు సీసీఎల్‌ఏ సైతం పలువురి పేర్లను పేర్కొని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు చర్యలు మాత్రం తీసుకోలేదు. భూములను రక్షించాల్సిన వీఆర్వోలు, వీఆర్‌ఏలు మామూళ్లకు కక్కుర్తి పడుతూ అక్రమార్కులకు వెన్ను దన్నుగా నిలిచారంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. లోకాయుక్త, సీసీఎల్‌ఏ విచారణ నివేదికల ఆధారంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పక్షంలో చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని