logo

యూరియా.... లేదయా!

కర్షకులకు ఎరువుల కష్టాలు వెంటాడుతున్నాయి. పంట ఎదుగుదల, అధిక ఉత్పత్తులకు కీలకమైన యూరియా కొరతతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు.

Updated : 04 Feb 2023 05:21 IST

రైతు భరోసా కేంద్రాల్లో నిండుకున్న నిల్వలు
ప్రైవేటు దుకాణాల్లో అదనపు దోపిడీ
బస్తాపై రూ.30 నుంచి రూ.50 వరకు మోత
- న్యూస్‌టుడే, కడప, రాజంపేట గ్రామీణ, బి.కొత్తకోట

ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లె రైతు భరోసా కేంద్రమిది. ఇక్కడ శుక్రవారం ఒక్క బస్తా కూడా యూరియా లేదు.  5.4 టన్నుల యూరియా అవసరమని సిబ్బంది ప్రతిపాదనలు పంపినా సరఫరా కాలేదు.

కర్షకులకు ఎరువుల కష్టాలు వెంటాడుతున్నాయి. పంట ఎదుగుదల, అధిక ఉత్పత్తులకు కీలకమైన యూరియా కొరతతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు నిండుకున్నాయి. కొన్నిచోట్ల ఒక బస్తా కూడా అందుబాటులో లేదు. ప్రైవేటు దుకాణాలకు రైతులు పరుగులు తీస్తున్నారు. అక్కడ నిర్ణీత ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. కొంతమంది వర్తకులు నిలువు దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కొనుగోలు చేసినా వారికి అమ్మకపు రశీదు కూడా ఇవ్వడం లేదు.

వైయస్‌ఆర్‌ జిల్లాలో రబీ సీజన్‌లో వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం 1,50,812 హెక్టార్లు కాగా, ఇప్పటికే 1,01,658 హెక్టార్లలో సాగు చేశారు. పండ్లు, కూరగాయలు, పూల తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలు 58,164 హెక్టార్లలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది అక్టోబరు నుంచి గత నెల వరకు యూరియా 19,400 టన్నులు కావాలని అధికారులు అడిగారు. జిల్లాకు 20,082.38 టన్నులు వచ్చింది. నాలుగు నెలలకుగానూ కోటా కంటే అదనంగా వచ్చినా కొరత నెలకొంది. యూరియా 45 కిలోల బస్తా రూ.266.50 విక్రయించాల్సి ఉండగా, పైవేటు దుకాణాల్లో రూ.300 నుంచి రూ.320 వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది వర్తకులు దోపిడీకి పాల్పడుతున్నారు. కొనుగోలు చేసిన వారికి అమ్మకం రశీదు ఇవ్వాల్సి ఉన్నా చాలాచోట్ల అమలు కావడం లేదు.  జిల్లా వ్యాప్తంగా 432 రైతు భరోసా కేంద్రాలుండగా, సాగుదారులకు కావాల్సిన మేరకు నిల్వలు ఉండటం లేదు. జిల్లాకు వచ్చిన కోటాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా సరఫరా చేయాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కొన్నిచోట్ల ఒక్క బస్తా కూడా లేదు. ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లె, గంగపేరూరు ఆర్‌బీకేల్లో యూరియా కొనుగోలుకు 4 రోజులుగా రైతులు వస్తుండగా, నిల్వల్లేవని సిబ్బంది తిరిగి పంపిస్తున్నారు.

* అన్నమయ్య జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 27,814 హెక్టార్లు కాగా, ఇప్పటికే 15 వేల హెక్టార్లలో వేశారు. ఉద్యాన పంటలు 98,959 హెక్టార్లలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు 400 వరకు ఉండగా, చాలా వాటిల్లో యూరియా నిల్వల ఊసే లేదు.  తాళ్లపాక, పోలి, అప్పరాజుపేట, పెద్దకారంపల్లెలో కొరత తీవ్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ప్రైవేటు దుకాణాల్లో నిర్ణీత ధర కంటే అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకు  వసూలు చేస్తున్నారు.


కొరత లేదు

ఈ సీజన్‌లో రైతులకు కావాల్సినంత యూరియా తెప్పిస్తున్నాం. ప్రస్తుతం ఎక్కడా కొరత లేదు. రైతు భరోసా కేంద్రాల్లోనూ నిల్వ ఉంది. ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే మా దృష్టికి రైతులు తీసుకొస్తే ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తాం. అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. కొనుగోలు చేస్తున్న రైతులకు అమ్మకపు రశీదు ఇవ్వాలి. అక్రమ నిల్వలపై నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తాం.

నాగేశ్వరరావు, ఉమామహేశ్వరమ్మ, జిల్లా వ్యవసాయాధికారులు, వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని