logo

మామయ్యను అన్నావు... మాయ చేశావు..!

విద్యార్థుల సంక్షేమాన్ని సీఎం జగన్‌ గాలికొదిలేశారు. గత ఎన్నికలకు ముందు మీకు జగన్‌ మామయ్య ఉన్నాడంటూ ఊదరగొట్టి అధికారంలోకొచ్చాక పూర్తిగా విస్మరించారు.

Published : 17 Apr 2024 05:50 IST

విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన జగన్‌
వసతి గృహాలపై వైకాపా ప్రభుత్వం శీతకన్ను

విద్యార్థుల సంక్షేమాన్ని సీఎం జగన్‌ గాలికొదిలేశారు. గత ఎన్నికలకు ముందు మీకు జగన్‌ మామయ్య ఉన్నాడంటూ ఊదరగొట్టి అధికారంలోకొచ్చాక పూర్తిగా విస్మరించారు. అయిదేళ్ల పాలనలో వసతిగృహాల నిర్వహణకు సరిపడా నిధులు కేటాయించకపోవడంతో అరకొర వసతుల మధ్య విద్యార్థులు భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. చాలాచోట్ల అద్దె, శిథిల భవనాల్లో అసౌకర్యాల మధ్య వసతి గృహాలు నడుస్తున్నాయి. పెచ్చులూడుతున్న పైకప్పులు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తుండగా, తలుపుల్లేని మరుగుదొడ్లు, సాన్నపుగదులతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సక్రమంగా లేని తలుపులు, విరిగిపోయిన కిటికీలు పిల్లల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. కొన్ని వసతిగృహాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండగా, వాడుకనీటికి అవస్థలు ఎదురవుతున్నాయి. జిల్లాలోని వసతి గృహాలు జగన్‌ సర్కారు వైఫల్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి.


పెచ్చులూడిపోయి...

చిన్నమండెం సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలోని మరుగుదొడ్ల భవనం పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. భవనం ఎప్పుడు కూలుతుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

న్యూస్‌టుడే, చిన్నమండెం


ట్యాంకరు నీరే ఆధారం

సంబేపల్లె బీసీ వసతి గృహం 15 ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ 80 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికి సరిపడా తాగునీరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వసతిగృహ వార్డెన్‌ తన సొంత నిధులు వెచ్చించి ట్యాంకరు తెప్పిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, సంబేపల్లె


దుప్పట్లు...అట్టముక్కలే రక్షణ

రాయచోటి బీసీ బాలుర వసతి గృహంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రైవేటు భవనంలో కొనసాగుతన్న వసతి గృహంలో 200 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఇక్కడి మరుగుదొడ్ల తలుపులు విరిగి పోయాయి. దీంతో కాలకృత్యాలకు విద్యార్థులు ఆరుబయటకు వెళుతున్నారు. మంచాల్లేకపోవడంతో నేలపైనే పడుకుంటున్నారు. కిటికీలు పగిలిపోవడంతో దుప్పట్లు, అట్టముక్కలు అడ్డుపెట్టాల్సిన దుస్థితి నెలకొంది.

న్యూస్‌టుడే, రాయచోటి గ్రామీణ


ప్రహరీ లేక భద్రత కరవు

కలకడ మండలం నడిమిచెర్ల ఎస్సీ బాలుర వసతి గృహానికి ప్రహరీ లేకపోవడంతో నిత్యం పశువులు, పాములు లోపలికి చొరబడుతున్నాయి. ఊరి బయట గుట్టను చదును చేసి నిర్మించిన ఇక్కడ 60 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. భవనం నిర్మించి పదేళ్లు గడుస్తున్నా ప్రహరీ నిర్మించకపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

న్యూస్‌టుడే కలకడ


అపరిశుభ్రతకు నెలవు

రాయచోటి సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులు నిద్రించే గది పక్కనే స్టోర్‌రూం ఉంది. అందులోనే విద్యార్థులు తమ సామగ్రిని భద్రపరుచుకునే పెట్టెలు ఉంచారు. దీంతో రాత్రి వేళ దోమలు బెడదతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

న్యూస్‌టుడే, రాయచోటి గ్రామీణ


దోమల బెడద తీరేదెలా..!

పెనగలూరు ఎస్సీ బాలురు వసతిగృహంలో 65 మంది విద్యార్థులున్నారు. నీటిశుద్ధి యంత్రం చాలా రోజులుగా మరమ్మతులకు గురైంది. దీన్ని బాగు చేయించేందుకు నిధులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు కుళాయి నీరు తాగుతున్నారు. వసతి కేంద్రం కిటికీలు విరిగిపోవడం, మెస్‌లు అమర్చకపోవడంతో దోమల బెడద అధికంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు.

న్యూస్‌టుడే, పెనగలూరు


మరుగుదొడ్లకు తలుపులేవీ

రాజంపేట ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహం అధ్వానంగా మారింది. కిటికీలకు మెస్సుల్లేకపోవడంతో దోమల బెడదతో విద్యార్థులు సతమతమవుతున్నారు. మరుగుదొడ్లకు తలుపులు, నీటి వసతి కల్పించకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ


కాలకృత్యాలకూ కష్టమే

లక్కిరెడ్డిపల్లె సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో సమస్యలు తిష్ట వేశాయి. మరుగుదొడ్లకు ఏర్పాటు చేసిన తలుపులు విరిగిపోయి అధ్వాన స్థితిలోకి చేరాయి. కనీస వసతులు కల్పించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.

న్యూస్‌టుడే, లక్కిరెడ్డిపల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని