logo

ఐదేళ్లు గాడిదలు కాశారా?

‘కడప ఉక్కు ఊసే లేదు. తట్టెడు మట్టి ఎత్తలేదు, ఇటుక పేర్చలేదు.. పోలవరం ప్రస్తావన అసల్లేదు.. వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.. తగుదనమ్మా అంటూ ఇప్పుడు దగా డీఎస్సీ ప్రకటించారు.. వైకాపా ప్రభుత్వం ఈ ఐదేళ్లు ఏం చేశారు.

Published : 05 May 2024 05:10 IST

మంత్రి ఇలాకాలో తాగునీరివ్వలేని దుస్థితి
అధికార వైకాపా  నేతలే భూ కబ్జాకోరులు
కడప ఎన్నికల ప్రచారంలో షర్మిల వ్యాఖ్యలు

కడపలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు షర్మిల, అఫ్జల్‌ఖాన్‌

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: ‘కడప ఉక్కు ఊసే లేదు. తట్టెడు మట్టి ఎత్తలేదు, ఇటుక పేర్చలేదు.. పోలవరం ప్రస్తావన అసల్లేదు.. వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.. తగుదనమ్మా అంటూ ఇప్పుడు దగా డీఎస్సీ ప్రకటించారు.. వైకాపా ప్రభుత్వం ఈ ఐదేళ్లు ఏం చేశారు. గాడిదలు కాస్తున్నారా?’ అని పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల వ్యాఖ్యానించారు. కడప నగరంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె తన సోదరుడు, సీఎం జగన్‌, వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

  • అప్సర కూడలిలో ఆమె మాట్లాడుతూ  తాను అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ వేస్తానని బీరాలు పలికిన జగన్‌ అధికారంలోకి వచ్చాక అన్నీ మరిచిపోయారని విమర్శించారు. తీరా ఎన్నికల ముందు 6 వేల పోస్టులతో దగా డీఎస్సీ ప్రకటించారని, అదీ అతి తక్కువ సమయమిస్తే మన బిడ్డలు ఎలా సిద్ధమవుతారని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేయలేదని, కడప ఉక్కు పరిశ్రమకు గత, ప్రస్తుత సీఎంలు చంద్రబాబు, జగన్‌ శంకుస్థాపనలు చేశారని ఎద్దేవా చేశారు. కుంభకర్ణుడైనా ఆరు నెలల నిద్ర, ఆరు నెలల తిండితో కాలం గడుపుతాడని, వైకాపా ప్రభుత్వం మాత్రం ఐదేళ్ల కాలంలో ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. సీబీఐ ఛార్జిషీట్‌లో నిందితుడిగా పేర్కొన్న అవినాష్‌రెడ్డికి టిక్కెట్‌ ఇచ్చి గెలిపించి చట్టసభల్లోకి పంపాలని చూస్తున్నారని, హంతుకులను కాపాడేందుకు సీఎం జగన్‌ తన అధికారాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
  • కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషాను ఇక్కడి ప్రజలు గెలిపిస్తే ప్రజలకు తాగేందుకు నీరివ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి, మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.  ఫ్యాన్‌కు ఓటేస్తే హామీలు గాలికి కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు. భాజపాతో చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకుంటే, సీఎం జగన్‌ తొత్తుగా మారారన్నారు.
  • మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత మాట్లాడుతూ తన తండ్రి హత్యకు గురై ఐదేళ్లయినా న్యాయం జరగలేదని, అందుకే ప్రజాకోర్టులోకి వచ్చామని తెలిపారు. ఇక్కడ ఓటు అనే ఆయుధంతో న్యాయమా, నేరమా అనేది ప్రజలు తేల్చాలన్నారు.  షర్మిల వెంట పార్టీ కడప అసెంబ్లీ అభ్యర్థి అఫ్జల్‌ఖాన్‌, తదితరులున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని