logo

ఆకేపాటి ఓ కబ్జాకోరు!

‘అరాచక వైకాపా ప్రభుత్వం పోవాలంటే కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను గెలిపించండి.

Published : 05 May 2024 05:21 IST

ఆయనకి ఓటేస్తే ఇంటిపై కప్పు కూడా ఉండదు
మిథున్‌రెడ్డిని రెండు సార్లు గెలిపించి ఏం లాభం?
పాపాల పెద్దిరెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు
యువత ఆలోచించాలని  లోకేశ్‌ పిలుపు

యువగళం సభలో హాజరైన యువతనుద్దేశించి మాట్లాడుతున్న లోకేశ్‌

ఈనాడు, కడప, రాజంపేట, రాజంపేట గ్రామీణ: ‘అరాచక వైకాపా ప్రభుత్వం పోవాలంటే కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను గెలిపించండి. అప్పుడే నియోజకవర్గం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి. 2014-19 మధ్య కాలంలో రాజంపేట నియోజకవర్గాన్ని రూ.కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశాం. ఆ తర్వాత వైకాపాను ఆదరించారు. భూభూకబ్జాదారుగా పేరొందిన ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి జగన్‌ టిక్కెట్‌ ఇచ్చారు. ఈసారి ఆయనను గెలిపిస్తే మన ఇంటిపైనున్న కప్పు కూడా పీక్కెళతారు. రాత్రికి రాత్రి భూములు లాక్కుంటారు. ఆకేపాటి దుర్మార్గాలు ఆగాలంటే ఎమ్మెల్యేగా బాల సుబ్రహ్మణ్యంను భారీ మెజార్టీతో శాసనసభకు పంపండి. ఎంపీగా కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన హయాంలో కౌలు రైతులకు చట్టం తెచ్చారు. మంచి ఆలోచనలున్న వ్యక్తి. మన కోసం పనిచేసే కిరణ్‌ కుమార్‌ రెడ్డిని గెలిపించుకుందాం. కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. పాపాల పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఒక్క పరిశ్రమ తెచ్చారా?.. ఉద్యోగాలు ఇచ్చారా?. పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాగించిన అరాచకాలను గుర్తు చేసుకోండి.

రాజంపేట యువగళం సభలో నారా లోకేశ్‌

తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బాల సుబ్రహ్మణ్యంను పరిచయం చేస్తున్న నారా లోకేశ్‌

కిషోర్‌ : రాజంపేట కీలకమైన ప్రాంతం. ఇక్కడ గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఇలాంటి గడ్డపై ఏ ధైర్యంతో సమరశంఖం పూరిస్తున్నారు?.

నారా లోకేశ్‌ : తెదేపా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసింది. పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చింది. గ్రామాల్లో సిమెంటు రోడ్లు వేశాం. కియా పరిశ్రమను తీసుకువచ్చాం. మేం తీసుకువచ్చిన పరిశ్రమల ముందు సెల్ఫీలు దిగి ఛాలెంజ్‌ చేస్తే సీఎం జగన్‌ నుంచి సమాధానం లేదు. వచ్చేది తెదేపా ప్రభుత్వమే.

కుసుమకుమారి : తెదేపా హయాంలో గుజ్జు పరిశ్రమను ప్రారంభించాం. మేము వైకాపాకు మద్దతు ఇవ్వలేదని మాకు రాయితీలు, రుణం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. పరిశ్రమ మూతపడడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నారు.?

నారా లోకేశ్‌ : అమరరాజా రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లించేది. గల్లా జయదేవ్‌ తెదేపా వ్యక్తి కావడంతో వేధించారు. తెలంగాణకు వెళ్లిపోవడంతో అక్కడ 20 వేల మందికి ఉపాధి లభించింది. మేమూ ఏనాడైనా భారతి సిమెంట్‌, సండూర్‌ పవర్‌, సాక్షి పత్రికను ఇబ్బంది పెట్టామా?. పెట్టుబడులు పెట్టిన వారిని, క్వారీ, మైనింగ్‌ యజమానుల్ని పాపాల పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి ఇబ్బందులు పెట్టారు. దీంతో ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి.

వేణుగోపాల్‌: పేదలకు ఎన్నో చేశామని జగన్‌ అంటున్నారు. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను మూసేశారు. మళ్లీ తెరుస్తారా?

నారా లోకేశ్‌ : జగన్‌ బటన్‌ నొక్కి అకౌంట్‌లో రూ.10 వేసి.. రూ.100 లాక్కుంటున్నారు. కరెంట్‌ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారు. దాదాపు 100 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలను తిరిగి పునరుద్ధరిస్తాం. మూసేసిన అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుంది.

ఇందు : మాజీ మంత్రి వివేకాను దారుణంగా చంపేసి చంద్రబాబుపై నిందమోపారు. వివేకా కుమార్తె సునీత జగనే చంపేశారంటున్నారు. దీనిపై మీరేమంటారు?.

నారా లోకేశ్‌: వివేకాను చంపి నారాసుర రక్త చరిత్రంటూ సాక్షి పత్రికలో పేజీ మొత్తం రాశారు. ఈ రోజు సునీత బయటకు వచ్చి నిజం చెప్పారు. చంద్రబాబు హత్యా రాజకీయాలు, మత ఘర్షణలు ప్రోత్సహించరు. తెలుగువారంతా ఉన్నతస్థాయిలో ఉండాలన్నదే తపన. ఎన్టీఆర్‌ హయాం నుంచి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. తిరిగి తెదేపా రాబోతోంది.. పూర్వ వైభవం వస్తుంది.

శ్రీనివాస్‌ : లులూ మాల్‌ వెళ్లిపోయింది. తెదేపా వచ్చాక తిరిగి తీసుకువస్తారా?

నారా లోకేశ్‌ : పరిశ్రమలను బతిమిలాడి, కాళ్లుపట్టుకుని, చేతులు పట్టుకుని ఏదో రకంగా తీసుకువస్తాం. పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం.

రామ్‌ : నేను బీటెక్‌ చదవాను. ఉద్యోగం కోసం బెంగళూరు వెళితే మీది ఏ రాష్ట్రం అని అడిగారు. ఏపీ అని చెబితే బయటకు పంపించారు.?.

నారా లోకేశ్‌ : ఐదేళ్లలో మన గడ్డపై పరిశ్రమలు తీసుకువస్తాం. మన వారికే ఉద్యోగాలు కల్పిస్తాం.  పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతను ఆదుకుంటాం.

చంద్రబాబు : నేనొక దళితుడుని. వైకాపా పాలనలో ఎంతో మంది దళితులు హత్యకు గురయ్యారు. మీరిచ్చే సమాధానం ఏమిటి?.

నారా లోకేశ్‌ : ఓం ప్రతాప్‌ను చంపింది.. పాపాల మిథున్‌రెడ్డి... ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. పుంగనూరు నియోజకవర్గంలో చంపారు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులో తన దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను చంపి డోర్‌ డెలివరీ చేశారు. అలాంటి వ్యక్తులను సీఎం జగన్‌ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం. 

ఉమ్మడి కడప జిల్లాకు వైకాపా ఏం చేసింది?

ఉమ్మడి కడప జిల్లాలో అన్ని స్థానాల్లో వైకాపాను గెలిపించారు. ఒక్క కంపెనీ వచ్చిందా?.. ఒక్క ఉద్యోగం తెచ్చారా?.. కడప ఉక్కు పరిశ్రమకు ఒక ఇటుక వేశారా?..అని లోకేశ్‌ ప్రశ్నించారు. ‘రాయలసీమకు తెదేపా ఎన్నడూ కట్టుబడి ఉంది. మిషన్‌ రాయలసీమ పేరుతో డిక్లరేషన్‌ ఇచ్చా. హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చుదిద్దుతాం. ప్రతి గడపకు తాగునీటి వసతి కల్పన. కడపను స్పోర్ట్స్‌ సీటీగా తీర్చుదిద్దుతామని’ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో కడప ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా.. ప్రజల కష్టాలు తీర్చడానికి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సూపర్‌ సిక్స్‌ పథకాలపై హామీలిచ్చారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని