logo

కుటుంబ సమేతంగా పెద్దిరెడ్డి దోపిడీ!

‘వనరులన్నీ తన కుటుంబం చేతుల్లో పెట్టుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ దోపిడీ చేస్తున్నాడు. ఒక్క క్వారీ కూడా వేరే వాళ్ల చేతుల్లో లేదు. అన్నీ పెద్దిరెడ్డి కుటుంబానికే ఉన్నాయి.

Updated : 06 May 2024 06:49 IST

ప్రజల భూములపై జగన్‌ కన్ను
పనులు, క్వారీలు, కాంట్రాక్టులు అన్నీ వాళ్లకే
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పూర్తి చేసి సాగునీరందిస్తాం
అంగళ్లు సభలో తెదేపా అధినేత చంద్రబాబు

హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న చంద్రబాబు

‘వనరులన్నీ తన కుటుంబం చేతుల్లో పెట్టుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ దోపిడీ చేస్తున్నాడు. ఒక్క క్వారీ కూడా వేరే వాళ్ల చేతుల్లో లేదు. అన్నీ పెద్దిరెడ్డి కుటుంబానికే ఉన్నాయి. వనరుల దోపిడీకే సీఎం జగన్‌ ఆయనను మంత్రిని చేశారు. మళ్లీ అంగళ్లు వస్తాను. ఇక్కడ రౌడీయిజాన్ని అణచివేస్తాను. ఆంబోతులా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డిని తొక్కేస్తాను. కుటుంబ ఆధిపత్యాన్ని భూస్థాపితం చేస్తాను.’ అని తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఘాటుగా హెచ్చరించారు.

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, ములకలచెరువు గ్రామీణ, పీటీఎం గ్రామీణ  : ‘ప్రజల భూములపై సీఎ జగన్‌ కన్నుపడింది. రైతులకు ఇచ్చే పట్టాదారు పాసుపుస్తకాలపై ఆయన బొమ్మ వేసుకున్నాడు.  మంత్రి బొత్స ఎన్టీఆర్‌ ఎప్పుడో ఎక్కడో ఫొటో వేయించారని మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్‌కు జగన్‌కు పోలికా? వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేస్తామని రాజపత్రం, పట్టాదారుపాసుపుస్తకాన్ని చించేశారు. కూటమి అధికారంలోకి రాగానే చట్టాన్ని రద్దు చేస్తాము.’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆ సొమ్మంతా కక్కిస్తాం....

‘ఆవులపల్లి ప్రాజెక్టు నిర్మాణం పేరుతో రైతుల ఆస్తిని లాక్కునే ప్రయత్నం చేశారు. దీనిపై ఎన్‌జీటీ ఏకంగా ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది. సిగ్గులేని ప్రభుత్వం రూ.25 కోట్లు చెల్లించింది.  మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నా పట్టుకొచ్చి అన్నీ కక్కిస్తాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

పదవుల కోసం కాళ్ల దగ్గర కూర్చున్నాడు...

‘మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుభవం దగ్గర పాపాల పెద్దిరెడ్డి బచ్చా.  పదవుల కోసం ఆయన కాళ్ల దగ్గర కూర్చున్నాడు. ఆయనకు నడమంత్రపు సిరితో కొవ్వెక్కింది. ఆంబోతులా తయారయ్యాడు. నిండు గర్భిణి నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నిస్తే దాడులకు తెగబడ్డారు. అరాచకశక్తులని వారికి వారే నిరూపించుకున్నారు. మాపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు వీటిపై మాత్రం మౌనం వహించేందుకు సిగ్గులేదా. జూన్‌ 4వ తేదీ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. వైకాపా ఇంటికి పోతుంది, కిరణ్‌కుమార్‌రెడ్డి పార్లమెంటుకు వెళతారు. అప్పుడు మా తడాఖా చూపిస్తాం’ అని హెచ్చరించారు.

వాళ్లకు రాజకీయ సన్యాసం...

‘ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే. ఏడు రోజులే సమయం ఉంది మిత్రమా. నేను ఇక్కడకు సవాల్‌ విసిరేందుకు వచ్చాను. ఎంపీగా కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేగా జయచంద్రారెడ్డి గెలుస్తారు. వలస పక్షులకు రాజకీయ సన్యాసం తప్పదు. ఈ ప్రాంతంలో ఎంతో మంది పెద్దలు రాజకీయం చేశారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి, కనిపిరెడ్డి, కలిచర్ల కుటుంబాలు అభివృద్ధికి కృషి చేశాయి. అటువంటిది నువ్వు ఎంత? నీ బతుకెంత? అని  పెద్దిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అభివృద్ధి చేస్తాం...

‘తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా చెరువులకు నీళ్లు నింపుతాం.  మల్బరీ, కూరలు, పండ్లు, పూల పెంపకాలను ప్రోత్సహించేందుకు శ్రద్ధ తీసుకుంటాం. టమాట ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీ కావడం ద్వారా అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

నేను కన్నెర్ర చేసి ఉంటే...

‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9 ఏళ్లు నేను సీఎంగా ఉన్నాను. కిరణ్‌కుమార్‌రెడ్డి మూడున్నరేళ్లు ఉన్నారు. హుందాగా ఎలా ప్రవర్తించాలో పెద్దిరెడ్డి మా దగ్గర చూసి నేర్చుకో. నేను కన్నెర్ర చేసి ఉంటే పుంగనూరులో ఉండేవాడా?.ఆయన కొమ్ములు విరిచి కొవ్వు కక్కిస్తాం. ఇది నీ అబ్బ జాగీరు కాదు. నువ్వు, నీ తమ్ముడు వలస పక్షులు. దోపిడీ చేసేందుకు, తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టించేందుకు, కాంట్రాక్టులు పొందేందుకు నీకు మంత్రి పదవి ఇచ్చారు. గండికోట నుంచి సమాంతరంగా కాలువ తవ్వకాల కోసం పెద్దిరెడ్డి భారీ దోపిడీకి పాల్పడ్డాడు. దోచిందంతా కక్కిస్తాం. ఈ ప్రాంతానికే చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క కాంట్రాక్టు పని చేయలేదు. నేను, నా కుటుంబం కూడా ఒక్క పనీ తీసుకోలేదు’ అని పేర్కొన్నారు.

తెదేపా, భాజపాలకు ఓటేయాలి

పేదల భూములు, దేవాదాయశాఖ భూములు, ఇసుక మాఫియా, రౌడీయిజం పోవాలంటే తెదేపా, భాజపాకు ఓటేయాలని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు, నేను ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాను అభివృద్ధి పథకంలో నడిపించామన్నారు. రాష్ట్రంలో రావణాసుడి పాలన నడుస్తోందని, జగన్‌ ప్రభుత్వాన్ని ఇంట¨కి పంపేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్‌లో కూడా వైకాపా అల్లరి మూకలు దాడికి దిగాయని, తంబళ్లపల్లెలో పోలీసులు పెద్దిరెడ్డికి ఊడిగం చేస్తూ ఓవర్‌యాక్షన్‌ చేస్తున్నారని, తగ్గకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఉపాధ్యాయుల డీఏలు కట్‌ చేసి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు కొట్టేశారన్నారు. నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజం ఎక్కువగా ఉండటంతో 236 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రజలందరూ నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు.

ప్రతిపక్షాలపై  అక్రమ కేసులు  

ఒక్క అవకాశమంటూ తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని రూ.48 వేల కోట్ల సంపదను పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుందని తెదేపా తంబళ్లపల్లె అసెంబ్లీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆరోపించారు. మల్లయ్యకొండ మల్లికార్జునస్వామి ఆలయం అభివృద్ధి పేరుతో అక్కడి కొండలను పిండి చేయడమే కాకుండా దేవుడి విగ్రహాన్ని కూడా ఎత్తుకెళ్లిపోయారన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాక్షసుడు (పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి) ఎమ్మెల్యేగా ఉండడంతో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో 30 మంది టమాట రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులను ఆదుకునేందుకు టమాట, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని