logo

Crime News: 30 ఏళ్లుగా దొంగతనాలు: రాత్రి కలగంటాడు.. పగలు కొట్టేస్తాడు!

చోరీలు చేయాలంటే పథకం వేస్తారు.. రెక్కీ చేస్తారు. ఈ దొంగ విభిన్నం. రాత్రుళ్లు నిద్రలో ఎక్కడ దొంగతనం చేయాలనేది కలగంటాడు. ఆ ప్రదేశం.. నివాసాల ఆధారంగా చోరీలు చేస్తుంటాడు. మారుపేర్లతో బురిడీ కొట్టిస్తున్న ఇతన్ని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు

Updated : 02 Apr 2022 10:42 IST

ఈనాడు, హైదరాబాద్‌, నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: చోరీలు చేయాలంటే పథకం వేస్తారు.. రెక్కీ చేస్తారు. ఈ దొంగ విభిన్నం. రాత్రుళ్లు నిద్రలో ఎక్కడ దొంగతనం చేయాలనేది కలగంటాడు. ఆ ప్రదేశం.. నివాసాల ఆధారంగా చోరీలు చేస్తుంటాడు. మారుపేర్లతో బురిడీ కొట్టిస్తున్న ఇతన్ని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 230 గ్రాముల బంగారు, 10.2 కిలోల వెండి వస్తువులు, రూ.18,000 స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో శుక్రవారం సీపీ మహేష్‌ భగవత్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గాంధీనగర్‌కు చెందిన ముచ్చు అంబేడ్కర్‌(50) అలియాస్‌ రాజు, రాజేష్‌, ప్రసాద్‌, కందుల రాజేందర్‌ మారుపేర్లతో చలామణి అవుతుంటాడు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. తన 20వ ఏట నుంచే దొంగతనాలు ప్రారంభించాడు. 20ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇందిరాపార్కు వద్ద రాత్రుళ్లు కాలిబాటపై పడుకుంటాడు. కలలో తట్టిన ప్రాంతంలో పగలు సంచరించి తాళం వేసిన ఇళ్లకు రెక్కీ నిర్వహిస్తాడు. అర్ధరాత్రి దాటాక ఆ ఇంటిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతుంటాడు. ఇంటి తాళం, వంటగది ఇనుప గ్రిల్స్‌ను అవలీలగా తొలగించటంలో నేర్పరి. అంతే వేగంగా ఇంట్లోకి ప్రవేశించి విలువైన ఆభరణాలు, నగదు కొట్టేసి క్షణాల్లో బయటకు జారుకుంటాడు. మొదటి ప్రాధాన్యత నగలుకే ఇస్తాడు. 1990-91లో తొలిసారి కార్ఖానా, లాలాగుడ, ఉస్మానియా యూనివర్సిటీ ఠాణాల పరిధిలో నాలుగు ఇళ్లలో చోరీ చేసి జైలు కెళ్లాడు. జైలు నుంచి తిరిగొచ్చాక మకాం కర్ణాటకకు మార్చాడు. అక్కడ చిక్‌పేట్‌ ఠాణా పరిధిలో 4 చోరీలు చేసి జైలు కెళ్లాడు. విడుదలై హైదరాబాద్‌ వచ్చాడు. ఇక్కడ 2016-22 మధ్య 43 చోరీలు చేశాడు. చోరీ సొత్తును గుంటూరులోని నివాసంలో భద్రపరచటం ఇతడి అలవాటు. డబ్బు అవసరమైనపుడు. కొట్టేసిన నగలు కొన్నింటిని ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల్లో తాకట్టుపెట్టి రుణం తీసుకునేవాడు.  

చిక్కాడిలా..
వనస్థలిపురం ఠాణా పరిధిలో నివసించే భూగర్భగనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తాతా శ్యాంరావు ఇంట్లో గతేడాది అక్టోబరులో చోరీ జరిగింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వనస్థలిపురం వైదేహీనగర్‌ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన అంబేడ్కర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో చోరీల చిట్టా విప్పాడు. పగటి వేళల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను ఎంపిక చేసుకుంటానంటూ తెలిపాడు. ఇదే సెంటిమెంట్‌తో ఇన్నేళ్లుగా తాను దర్జాగా చోరీలు చేయగలుగుతున్నానంటూ చెప్పటం గమనార్హం.

ఠాణాలవారీగా నమోదైన కేసులు
వనస్థలిపురం- 27, హయత్‌నగర్‌- 2 పహాడీషరీఫ్‌- 4, కుషాయిగూడ- 7, మహబూబ్‌నగర్‌ రూరల్‌- 2, చౌటుప్పల్‌- 1, మల్కాజిగిరి 2, తుకారాంగేట్‌- 4, సనత్‌నగర్‌- 2, ఎస్‌ఆర్‌నగర్‌- 5, ఉస్మానియా యూనివర్సిటీ- 2, మలక్‌పేట్‌- 1, కార్ఖానా- 1, చిక్కడపల్లి- 1, లాలాగూడ- 1, మారేడుపల్లి- 2.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని