logo

Crime News: ఫేస్‌బుక్‌ మిత్రుడితో.. ప్రియుడిని హత్య చేయించిన గృహిణి

తనను పెళ్లి చేసుకోకుంటే తమ అక్రమ సంబంధాన్ని బయటపెడతానని ఓ గృహిణిని ఆమె ప్రియుడు బెదిరించాడు. ఆందోళన చెందిన ఆమె తన ఫేస్‌బుక్‌ మిత్రుడితో ప్రియుడిని హత్య చేయించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ఇద్దరిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated : 12 May 2022 07:21 IST

బాలాపూర్‌, న్యూస్‌టుడే: తనను పెళ్లి చేసుకోకుంటే తమ అక్రమ సంబంధాన్ని బయటపెడతానని ఓ గృహిణిని ఆమె ప్రియుడు బెదిరించాడు. ఆందోళన చెందిన ఆమె తన ఫేస్‌బుక్‌ మిత్రుడితో ప్రియుడిని హత్య చేయించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ఇద్దరిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం... బాగ్‌ అంబర్‌పేటకు చెందిన యశ్మకుమార్‌(32) వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్‌. మీర్‌పేట ప్రశాంతిహిల్స్‌కు చెందిన శ్వేతారెడ్డి(32) గృహిణి. వీరిద్దరూ 2018లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచమయ్యారు. చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. అతను ఆమెకు ఫోన్‌ చేసి నగ్నంగా తనకు వీడియో కాల్‌ చేయాలని కోరగా ఆమె అదే విధంగా చేసింది. నెల రోజుల నుంచి అతను ఆమెకు ఫోన్‌ చేసి తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే ఆ వీడియో, ఫొటోలను  అందరికీ పంపిస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె భయపడి అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన అంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువురు మండలానికి చెందిన కొంగల అశోక్‌(28)కు ఫోన్‌ చేసి యశ్మకుమార్‌ను హత్య చేయాలని చెప్పింది.  ఆ మేరకు అతను ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌కు వచ్చాడు. అదే రోజు రాత్రి యశ్మకుమార్‌కు ఆమె ఫోన్‌ చేసి ప్రశాంతిహిల్స్‌కు రప్పించి, విషయాన్ని అశోక్‌కు తెలిపింది. అర్ధరాత్రి సమయంలో అశోక్‌ మరో వ్యక్తి కార్తిక్‌తో కలిసి యశ్మకుమార్‌ ఉన్న చోటుకు చేరుకుని వెనుక నుంచి తలపై సుత్తితో రెండు మూడుసార్లు బలంగా కొట్టి పరారయ్యారు.  ఆసుపత్రిలో చేర్పించగా 6వ తేదీ మధ్యాహ్నం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, ఏసీపీ పురుషోత్తంరెడ్డిల పర్యవేక్షణలో దర్యాప్తు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి సీసీ పుటేజీల సహాయంతో శ్వేతారెడ్డితో పాటు హత్యకు పాల్పడిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని