TS News: ఆలంబాగ్ అన్నారు.. ఆనవాలు లేకుండా చేశారు!
ఈనాడు, హైదరాబాద్: సీబీఎస్ హ్యాంగర్ కుప్ప కూలి మూడేళ్లు అయ్యింది. లక్నోలోని ఆలంబాగ్ బస్సు స్టేషన్ మాదిరి నిర్మించాలని ప్రతిపాదించి, ఆర్టీసీ ప్రతినిధి బృందం 2019 ఫిబ్రవరిలో అక్కడికి వెళ్లింది. మూడ్రోజుల పాటు లక్నోలోనే ఉండి, బస్సు స్టేషన్‌తో పాటు.. అక్కడ బస్సుల గమనాన్ని పరిశీలించింది. అలాగే గుజరాత్లో నిర్మించిన ఆధునిక బస్సు స్టేషన్ వివరాలు కూడా తెప్పించికొని అధ్యయనం చేసింది. చివరికి ఆలంబాగ్ బస్సు స్టేషన్వైపే మొగ్గు చూపింది. అక్కడి అధికారులతో కూడా సమావేశమై.. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందో లేదో పరిశీలించింది. నివేదిక సిద్ధం చేసి, మూడేళ్ల గడిచినా ఇప్పుడు దాని ఊసే లేకుండా పోయింది.
అడుగు కూడా పడలేదు..
2018 జులై 5న సీబీఎస్ కుప్పకూలింది. దీంతో అక్కడ ఆర్టీసీకి 4.50 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. కూలిన హ్యాంగర్‌ను తొలగించడానికే దాదాపు ఏడాది పట్టింది. ఆ తర్వాత నిర్మాణాలు చేపడతారని భావించినా నేటికి అది నేటికి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం అక్కడ బస్సు పాస్‌లు జారీ చేసే కేంద్రం, ఆ పక్కనే దూర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైవర్లకు విశ్రాంతి గదులు తప్ప మరేమీ లేవు. సిటీ బస్సుల ఛేంజ్ఓవర్ పాయింట్‌గా ఉంది. సీబీఎస్ స్థలంలో పీపీపీ పద్ధతిలో బస్సు స్టేషన్ నిర్మిస్తే ఆదాయం తప్ప వ్యయం ఉండకపోయినా.. ఆర్టీసీ ఆ దిశగా ఆలోచించడంలేదు.