logo

సర్కారు దవాఖానాల బలోపేతానికి చర్యలు

సర్కారు దవాఖానాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జడ్పీ సమావేశ మందిరంలో మంత్రి సబితారెడ్డితో కలిసి

Published : 24 May 2022 02:06 IST

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: సర్కారు దవాఖానాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జడ్పీ సమావేశ మందిరంలో మంత్రి సబితారెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ఆసుపత్రులలో వైద్య పరికరాలు పనిచేయకపోతే 24 గంటల్లో మరమ్మతులు చేయాలని ఆదేశించారు. మందుల కొరత లేదని, వైద్యులు ఎవరూ బయట కొనుగోలు చేయాలని చీటీలు రాయవద్దని సూచించారు. జిల్లాకు మంజూరైన 22 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇబ్రహీంపట్నం, కొండాపూర్‌, చేవెళ్ల ఆసుపత్రులలో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్‌కు సూచించారు. కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌, కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ములుగు ప్రాంతం నుంచి వచ్చి రాజేంద్రనగర్‌లో పనిచేస్తున్న వైద్యురాలు సుగుణను మంత్రి హరీష్‌రావు అభినందించారు. హయత్‌నగర్‌లో 62 శాతం సిజేరియన్లు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. షాద్‌నగర్‌కు రెండు బస్తీ దవాఖానాలు మంజూరు చేస్తామని చెప్పారు. యాచారంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరారు. దీనిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ వాణిదేవి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అంజయ్యయాదవ్‌, కాలె యాదయ్య, రాష్ట్ర వైద్యారోగ్య మౌలిక వసతుల కల్పన సంస్థ  ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, డీఎంఈ రమేశ్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ సంచాలకులు జి.శ్రీనివాసరావు, వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ అజయ్‌, జిల్లా డీఎంహెచ్‌వో స్వరాజయలక్ష్మి తదితరులున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని