ఆనందానికి తూకం

‘మదన తాపానికి మందేమిటి?’ అని అడిగితే ‘ఏముంది! ఆలింగనం, అధర చుంబనమూను’ అన్నాడొక వైద్యశిఖామణి. వరూధినికి ఈ చిట్కా ముందే తెలుసు.

Published : 26 Mar 2023 00:45 IST

‘మదన తాపానికి మందేమిటి?’ అని అడిగితే ‘ఏముంది! ఆలింగనం, అధర చుంబనమూను’ అన్నాడొక వైద్యశిఖామణి. వరూధినికి ఈ చిట్కా ముందే తెలుసు. ప్రవరుణ్ని చూడగానే ఆమెను మదనతాపం ఆవరించింది. ఆ మాట స్వయంగా ఆవిడ మాయాప్రవరుడితో చెప్పింది. ‘కాకకున్‌ పాలయి రాత్రి పంచశరు బారికి(మన్మథుడికి) చిక్కితి నీకు దక్కితిన్‌’ అంటూ ఉద్వేగానికి గురైంది. ఆ కాకలో ఉన్నప్పుడే ‘పై అంచుల్‌ మోవగ కౌగిలించి...’ ప్రవరుడి పెదాలను చుంబించబోయింది. ఇది పూర్తిగా ఇంద్రియ సుఖానికి చెందిన వ్యవహారం. కాని వరూధిని గడుసుగా ‘ఇంద్రియ సుఖమే బ్రహ్మానందం అంటే’ అని సిద్ధాంతం చేస్తూ ‘ఆనందో బ్రహ్మయటన్న ప్రాచదువున(వేదాల) అంతర్బుద్ధిని ఊహింపుమా’ అంటూ ప్రవరుడితో వాదానికి దిగింది. ‘చెప్పకుము ఇట్టి తుచ్ఛ సుఖముల్‌ మీసాలపై తేనియల్‌’ అంటూ ప్రవరుడు ఆమెను వారించాడని మనుచరిత్ర చెబుతోంది. సుఖలాలసత మనిషికి సహజమే అయినా, వాటిలో స్థాయీ భేదాలున్నాయి. మహాభారతంలో దుష్యంతుడు సొంత భార్యనే గుర్తుపట్టక ‘నీవెవరో తెలియదు, ఈ బాలుణ్నీ ఎరుగను’ అన్నాడు. ‘వాడు నీ కొడుకే. ఒకసారి వాణ్ని ఆలింగనం చేసుకొంటే నీకే తెలుస్తుంది’ అంది శకుంతల. ‘ముత్యాల హారాలు ధరించినప్పటి శీతల స్పర్శ, పచ్చకర్పూరం పూసుకుంటే కలిగే సుఖం, చల్లని వెన్నెల నుంచి ప్రసరించే హాయి... ఇవన్నీ సొంత కొడుకును హత్తుకున్నప్పుడు కలిగే సుఖం ముందు దిగదుడుపు’ అని తేల్చిచెప్పింది. శకుంతల పేర్కొన్నవన్నీ శారీరక సుఖానికి చెందినవే కావడం విశేషం. నిద్ర సైతం ఆ పద్దులోదే. కాబట్టే విశ్వనాథ కల్పవృక్షంలో సీతమ్మ ‘నేను నీ ప్రక్కన్‌ మేల్కొని యుందు, నీవు సుఖ నిద్రం గాంచుము’ అంటుంది భర్తతో.

వాస్తవానికి సుఖం సంతోషం ఆనందం... అనేవి వేరువేరు అనుభూతులు. కవులు ఆ తేడాను వివరించే ప్రయత్నం చేశారు. ‘వేసవి తాపాన వేసారి తరు ఛాయ(చెట్టు నీడన) చల్లంగ మది తెప్పరిల్లునపుడు...’ కలిగే తరహా శారీరక సంతృప్తిని సుఖం అన్నారు. ‘మహనీయుడెవరైన మనకడ కేతెంచి చెలిమితో హృద్యంగ పలికినపుడు...’ మనసులో కలిగేదాన్ని సంతోషం అన్నారు. ఆనందం వీటికన్నా ఉన్నతమైనది. ‘పేదల వెతలను ప్రేమార తొలగించి, పట్టెడు మెతుకులు పెట్టునపుడు...’ లోలోపల ఉబికే తియ్యని అనుభూతిని ఆనందంగా పేర్కొన్నారు. అది ఆత్మకు చెందిన సంతృప్తి. సుఖసంతోషాల కన్నా ఆనందం ఎంతో సాంద్రతరమైనది. ఆనందమయ స్థితిలో శారీరక మానసిక వ్యవస్థలు సైతం ఉత్తేజభరితమవుతాయి. ‘బొటవ్రేల ముల్లోకములు చూచి లోలోన ఆనందపడు నోరులేని యోగి’ అంటూ కవి జాషువా పసివారి గురించి చెప్పిన అసలు సిసలు ఆనందమయ స్థితి అదే. యోగులు ఇష్టపడేది ఆ స్థితినే. విశేష సుఖభోగాలతో విరక్తి చెందిన ధూర్జటి చివరకు సత్యాన్ని గ్రహించి... ‘ఛీ! సంసార దురాశలన్‌ ఉడుపుమో శ్రీకాళహస్తీశ్వరా’ అంటూ అసలుసిసలు ‘ఆత్మానంద సబ్రహ్మచారి’ అయిన ఆనందం కోసం ఆరాటపడ్డాడు. నన్నయ్య అన్నట్లు ‘ఎయ్యది హృద్యము...’ ఏది మనిషికి గొప్ప ఆనందాన్నిస్తుందో తేల్చుకోవడంలోనే ఉంది కిటుకంతా! అమెరికాకు చెందిన ఒక ప్రసిద్ధ సంస్థ ‘హ్యాపీనెస్‌ ర్యాంకు’ల్లో ఫిన్లాండ్‌ దేశానికి అగ్రస్థానం కట్టబెట్టింది. ‘గ్లోబల్‌ సర్వే డేటా’ ఆధారంగా మొన్న మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ నాటి ప్రకటనలో ఆ సంస్థ భారత్‌ది 125వ స్థానమని తేల్చింది. ఇంద్రియసుఖాల బెల్లంపాకం తీపికే లొట్టలు వేసే స్థితినుంచి- అసలైన ఆనందస్థితి వంటి పట్టుతేనె మాధుర్యం స్థాయికి మన అభిరుచులు ఎదిగితే తప్ప, ఇప్పట్లో ఫిన్లాండ్‌ను మనం సమీపించలేం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు