కాలేయానికి పెనుముప్పు

శరీరంలో విషతుల్య పదార్థాల పరిహరణ, మాంసకృత్తుల సంశ్లేషణ వంటివాటిలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒంట్లో నిశ్శబ్దంగా పాగావేస్తున్న హెపటైటిస్‌- కాలేయాన్ని కుంగదీసి ప్రాణాలను తోడేస్తోంది. ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకు హెపటైటిస్‌లో అయిదు రకాలున్నాయి.

Published : 16 Apr 2024 00:40 IST

రీరంలో విషతుల్య పదార్థాల పరిహరణ, మాంసకృత్తుల సంశ్లేషణ వంటివాటిలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒంట్లో నిశ్శబ్దంగా పాగావేస్తున్న హెపటైటిస్‌- కాలేయాన్ని కుంగదీసి ప్రాణాలను తోడేస్తోంది. ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకు హెపటైటిస్‌లో అయిదు రకాలున్నాయి. వాటిలో ప్రమాదకరమైనవి... హెపటైటిస్‌-బి, సి. అవి దేహంలో దీర్ఘకాలం తిష్ఠవేసి కాలేయ వైఫల్యానికి,  క్యాన్సర్‌కు దారితీస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజా నివేదిక ప్రకారం హెపటైటిస్‌ విజృంభణ వల్ల ప్రపంచవ్యాప్తంగా 2022లో 13 లక్షల ప్రాణదీపాలు కొండెక్కిపోయాయి. 2019తో పోలిస్తే- మృతుల సంఖ్య రెండు లక్షలు అధికమైంది. హెపటైటిస్‌-బి, సి రకాలు రెండూ కలిసి రోజుకు మూడున్నర వేల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది హెపటైటిస్‌-బి బాధితులుండగా- ‘ఇ’ రకం వైరస్‌ గుప్పిట్లో చిక్కిన వారి సంఖ్య అయిదు కోట్లు. చైనా తరవాత భారతావనిలోనే అత్యధికంగా దాదాపు మూడు కోట్ల మంది హెపటైటిస్‌-బితో చిక్కిశల్యమవుతున్నారు. ‘సి’ రకం వైరస్‌ పీడితుల పరంగా 55 లక్షలమందితో పాకిస్థాన్‌ తరవాతి స్థానం ఇండియాదే! డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం 2022లో దేశీయంగా దాదాపు రెండు లక్షల మంది కొత్తగా బి, సి వైరస్‌ల బారిన పడ్డారు. అదే సంవత్సరం వీటివల్ల ఇండియాలో 1.23 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రక్తమార్పిడి, లైంగిక సంపర్కం, సిరంజీల వాడకం తదితరాల్లో సురక్షిత విధానాలను పాటించకపోవడమే హెపటైటిస్‌ వైరస్‌ల వ్యాప్తికి ఎక్కువగా కారణమవుతోంది. మద్యం సేవించేవారికి అది మరింతగా ప్రాణాంతకమవుతోంది. ప్రజల్లో అవగాహన రాహిత్యానికి తోడు వ్యాధి నివారణ ప్రణాళికలు కాగితాలకే పరిమితమవుతుండటంతో హెపటైటిస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది!

దేశీయంగా హైపటైటిస్‌ను 2030 నాటికి పూర్తిగా అరికట్టాలన్న లక్ష్యంతో ఆరేళ్ల కిందట కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల్లో చైతన్యం పెంచడం, తొలిదశలోనే వైరస్‌ నిర్ధారణ, ఔషధాలను అందజేయడం, గర్భిణులపై ప్రత్యేక దృష్టి వంటి ఘనసంకల్పాలు అప్పట్లో మోతెక్కిపోయాయి. కానీ, ఆశించిన ఫలితాలే కొరవడ్డాయి. వాస్తవానికి హైపటైటిస్‌-బి, సిలను కట్టడిచేసే ఔషధాలు భారతావనిలో తక్కువ ధరకే లభిస్తున్నాయి. ‘బి’ రకం వైరస్‌ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్‌ సైతం అందుబాటులో ఉంది. కానీ, ప్రాథమిక దశలోనే వ్యాధి నిర్ధారణ జరగకపోవడం- ఎందరి జీవితాలనో బలితీసుకుంటోంది. ఇండియాలో ప్రతి పది మంది హెపటైటిస్‌ బాధితుల్లో ఒక్కరే దాని బారినపడినట్లు గుర్తిస్తున్నారు. భారతీయుల్లో 23శాతానికే ‘బి’ రకం వైరస్‌ టీకా అందినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశీయంగా హెపటైటిస్‌-బి వైరస్‌ ప్రసవ సమయంలో తల్లుల నుంచి బిడ్డలకు అధికంగా సోకుతోంది. దాన్ని నివారించాలంటే- గర్భిణులందరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. హెపటైటిస్‌-బి నుంచి రక్షణ లభించాలంటే- పుట్టిన 24 గంటల్లోగా శిశువుకు టీకా అందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రసవాలన్నీ ఆసుపత్రుల్లోనే జరిగితేనే చిన్నారుల ఆరోగ్యం సురక్షితమవుతుంది. భూటాన్‌, నేపాల్‌, థాయ్‌లాండ్‌ వంటివి సమర్థ ప్రణాళికలతో అయిదేళ్ల వయసు చిన్నారుల్లో హెపటైటిస్‌-బి వ్యాప్తిని ఒక్కశాతం కన్నా తక్కువకు పరిమితం చేయగలిగాయి. ఈజిప్ట్‌లో 87శాతం హెపటైటిస్‌-సి బాధితులను ప్రాథమిక దశలోనే గుర్తించి, సరైన వైద్యం అందిస్తున్నారు. దేశీయంగానూ అటువంటి మేలిమి విధానాలను అందిపుచ్చుకోవాలి. హెపటైటిస్‌ వ్యాప్తిపై ప్రజల్లో విస్తృతావగాహన కల్పించడంతో పాటు పల్లెల్లోనూ వ్యాధి నిర్ధారణ, చికిత్స వసతులను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలి. టీకా రక్షణ ఛత్రం పరిధినీ ప్రభుత్వాలు విస్తరింపజేయాలి. అప్పుడే కాలేయాన్ని గుల్లచేసే హెపటైటిస్‌ కోరల్లోంచి భారతావని బయటపడగలుగుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.