గ్రామీణ ఉపాధికి జగన్‌ గ్రహణం

‘నేను చనిపోయినా ప్రతి పేదవాడి గుండెల్లో ఉండాలన్నదే నా కసి’ అంటూ గత ఎన్నికల సందర్భంగా డైలాగులు వల్లించిన జగన్‌ అక్షరాలా గుండెలు తీసిన బంటు! ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జనాన్ని బురిడీ కొట్టించి అధికారం చేపట్టిన ఫ్యాక్షనిస్టు, అయిదేళ్లుగా నిరుపేదల జీవితాల్ని నరకప్రాయం చేశారు.

Published : 20 Apr 2024 00:51 IST

‘నేను చనిపోయినా ప్రతి పేదవాడి గుండెల్లో ఉండాలన్నదే నా కసి’ అంటూ గత ఎన్నికల సందర్భంగా డైలాగులు వల్లించిన జగన్‌ అక్షరాలా గుండెలు తీసిన బంటు! ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జనాన్ని బురిడీ కొట్టించి అధికారం చేపట్టిన ఫ్యాక్షనిస్టు, అయిదేళ్లుగా నిరుపేదల జీవితాల్ని నరకప్రాయం చేశారు. కాయకష్టం చేస్తే గాని పూట గడవని నిరుపేద కుటుంబాల బతుకు తెరువుకు భరోసా కల్పిస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకం- ఉపాధి హామీ! ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా గరిష్ఠంగా వంద పనిదినాలు ఉపాధి కల్పించే వీలుంది. దాన్ని 150 పనిదినాలకు పెంచడానికి అనుమతించాలంటూ 2020 మే నెలలో కేంద్రానికి లేఖ రాసింది జగన్‌ సర్కారు. జగన్‌ అయిదేళ్ల పాలనలో ఉపాధి కూలీల సగటు పనిదినాలు ఎన్నడూ 55రోజులు దాటనేలేదు! కేంద్రం ప్రకటించే కనీస వేతనాన్ని కూడా కూలీలకు చెల్లించని వైకాపా ప్రభుత్వం అమానవీయ పోకడల కారణంగా 2022-23లో నిరుపేదలకు వాటిల్లిన వేతన నష్టం రూ.1055కోట్లు! జగన్‌ నయా వంచన అంతటితో ఆగలేదు. 2020-21నాటికి రాష్ట్రవ్యాప్తంగా జారీ అయిన ఉపాధి జాబ్‌కార్డుల సంఖ్య 94.89లక్షలు. 2023-24కు వచ్చేసరికి ఆ సంఖ్య 67.71లక్షలకు పడిపోయింది. మరో మాటలో చెప్పాలంటే, 27.18లక్షల కుటుంబాల్ని గ్రామీణ ఉపాధి హామీ భద్రతకు జగన్‌ ప్రభుత్వం దూరం చేసింది. గ్రామీణ ఉపాధి పథకంలో మేటవేస్తున్న అవినీతిని అరికట్టి పారదర్శకత పెంచేందుకంటూ కేంద్రం- జాబ్‌కార్డులతో ఆధార్‌ అనుసంధానాన్ని మొదలుపెట్టింది. కూలీల బ్యాంకు ఖాతాలు జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్‌పీసీఐ)తోనూ ముడివడేలా మ్యాపింగ్‌ ప్రక్రియ సక్రమంగా జరగాల్సి ఉంది. స్వేదం చిందించడమే గాని సాంకేతికత తెలియని శ్రమజీవుల పక్షాన క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సిన జగన్‌ నిష్క్రియా పరత్వం- నిరుపేద నోటి దగ్గర అన్నం ముద్దనే గద్దలా తన్నుకుపోయింది!

ఉపాధి హామీ నిధుల్లో 40శాతాన్ని మెటీరియల్‌ భాగానికి మళ్ళించాలని చట్టం నిర్దేశిస్తున్నా, అలా చేయడం పేద కూలీల కడుపు కొట్టడమే అవుతుందని విపక్ష నేతగా జగన్‌ రుసరుసలాడారు. నేడు అదే జగన్‌ జమానాలో- ‘మెటీరియల్‌ నిధులు పెంచుకోవడం కోసమే కూలీలకు పనులు కల్పించడం లేదు’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఇటీవల స్పష్టీకరించారు. అదే జగన్‌ నిజ నైజం! తెదేపా హయాములో ఉపాధి హామీ కింద గ్రామసీమల్లో దాదాపు పాతిక వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు నిర్మిస్తే దానిపైనా ఒంటి కాలిమీద లేచిన జగన్‌- గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ సెంటర్లు అంటూ... దేన్నీ సక్రమంగా పూర్తి చేయలేకపోయారు. ఉపాధి నిధుల నుంచే కోట్లు వెదజల్లి తన నవరత్నాల లోగో పెట్టించిన జగన్‌- సక్రమంగా కూలీ చెల్లింపు బాధ్యత కేంద్రానిదే అని దులపరించేసుకొన్నారు. కూలీల కష్టాన్ని గుర్తించి కేంద్రం నుంచి వేతనాలు విడుదల అయ్యేలోగా తానే సర్దుబాటు చేసేది తెదేపా సర్కారు! మండుటెండల్లో రోజూ పాతిక లక్షలమంది ఉదయం సాయంత్రం పనులకు హాజరవుతుంటే, వారికి వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల్నీ జగన్‌ ప్రభుత్వం విస్మరించింది. మూడేళ్ల క్రితంనాటి టార్పాలిన్లు పాడైపోవడంతో కొత్తవి పంపాలని సిబ్బంది కోరుతుంటే తాటాకుల పాకలు వెయ్యాలని ప్రభుత్వం ఉచిత సలహాలిస్తోంది. రెండు నెలలుగా జీతాల్లేని తాము డబ్బులెలా సర్దుబాటు చేయాలని క్ష్రేత సహాయకులు మొత్తుకొంటున్నారు. కనీస వేతనంపై అదనంగా ఫిబ్రవరిలో 20శాతం, మార్చిలో 25శాతం, మే నెలలో 30శాతంగా చెల్లించే వేసవి భృతికీ జగన్‌ సర్కారు కొరత వేసింది. కూలీలకు మజ్జిగ నిమిత్తం రోజుకు చెల్లించే అయిదు రూపాయల్నీ ఆపేసింది. జాబ్‌కార్డులు రద్దు చేస్తామని బెదిరించి మండుటెండల్లో రెండు పూటలా పని చేయిస్తున్న జగన్‌ ప్రభుత్వం- ఉపాధి పేరిట నిరుపేదల ఉసురు తీస్తోంది. పేదల కక్షపాతి జగన్‌ ‘ఉపాధి’ని ఊడబెరికితేనే కోట్లాది శ్రామిక జనం ఊపిరి పీల్చుకోగలిగేది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.