అన్నం ముద్దపైనా అక్కసే!

అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్‌... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్‌ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి.

Updated : 03 May 2024 06:12 IST

రోజూ 2.50 లక్షల మంది పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లపై జగన్‌ రాక్షసత్వం
తెదేపా ఏర్పాటు చేసిందనే కక్షతోనే మూసేసిన వైకాపా సర్కారు
ఈనాడు, అమరావతి

అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్‌... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్‌ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి.

దేన్నయినా సరే.. పడగొట్టడమే తప్ప నిర్మించడం, నిలబెట్టడం వంటివి తెలియని సీఎం జగన్‌... ప్రత్యర్థులపై పగ సాధించడానికి, గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, భవనాలు కూలగొట్టడానికే పదవిని వాడుకున్నారు. చంద్రబాబుపై అక్కసు తీర్చుకోవడానికి అన్న క్యాంటీన్లకు తాళం వేసి, వారి నోటి దగ్గర తిండిని లాగేశారు. చేసుకుందామంటే వైకాపా ఏలుబడిలో ఎలాగూ పనుల్లేవు. ఏం తిని బతకాలి? ‘జనం కోసం అది చేశా. ఇది చేశాన’ని సొంత బాకా ఊదుకోవడమే కానీ... చెప్పిందేదీ ఆయన చేసిన పాపాన పోలేదు. అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం.. పూటకు రూ.5. చొప్పున... మూడు పూటలకూ కలిపి రూ.15కే ఆహారం లభించేది. రోజుకో రకమైన టిఫిన్‌ అందించడమే కాదు, భోజనంలో వేడి అన్నం, కూర, సాంబారు, పచ్చడి, పెరుగు ఉండేవి. పరిశుభ్రమైన వాతావరణంలో.. ఫ్యాన్లు, టీవీ, శుద్ధి చేసిన నీరు... ఉండేవి. 2018 జులై 11న విజయవాడ భవానీపురంలో అప్పటి సీఎం చంద్రబాబు తొలి అన్న క్యాంటీన్‌ ప్రారంభించారు. అదేరోజు 25 పట్టణ స్థానిక సంస్థల్లో 60 క్యాంటీన్లు తెరిచారు. 2019 ఎన్నికల నాటికి వాటి సంఖ్య 154కు చేరింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల ఉసురు తీసింది. ఆ భవనాల్లో కొన్నింటిని వార్డు సచివాలయాలుగా మార్చేసింది. మిగిలిన భవనాలను నిరుపయోగంగా ఉంచి పాడు పెట్టింది.

‘ఆహా’... ఓహో.. అని చెప్పి..

ఎన్నికలకు ఏడాది ముందు జగన్‌ ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆహా’ క్యాంటీన్లు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలాయి. పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 140 చోట్ల వీటికి రిబ్బన్‌ కట్‌ చేశారు. అందులో 65కిపైగా ఇప్పటికే మూత పడ్డాయి. మిగతావి పేరుకు మాత్రమే నడుపుతున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు గత తెదేపా ప్రభుత్వం ఏటా రూ.50 కోట్లకుపైగా కేటాయిస్తే.. జగన్‌ ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. పట్టణ మహిళా సమాఖ్య ద్వారా పొదుపు సంఘాల సభ్యులతో క్యాంటీన్లను ప్రారంభించారు.  క్యాంటీన్‌ ఏర్పాటుకు పెట్టుబడి కింద ఇచ్చిన రూ.13,500 తిరిగి నెలకు రూ.500 చొప్పున నిర్వాహకులు చెల్లించాలి. పెట్టుబడి నిధి లేక.. వ్యాపారాలు సవ్యంగా సాగక క్రమంగా క్యాంటీన్లు మూతపడ్డాయి. వీటిపై సీఎం సమీక్ష కూడా చేసిన పాపాన పోలేదు.

రైతులూ, కూలీలకు మిగిల్చిన కష్టం!

  • గ్రామాల నుంచి పట్టణాలకు రోజూ కూరగాయాలు తెచ్చి వీధుల్లో, రైతుబజార్లలో విక్రయించే పేద రైతులకు అన్న క్యాంటీన్లు ఎంతో సౌలభ్యంగా ఉండేవి. రూ.10కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందేది. క్యాంటీన్లు ప్రారంభించక ముందు ఇదే రైతులు టిఫిన్‌, భోజనానికి కలిపి రోజూ రూ.100 వరకు ఖర్చు చేసేవారు. అన్న క్యాంటీన్లు మూసేశాక భోజనం ఖర్చులు పెరిగాయని విజయవాడలోని పటమట రైతుబజారుకు రోజూ గ్రామాల నుంచి కూరగాయలు తెచ్చి విక్రయించే పలువురు రైతులు తెలిపారు. ఈ ప్రాంతంలోని అన్న క్యాంటీన్‌ను మూసేసి అదే భవనంలో వార్డు సచివాలయం పెట్టారు.
  • విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నగరాల్లో భవన నిర్మాణ కూలీలంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి రోజూ వచ్చి పోతుంటారు. అన్న క్యాంటీన్లను ప్రారంభించక ముందువరకు వీరిలో కొందరు ఇళ్ల నుంచి మధ్యాహ్న భోజనం తెచ్చుకునేవారు. మరికొందరు హోటళ్లలో భోజనం చేసేవారు. క్యాంటీన్లు ప్రారంభించాక మధ్యాహ్నం రూ.5కే భోజనం చేసేవారు. వాటిని మూసి వేశాక మళ్లీ భోజన ఖర్చులు పెరిగాయని ఆనందపురం నుంచి విశాఖకు భవన నిర్మాణ పనుల నిమిత్తం రోజూ వచ్చే గణేశ్‌ తెలిపారు.

‘ఆహా’లో ధరలూ ఎక్కువే!

అక్కడక్కడ అరకొరగా నడుస్తున్న ఆహా క్యాంటీన్లలో టిఫిన్‌ రూ.20, భోజనం రూ.40. టిఫిన్‌ కింద రెండు ఇడ్లీ, రెండు దోశెలు, భోజనంలో అన్నం, కూర, సాంబారు ఇస్తున్నారు. శుద్ధి చేసిన తాగునీరు చాలాచోట్ల ఇవ్వడం లేదు.


భోజనం ఖర్చు 100కి పెరిగింది
- జి.అచ్చియ్య, సత్తెనపల్లి

అన్న క్యాంటీన్లు తొలగించి నిరుపేదలకు తీవ్రమైన అన్యాయం చేశారు. వీటిని మూసి వేశాక ఉదయం టిఫిన్‌, టీ కోసం రూ.30, మధ్యాహ్నం భోజనానికి రూ.70 కలిపి రోజూ రూ.వంద ఖర్చవుతోంది. ఇది మాకు ఎంతో భారం.


నిరుద్యోగ యువతకూ అన్యాయం చేశారు
- టి.శివారెడ్డి, పెదవాల్తేరు, విశాఖపట్నం

అధికారంలో ఎవరున్నా పేదలకు మేలు చేసే కార్యక్రమాలు అమలు చేయాలి తప్పితే రద్దు చేయడం సహేతుకం కాదు. అన్న క్యాంటీన్లు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. వివిధ పనుల కోసం నగరాలు, పట్టణాలకు వచ్చే పేదల ఆకలి తీర్చేవి.


ఆకలి బాధలు తప్పేవి
- జి.సూర్యనారాయణ కూలీ, గుణదల, విజయవాడ

అన్న క్యాంటీన్లలో రూ.15కే మూడు పూటలా ఆహారం లభించేది. క్యాంటీన్లు మూసి వేశాక ఉదయం టిఫిన్‌, టీ ఖర్చులకే రూ.30 కావాలి. చేద్దామంటే   పనుల్లేవు. మధ్యాహ్న భోజనానికి రూ.60 ఖర్చు అవుతోంది. అన్న క్యాంటీన్లు మూసేసి అన్యాయం చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని