జగన్‌ కిరాతకాలకు ఖాకీల దన్ను

ఎట్టకేలకు ఎన్నికల సంఘంలో కదలిక వచ్చింది. వైకాపా కార్యకర్తలను మించి జగన్‌మోహన్‌ రెడ్డికి ఊడిగం చేసిన డీజీపీ రాజేంద్రనాథరెడ్డిపై వేటు పడింది. శాంతిభద్రతల నిర్వహణలో సాటిలేనిదిగా ఒకప్పుడు పేరుగాంచిన ఏపీ పోలీస్‌ యంత్రాంగాన్ని- జగన్‌ కిరాతకాలకు కొమ్ముకాసే కిరాయిసైన్యంగా తీర్చిదిద్దిన మహాపాతకంలో మొదటి ముద్దాయి రాజేంద్రనాథే.

Published : 07 May 2024 00:34 IST

ట్టకేలకు ఎన్నికల సంఘంలో కదలిక వచ్చింది. వైకాపా కార్యకర్తలను మించి జగన్‌మోహన్‌ రెడ్డికి ఊడిగం చేసిన డీజీపీ రాజేంద్రనాథరెడ్డిపై వేటు పడింది. శాంతిభద్రతల నిర్వహణలో సాటిలేనిదిగా ఒకప్పుడు పేరుగాంచిన ఏపీ పోలీస్‌ యంత్రాంగాన్ని- జగన్‌ కిరాతకాలకు కొమ్ముకాసే కిరాయిసైన్యంగా తీర్చిదిద్దిన మహాపాతకంలో మొదటి ముద్దాయి రాజేంద్రనాథే. పదకొండు మంది సీనియర్లను కాదని డీజీపీగా తనను ఏరికోరి ఎంచుకున్న వైకాపా అధినేతకు అడుగడుగునా మడుగులొత్తిన ఆయన- ఖాకీ బట్టల పరువును పాతాళానికి దిగలాగేశారు. మాచర్లలో మారణహోమానికి పాల్పడిన జగన్‌ పార్టీ పిశాచగణాలకు వంతపాడిన రాజేంద్రనాథ్‌- ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక కూడా స్వామిభక్తి మత్తులోనే పీకల్లోతు మునిగితేలారు. ఎలెక్షన్‌ ప్రచారంలో ఉన్న విపక్ష బృందాలపై దాడులకు తెగబడిన వైకాపాసురులకు పరోక్షంగా వత్తాసు పలికారు. రాజేంద్రనాథరెడ్డికి ముందు పోలీస్‌ బాస్‌గా పనిచేసిన గౌతమ్‌ సవాంగ్‌ సైతం జగన్‌ సేవలోనే తరించిపోయారు. ‘ప్రజల పక్షాన నిలబడండి’ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులకు సుద్దులెన్నో చెప్పిన జగన్‌మోహన్‌ రెడ్డి- అధికారంలోకి వచ్చాక ఆ ఖాకీలతోనే మానవ హక్కులను కాలరాయించారు. అంగన్‌వాడీలపై అణచివేత నుంచి అమరావతి రైతులపై దమనకాండ దాకా జగన్‌ జమానాలో నోరెత్తిన వారందరిపై లాఠీలు విరిగాయి. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, జగన్‌ విమర్శకులపై దొంగ కేసులెన్నో మొలుచుకొచ్చాయి. ‘అక్రమంగా నిర్బంధించి పాదాలపై కొట్టడం ఇక్కడి పోలీసులకు ఆచారమా’ అని రాష్ట్ర హైకోర్టే మండిపడేంతగా జగన్‌ ఏలుబడిలో అరాచకత్వం నగ్నంగా నాట్యమాడింది. కర్కశ ఖాకీ మూకల దన్నుతో నిరంకుశంగా పాలించిన జగన్‌- రాష్ట్రాన్ని అన్ని రకాలుగా పీల్చిపిప్పిచేశారు!

అవినీతి మడుగులో మహదానందంగా ఈదులాడిన భ్రష్టనేతగా జగన్‌ ఏనాడో పరువుమాశారు. అక్రమార్కుడిగా తాను మూటగట్టుకున్న తరగని అప్రతిష్ఠను ఇతరులకూ అంటించేందుకు సీఎం పదవిని ఆయన విచ్చలవిడిగా వాడుకున్నారు. చంద్రబాబుపై స్కిల్‌ కేసు బనాయించి, నిశిరాత్రి వేళ ఆయనను అన్యాయంగా అరెస్టు చేయించారు. జగన్‌ కసి కళ్లను చల్లబరిచేందుకు చట్టాలనే కాలదన్నిన పోలీసులు- జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో వీరంగాలాడారు. జగన్‌ పార్టీ ప్రబుద్ధ నేతల మేతలపై నెల్లూరు జిల్లా కావలిలో నిరసనలకు దిగిన భాజపా నాయకులపై దాష్టీకాలకు పాల్పడ్డారు. వైకాపా ఎంపీగా జగన్‌ దమననీతిని నిగ్గదీసిన రఘురామరాజుపై అంతులేని ఖాకీ క్రౌర్యాన్ని ప్రదర్శించారు. 2019 ఎన్నికల సందర్భంగా అర్హులైన ఓటర్లను జాబితాలోంచి తీసిపారేయించేందుకు ఈసీకి వైకాపా సానుభూతిపరులు అప్పట్లో గంపగుత్తగా దరఖాస్తులు చేశారు. ఆ కుట్రలపై దాఖలైన కేసుల్లో చాలావాటిని జగన్‌ సీఎం అయ్యాక పోలీసులు మూసేశారు. ఐపీ అడ్రెస్‌లు తెలియలేదంటూ జగన్‌ పార్టీ ప్రబుద్ధులను వదిలేసిన అదే ఖాకీలు- వైకాపా సర్కారుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శనాత్మక పోస్టులు పెట్టిన సామాన్యులనూ వెంటాడి వేధించారు. ముఖ్యంగా ఏపీ సీఐడీ- జగన్‌కు గిట్టని వాళ్లందరినీ కాల్చుకుతినే పైశాచిక విభాగంగా తయారైంది. వైకాపా నేతలు, పోలీసుల అమానుష వేధింపులకు గడచిన అయిదేళ్లలో ఎందరో దళితులు, మైనారిటీలు బలైపోయారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కూలదోసి సొంత శాసనాలను అమలుచేసిన జగన్‌- ప్రజారక్షకులైన పోలీసులను ప్రజాశత్రువులుగా మార్చేశారు. ప్రజల ధనమాన ప్రాణాలకు కనీస భద్రత లేని తాలిబన్ల రాజ్యాన్ని ఏపీకి తీసుకొచ్చిన నియంత జగన్‌. అటువంటి పాపాల భైరవుడి చెరలోంచి స్వరాష్ట్రాన్ని రక్షించుకునేందుకు ప్రజలు ఇప్పటికే కంకణ బద్ధులయ్యారు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.