నేర ముఠాల గుప్పిట్లో బాల్యం

అడ్డూఆపూ లేకుండా పేట్రేగిపోతున్న మానవ అక్రమ రవాణా ముఠాలు- కల్లాకపటం ఎరగని పసిపిల్లల నునులేత దేహాలతో అమానుష వ్యాపారానికి తెగబడుతున్నాయి. వాటి కోరల్లో చిక్కుతున్న చిన్నారుల జీవితాలెన్నో అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.

Published : 09 May 2024 02:06 IST

డ్డూఆపూ లేకుండా పేట్రేగిపోతున్న మానవ అక్రమ రవాణా ముఠాలు- కల్లాకపటం ఎరగని పసిపిల్లల నునులేత దేహాలతో అమానుష వ్యాపారానికి తెగబడుతున్నాయి. వాటి కోరల్లో చిక్కుతున్న చిన్నారుల జీవితాలెన్నో అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. విచ్చలవిడిగా పిల్లల అపహరణలకు పాల్పడుతున్న అక్రమ రవాణా దందాసురులు- పేద కుటుంబాల నిస్సహాయత, ఆడపిల్లలను గుండెల మీద కుంపటిలా భావించే సామాజిక దుర్విచక్షణలను సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో తల్లిదండ్రులకు ఎరవేసి ఒక నెల నుంచి ఏడాది వయసున్న నలభై మంది దాకా పసివారిని నాసిక్‌లో అమ్మేసిన  ఓ ముఠా నేరచరిత్ర నిరుడు వెలుగులోకి వచ్చి, తీవ్ర గగ్గోలు రేపింది. కళ్లు తెరిచి కొద్దిరోజులైనా కాని ముగ్గురు పసికందుల్ని నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయలకు విక్రయిస్తున్న ముఠా ఒకటి ఇటీవల దిల్లీలో సీబీఐ చేతికి చిక్కింది. ముంబయిలోనూ ఇటువంటి అమానవీయ దందాలకు ఒడిగడుతున్న వైద్యుడితో పాటు ఏడుగురు వ్యక్తులను పోలీసులు కొద్దిరోజుల క్రితం కటకటాల్లోకి నెట్టారు. దుర్భర దారిద్య్రంలో మగ్గిపోతున్న కుటుంబాలకు గాలమేస్తున్న హేయ నేరగాళ్లు- చిన్నారులను చెరపట్టి వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. ఆ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి పసివారిని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు తీసుకొచ్చి- ఇక్కడి ఇటుక బట్టీలు, హోటళ్లు, గాజుల తయారీ, ఇతర పరిశ్రమల్లో బలవంతంగా పని చేయిస్తున్న ఉదంతాలు గతంలో బయటపడ్డాయి. అక్రమ రవాణా ముఠాల చేతచిక్కిన ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌ బాలలు కొందరిని తాజాగా కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో అధికారులు గుర్తించారు. కాసుల కక్కుర్తితో బంగారు బాల్యాన్ని పీక్కుతింటున్న కిరాతకులు క్షమార్హులు కానేకారు.

తైవాన్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా, కెనడా వంటి చోట్ల మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాయి. ఆ మేరకు క్రియాశీల కార్యాచరణ కొరవడిన భారతావనిలో జుగుప్సాకర నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం దేశీయంగా 47 వేలకు పైగా పిల్లల ఆచూకీ తెలియడంలేదు. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలో పెద్ద సంఖ్యలో బాలలు అక్రమ రవాణా పాలబడుతున్నట్లు నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాస్‌ సత్యార్థి ఫౌండేషన్‌ నిరుడే తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. పిల్లల అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించాలన్నది సుప్రీంకోర్టు గత నిర్దేశం. దాన్ని ఔదలదాల్చని పోలీసుల నేరపూరిత నిర్లక్ష్యమే చాలా సందర్భాల్లో బాధిత తల్లిదండ్రులను గర్భశోకంలోకి నెట్టేస్తోంది. రాష్ట్రాల మధ్య సమన్వయ లోపమూ నేరముఠాలకు వరమవుతోంది. చిన్నారుల అక్రమ తరలింపు, మత్తుపదార్థాల వినియోగంపై నివేదికల సమర్పణలో అలవిమాలిన జాప్యానికిగానూ ఏపీలోని 20 జిల్లాల కలెక్టర్లకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎన్‌సీపీసీఆర్‌) ఇటీవల సమన్లు జారీచేసింది. అధికార యంత్రాంగంలో మేటవేసిన దారుణ అలక్ష్యానికి అది అద్దంపట్టింది. ఉద్యోగాల పేరిట అమ్మాయిలపై వలవేసి, వారిని పడుపు వృత్తిలోకి దింపుతున్న కర్కశ మూకల కూసాలు విరగ్గొట్టేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ కలిసికట్టుగా పనిచేయాలి. వెట్టిచాకిరిలో అలమటిస్తున్న బాలబాలికలకు విముక్తి కలిగించి, వారిని బడిబాట పట్టించాలి. ఎన్నో సామాజిక సంక్షోభాలకు, నేరాలకు కారణమవుతున్న పేదరికాన్ని నిజంగా రూపుమాపేందుకు ఉపాధి అవకాశాల కల్పనను ప్రభుత్వాలు విస్తృతం చేయాలి. అప్పుడే సురక్షిత వాతావరణంలో బాలభారతం ఆరోగ్యకరంగా ఎదుగుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.