icon icon icon
icon icon icon

Amit Shah: అబద్ధాలతో గెలవాలని కాంగ్రెస్‌ ప్రయత్నం: అమిత్‌షా

‘రాహుల్‌ పిల్ల చేష్టల గ్యారంటీ.. మోదీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Updated : 09 May 2024 15:49 IST

భువనగిరి: ‘రాహుల్‌ పిల్ల చేష్టల గ్యారంటీలు.. మోదీ గ్యారంటీల మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా తయారైందని, ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకట్లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఏం చెబుతారో దానిని తప్పకుండా చేస్తారని, రాహుల్‌ ఇచ్చిన గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి లేదని అన్నారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘ రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ అమలు కాలేదు. వారికి ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం ఇవ్వలేదు. వరి, గోధుమలకు రూ.500 బోనస్‌ అందించలేదు. కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలను ఎన్నటికీ నెరవేర్చదు. ఆ పార్టీ 70 ఏళ్లుగా అయోధ్య విషయాన్ని పక్కన పెట్టింది. 

నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీ మధ్య జరుగుతున్న ఎన్నికలివి. కుటుంబ అభివృద్ధి- దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి మధ్య ఎన్నికలు. మూడు విడతల్లో ఇప్పటికే 200 సీట్లకు పైగా స్థానాలు గెలుస్తాం. దేశవ్యాప్తంగా మొత్తం 400 లోక్‌సభ స్థానాలు సాధిస్తాం. తెలంగాణలో గత ఎన్నికల్లో 4 లోక్‌సభ సీట్లు గెలిచాం. ఈసారి 10కి పైగా గెలుస్తాం. రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ స్కోర్‌తో దేశంలో 400 సీట్లకు మార్గం సుగమం అవుతుంది. అబద్ధాలతో ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్‌ యత్నిస్తోంది. 

ఆ మూడు పార్టీల మధ్య త్రికోణ బంధం

మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని అవాస్తవాలు చెబుతున్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు నష్టం వాటిల్లుతుంది.  కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. రాజస్థాన్‌, తెలంగాణ ప్రజలకు కశ్మీర్‌తో ఏం సంబంధమని ఖర్గే ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశాం. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని మోదీ పరిసమాప్తం చేశారు. దేశాన్ని సురక్షితంగా ఉంచారు. కాంగ్రెస్‌, భారాస, మజ్లిస్‌ మధ్య త్రికోణ బంధం ఉంది. మూడు పార్టీలు హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించవు. రద్దు చేసిన ట్రిపుల్‌ తలాక్‌ను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నారు. 

భారాస హయాంలో కుటుంబమే బాగుపడింది

భువనగిరి టెక్స్‌టైల్‌ పరిశ్రమల కోసం మోదీ కృషి చేశారు. రూ.1500 కోట్లతో జాతీయ టెక్స్‌టైల్‌ విధానం అమల్లోకి తెచ్చాం. భువనగిరి నుంచి భూపాలపల్లి వరకు జాతీయ రహదారి నిర్మించాం. బీబీ నగర్‌ ఎయిమ్స్‌ నిర్మించి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. జనగామ నుంచి భువనగిరి వరకు రైల్వే లైన్ల ఆధునికీకరణ చేపట్టాం. కొమురవెల్లిలో అత్యాధునిక రైల్వే స్టేషన్‌ నిర్మిస్తున్నాం. భారాస ప్రభుత్వ హయాంలో కుటుంబం మాత్రమే బాగుపడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది’’ అని అమిత్‌షా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img