icon icon icon
icon icon icon

Chandrababu: సైకోను శాశ్వతంగా ఇంటికి పంపాలి: చంద్రబాబు

పట్టాదారు పాసుపుస్తకంపై జగన్‌ తన ఫొటో వేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Updated : 29 Apr 2024 20:45 IST

డోన్‌: పట్టాదారు పాసుపుస్తకంపై జగన్‌ తన ఫొటో వేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజల భూములను జగన్‌ పేరుతో రాసుకుంటున్నారని ఆరోపించారు. తన భూములను ఇతరుల పేరిట మార్చారని తీవ్ర ఆవేదనకు గురై ఓ చేనేతకారుడు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులూ చనిపోయారన్నారు. నంద్యాల జిల్లా డోన్‌లో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ద్వారా జగన్‌.. ప్రజల ఆస్తులు కొట్టేసే యత్నం చేస్తున్నారని విమర్శించారు.

తెదేపాది సామాజిక న్యాయమని, జగన్‌ది సామాజిక ద్రోహమని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘ రాయలసీమకు వైకాపా నాయకులు ఏమైనా చేశారా?ప్రాజెక్టులు కట్టారా? రోడ్లు వేశారా? పరిశ్రమలు తెచ్చారా? ఏమీ చేయని నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలి? పార్టీ రంగుల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. సైకో జగన్‌కు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి. ప్రభుత్వ సలహాదారులకు రూ.700 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రకటనల కోసం సాక్షి మీడియాకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చారు. ఆరోగ్యశ్రీకి రూ.1500 కోట్ల మేర బకాయిలు పెట్టి.. ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారు. ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తామని సర్వనాశనం చేశారు. జగన్‌ పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా చంపేశారు. రైతు మెడ నొక్కారు.. ప్రస్తుతం రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రైతు కూలీలు దీనావస్థలో ఉన్నారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా చేసిన పార్టీ తెదేపా’’ అని చంద్రబాబు అన్నారు.

మహాశక్తి కింద 4 కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘‘మహిళల నిధి కింద నెలకు రూ.1500 అందజేస్తాం. తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తాం. మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. డ్వాక్రా సంఘాల్లో మహిళలను లక్షాధికారులను చేస్తాం. ఒక్కో సంఘానికి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. మహిళలను ప్రతి ఇంటికి ఆర్థిక మంత్రిగా చేస్తాం’’  అని చంద్రబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img