icon icon icon
icon icon icon

నియోజకవర్గంగా వర్ధిల్లి.. డివిజన్‌గా మెరిసి..

రామాయంపేట.. పరిచయం అక్కర్లేని ప్రాంతం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన ఘనత దక్కించుకుంది. ఒకప్పుడు వెలుగొందిన ఈ నియోజకవర్గం ప్రస్తుతం మెదక్‌లో కలిసిపోయింది. ఇటీవల రామాయంపేట కేంద్రంగా డివిజన్‌ కేంద్రం ఏర్పడటం గమనార్హం.

Updated : 12 Nov 2023 11:52 IST

రామాయంపేట, న్యూస్‌టుడే, రామాయంపేట

తాలూకా కార్యాలయం

రామాయంపేట.. పరిచయం అక్కర్లేని ప్రాంతం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన ఘనత దక్కించుకుంది. ఒకప్పుడు వెలుగొందిన ఈ నియోజకవర్గం ప్రస్తుతం మెదక్‌లో కలిసిపోయింది. ఇటీవల రామాయంపేట కేంద్రంగా డివిజన్‌ కేంద్రం ఏర్పడటం గమనార్హం.

1952లో రామాయంపేట నియోజకవర్గం ఏర్పాటైంది. ఆ తర్వాత గజ్వేల్‌తో కలిసి 1978 వరకు కొనసాగింది. ఇక అక్కడి నుంచి 2009 వరకు సొంత నియోజకవర్గంగా వెలుగొందింది. ఈ కాలంలో 8 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆర్‌.ముత్యంరెడ్డి, టి.అంజయ్య, ఆర్‌.ఎస్‌.వాసురెడ్డి, విఠల్‌రెడ్డి, వాసుదేవరావు, పద్మాదేవేందర్‌రెడ్డిలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2008లో తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు విజయం అందుకున్నారు. ఏడాది పాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామాయంపేట తన ప్రాభవాన్ని కోల్పోయింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో రామాయంపేట మండలాన్ని మెదక్‌ నియోజకవర్గంలో కలిపేశారు.

అంజయ్య

అనూహ్య పరిణామాలతో..

నియోజకవర్గ పరిధిలో రామాయంపేటతో పాటు చేగుంట, చిన్నశంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి మండలాలతో పాటు మెదక్‌ మండలంలోని 14 గ్రామపంచాయతీలు ఉండేవి. చిన్నశంకరంపేట మండలానికి చెందిన ఆర్‌.ముత్యంరెడ్డి 1978లో రామాయంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తన ప్రత్యర్థి ఎం.కొండల్‌రెడ్డిపై విజయం పొందారు. రాష్ట్రంలో అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా అంజయ్యను నియమించింది. ఆయన ఆరు నెలల్లో ప్రత్యక్షంగా ఎన్నిక కావాల్సి ఉండటంతో రామాయంపేట నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించారు .అప్పటికే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ముత్యంరెడ్డి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో అంజయ్య 35,235 ఓట్లతో గెలుపొందారు. 1980 అక్టోబరు 11 నుంచి 1982 ఫిబ్రవరి 24 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం ఉన్న ప్రయాణ ప్రాంగణం ఆయనే శంకుస్థాపన చేశారు. 1981 మార్చి 22న రామాయంపేట తాలూకా కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ప్రస్తుతం డివిజన్‌ కేంద్రంగా

నియోజకవర్గ ప్రాభవాన్ని కోల్పోగా స్వరాష్ట్రం వచ్చాక పురపాలికగా మారింది. స్థానికులు డివిజన్‌ కేంద్రంగా మార్చాలని ఏడాదికి పైగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చివరకు ప్రభుత్వం ఇటీవల డివిజన్‌ కేంద్రంగా మార్చింది. రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాలు వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img