icon icon icon
icon icon icon

Kangana Ranaut: ‘కంగనకు కాస్త చరిత్ర చెప్పండి’: భాజపాకు కాంగ్రెస్ నేత సలహా

భాజపా నేత కంగనా రనౌత్‌ (Kangana Ranaut)పై కాంగ్రెస్ నేత ఒకరు తీవ్ర విమర్శలు చేశారు. ఆమెకు కొంచెం చరిత్ర చెప్పాలని సూచించారు. 

Published : 06 May 2024 18:16 IST

మండి: ప్రముఖ బాలీవుడ్‌ నటి, భాజపా నేత కంగనా రనౌత్‌ (Kangana Ranaut) మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నారని మండి నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్న కాంగ్రెస్ నేత రాకేశ్‌ కుమార్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేస్తోన్న విమర్శలు, ప్రకటనలను ఉద్దేశించి ఈవిధంగా స్పందించారు.

‘‘కంగనా మానసిక వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు. అంతా సవ్యంగా ఉండే వ్యక్తులు నిరాధారమైన ప్రకటనలు చేయరు’’ అని సింగ్ విమర్శించారు. ఆమెను ఒకసారి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సూచించారు. అలాగే ఆమెకు చరిత్ర గురించి కాస్త అవగాహన కలిగించాలని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ నేతలపై ఆమె చేస్తోన్న వ్యాఖ్యలతో హిమాచల్ ప్రజలు మనస్తాపం చెందుతున్నారన్నారు. అలాగే గతంలో ఆమె చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కొద్దిరోజుల క్రితం కంగన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశ తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని వ్యాఖ్యానించారు.  దాంతో సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి వారి మాటలు తేలిగ్గా తీసుకోవద్దని, వీరంతా ఎక్కడ చదువుకున్నారంటూ విపక్ష నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె విద్యాశాఖ మంత్రి అయితే పరిస్థితి ఏంటో..? అంటూ కామెంట్లు పెట్టారు.

అలాగే కంగన నిన్న ఎన్నికల ప్రచారంలో గందరగోళానికి గురయ్యారు. ప్రత్యర్థి పార్టీ నేతకు బదులుగా సొంత పార్టీ నేతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘అవినీతిపరుల పార్టీ ఇక్కడ ఉంది. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలని కలలు కనే రాహుల్‌ గాంధీ, రౌడీయిజం చేసి.. చేపలు తినే తేజస్వీ సూర్య ఇందులో ఉన్నారు’’ అని అన్నారు.  ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌కు బదులు భాజపా నేత తేజస్వీ సూర్యను ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img