icon icon icon
icon icon icon

Kasparov: ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్‌ దిగ్గజం

చెస్‌లో అగ్రస్థానానికి పోటీ పడే ముందు రాహుల్‌ గాంధీ ముందు రాయ్‌బరేలీలో గెలవాలని చెస్‌ లెజెండ్‌ గ్యారీ కాస్పరోవ్‌ సలహా ఇచ్చారు. ఓ యూజర్‌ పోస్టుకు ఆయన స్పందించారు.  

Updated : 04 May 2024 06:11 IST

దిల్లీ: రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి చెస్‌పై ఉన్న ప్రేమకి సంబంధించి దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్‌ (Garry Kasparov) ఓ సలహా ఇచ్చారు. చెస్‌ (Chess)లో అగ్రస్థానానికి పోటీపడే ముందు మొదట రాయ్‌బరేలీ (Rae Bareli)లో గెలవాలని కాస్పరోవ్‌ పేర్కొన్నారు. ఎక్స్‌(ట్విటర్‌)లో ఓ యూజర్‌ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి చేసిన పోస్టుకు కాస్పరోవ్‌ సరదగా స్పందించారు. ఎన్నికల ప్రచారానికి వెళుతూ ఇటీవల రాహుల్‌ గాంధీ తన ఫోన్‌లో చెస్‌ ఆడాడు. ఈ సందర్భంగా రాహుల్‌ పలు విషయాలు తెలిపారు. గ్యారీ కాస్పరోవ్‌ తన అభిమాన చెస్‌  క్రీడాకారుడు అని, అతనొక నాన్‌ లీనియర్‌ థింకర్‌ అని పేర్కొన్నారు. రాజకీయాలకు, చదరంగానికి దగ్గరి సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. ఆటపై ఒక్కసారి దృష్టి సారిస్తే ప్రత్యర్థి పావులు సైతం మన సొంతమవుతాయన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చెస్‌ ప్లేయర్‌ అని పేర్కొన్నారు. ఈ వీడియోను ఇటీవల కాంగ్రెస్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా పోస్టు చేసింది.

కాంగ్రెస్‌ (Congress) పోస్టుపై ఓ యూజర్‌ వ్యంగ్యంగా స్పందించాడు. ‘‘చెస్‌ దిగ్గజాలు కాస్పరోవ్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌ చాలా తొందరగా ఆట నుంచి రిటైర్‌ అయ్యారు. వారికి మన కాలంలోని గొప్ప మేథావిని ఎదుర్కొనే అవకాశం రాలేదు. ఇది నాకు చాలా ఉపశమనంగా ఉంది’’ అని పోస్టు చేశాడు. దీనిపై కాస్పరోవ్‌ స్పందిస్తూ.. ముందు రాయ్‌బరేలీలో గెలవాలని రాహుల్‌కు సలహా ఇచ్చారు.

రష్యాకు చెందిన 61 ఏళ్ల కాస్పరోవ్‌ చదరంగంలో ఎన్నో ఘనతలు సాధించారు. ఎన్నోసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. 2005లో ఆటకు వీడ్కోలు పలికిన ఆయన.. తరుచూ అధ్యక్షుడు పుతిన్‌ నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఆయన గత కొన్నేళ్ల క్రితం తన దేశం నుంచి పారిపోయి క్రొయేషియాలో ఉంటున్నారు. రష్యా ఇటీవలే కాస్పరోవ్‌ను ‘ఉగ్రవాదులు, అతివాదుల’ జాబితాలో చేర్చింది.

ఇక కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అయిన రాయ్‌బరేలీకి ఇప్పటి వరకు సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఆమె రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానం నుంచి రాహుల్‌ గాంధీ బరిలో ఉన్నారు. శుక్రవారమే ఆయన తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. మే 20న ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. రాహుల్‌ రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వాయనాడ్‌ నుంచి సైతం పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img