icon icon icon
icon icon icon

AAP: ఆప్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో కేజ్రీవాల్‌, సునీత, సిసోదియా

ఆమ్‌ ఆద్మీ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. కేజ్రీవాల్‌, సునీత, సిసోదియా వంటి వారి పేర్లు ఇందులో ఉన్నాయి. 

Published : 04 May 2024 19:21 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దిల్లీ, హరియాణాకు ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) 40 మందితో స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను శనివారం ప్రకటించింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు సునీతా కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఈ జాబితాలో ఉన్నారు. మనీశ్‌ సిసోదియా, సత్యేందర్‌ జైన్‌ పేర్లూ ఈ జాబితాలో ఉన్నాయి. కేజ్రీవాల్‌ సహా సిసోదియా, సత్యేందర్‌ జైన్‌ ముగ్గురూ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం విధితమే.

ఎంపీలైన సంజయ్‌సింగ్‌, రాఘవ్‌ చద్దా, సందీప్‌ పాఠక్‌; దిల్లీ మంత్రులు అతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌, గోపాల్‌రాయ్‌, కైలాష్‌ గహ్లోత్‌ సహా పార్టీకి చెందిన నేతలు, పంజాబ్‌ మంత్రులు స్టార్‌ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు. దిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలకు గానూ నాలుగింట ఆప్‌ పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తోంది. అలాగే, హరియాణాలోని కురుక్షేత్ర, గుజరాత్‌లో రెండు స్థానాలకు పొత్తులపై బరిలోకి దిగింది. పంజాబ్‌లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. 

మరోవైపు వివిధ కేసుల్లో ఆప్‌కు చెందిన కీలక నేతలు జైల్లో ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ భార్య సునీత అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రచార బాధ్యతలను తనపై వేసుకున్నారు. దిల్లీ, గుజరాత్‌లో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. తూర్పు దిల్లీ, పశ్చిమ దిల్లీ గుజరాత్‌లోని భరూచ్‌, భావ్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం చేశారు. దక్షిణ దిల్లీలో ఆదివారం ప్రచారం నిర్వహించనున్నారు. పంజాబ్‌, హరియాణాలోనూ జరిగే వివిధ రోడ్‌షోలలోనూ పాల్గోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img