icon icon icon
icon icon icon

Rajnath Singh: పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు: రాజ్‌నాథ్‌

Rajnath Singh: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భాజపా నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పీవోకే, రిజర్వేషన్లు, రాజ్యాంగంలో మార్పుల వంటి పలు అంశాలపై స్పందించారు.

Updated : 05 May 2024 14:51 IST

దిల్లీ: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను భారత్‌ ఎప్పటికీ వదులుకోబోదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పునరుద్ఘాటించారు. అలాగే భారత రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం భాజపాకు (BJP) లేదన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్‌ అనేక దుష్ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు.

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగయ్యాయి..

పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని రాజ్‌నాథ్‌ (Rajnath Singh) అన్నారు. కశ్మీర్‌ అభివృద్ధిని చూసి అక్కడి ప్రజలే తమంతట తాముగా భారత్‌లో భాగం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయని పేర్కొన్నారు. అక్కడ AFSPA (సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) అవసరం లేదని చెప్పారు. దాన్ని ఎత్తివేసేందుకు సమయం సమీపించిందని వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉందని, అక్కడే తగిన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. త్వరలో జమ్మూకశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే, ఎప్పుడనేది మాత్రం నిర్దిష్టంగా చెప్పలేదు.

రిజర్వేషన్లను తొలగించబోం..

భాజపా (BJP) ప్రభుత్వం ఎప్పటికీ రిజర్వేషన్లను తొలగించబోదని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని కూడా మార్చబోదన్నారు. రాజ్యాంగ పీఠికను సైతం సవరించేది లేదని స్పష్టం చేశారు. ఓట్ల కోసం ఈ అంశాల్లో కాంగ్రెస్‌ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ 80 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందని.. ఎమర్జెన్సీ సమయంలో పీఠికనూ మార్చిందని తెలిపారు. ప్రజల్లో విశ్వాసాన్ని నింపి వారి మద్దతు పొందాలని.. భయం ద్వారా కాదని హితవు పలికారు. భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారంటూ కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

రాహుల్‌పై పాక్‌ ప్రశంస ఆందోళనకరం..

ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం రాహుల్‌ గాంధీకి లేదని రాజ్‌నాథ్‌ (Rajnath Singh) విమర్శించారు. దీంతో హిందూ-ముస్లింల మధ్య విభజనకు కాంగ్రెస్‌ యత్నిస్తోందని ఆరోపించారు. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోందన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం-ఒకే ఎన్నికల వంటి విధానాలను అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ చెబుతోన్న సంపద పంపిణీ వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. అర్జెంటీనా, వెనిజువెలాలో ఆ దిశగా చేసిన ప్రయోగం బెడిసికొట్టిందని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీని పాక్‌ మాజీ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ ప్రశంసించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని రాజ్‌నాథ్‌ అన్నారు. భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాక్‌ యత్నిస్తోందని.. కానీ, దానికి అంత సామర్థ్యం లేదని కొట్టిపారేశారు.

400 సీట్లు పక్కా..

ఈసారి ఎన్డీయే కూటమి కచ్చితంగా 400 సీట్లు గెలుచుకుంటుందని రాజ్‌నాథ్‌ ధీమా వ్యక్తం చేశారు. భాజపా (BJP) సొంతంగా 370 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఈ అంచనాకు వచ్చామని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, అస్సాం, ఝార్ఖండ్‌లో తమ సీట్లు గణనీయంగా పెరుగుతాయన్నారు. తమిళనాడులోనూ కొన్ని స్థానాలు గెలుస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పూర్తిగా భాజపా ఆధిపత్యం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో సీట్లు తగ్గొచ్చా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. కొన్ని చోట్ల సర్దుబాట్లు తప్పవని వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img