icon icon icon
icon icon icon

ఉత్తరాదిన ఆ మూడు నియోజకవర్గాలు ప్రత్యేకం.. ప్రధాన పార్టీలను ఎన్నుకోని ప్రజలు..!

ఉత్తరాదిన ఓ మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌లకు గత కొంతకాలంగా అవకాశం ఇవ్వడం లేదు.

Published : 04 May 2024 20:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ తమదైనశైలిలో ప్రచారం చేస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నాయి. అయితే.. ఉత్తరాదిలో ఓ మూడు స్థానాలు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌లు దాదాపు గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేకపోవడం గమనార్హం. అవే జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌, బారాముల్లా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురీ లోక్‌సభ నియోజకవర్గాలు.

మైన్‌పురిలో 1996 నుంచి సమాజ్‌వాదీ పార్టీ వరుసగా గెలుపొందుతూ వస్తుండగా.. కాంగ్రెస్‌ ఇక్కడ చివరిసారిగా 1984లో గెలుపొందింది. ఇక బారాముల్లా, శ్రీనగర్‌ నియోజకవర్గాల్లో కొంతకాలంగా జమ్మూకశ్మీర్‌ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు గెలుస్తూ వస్తున్నాయి. ఈ స్థానాల్లో హస్తం పార్టీ చివరిసారిగా 1996లో విజయం సాధించింది. ఇక ఈ స్థానాల్లో భాజపా ఒక్కసారి కూడా ఖాతా తెరవకపోవడం గమనార్హం.

ఎస్పీ కంచుకోట.. మైన్‌పురీ

  • 1996 నుంచి ఈ నియోజకవర్గంలో ఏడుసార్లు లోక్‌సభ ఎన్నికలు, రెండుసార్లు ఉప ఎన్నికలు నిర్వహించగా.. సమాజ్‌వాదీ పార్టీయే క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆ పార్టీ అప్పటి అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ మొదటిసారిగా 1996 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 2004, 2009, 2014, 2019లో వరుసగా విజయం సాధించారు. 1998, 1999ల్లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీ నుంచి బలరామ్‌సింగ్‌ యాదవ్‌ గెలుపొందారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్థానాన్ని ములాయం వదులుకోవాల్సి వచ్చింది. ఇక 2014లో ఆజంగఢ్‌ నుంచి కూడా ఆయన గెలుపొందారు. ఈ రెండు సందర్భాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీయే ఈ స్థానాన్ని కాపాడుకుంది.
  • ములాయం మరణం అనంతరం 2022లో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆయన కోడలు డింపుల్‌యాదవ్‌ గెలుపొందారు. 2024లో మరోసారి ఇక్కడినుంచి పోటీ పడుతున్నారు. ఇక్కడ భాజపా అభ్యర్థి జైవీర్‌సింగ్‌ ఆమెపై పోటీకి దిగారు.
  • 2014 ఎన్నికల నుంచి ఇక్కడ భాజపా రెండో స్థానంలో నిలుస్తూ వస్తోంది.
  • ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 17 సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్‌ ఐదుసార్లు(1952, 1962, 1967, 1971, 1984) మాత్రమే గెలుపొందింది.

అక్కడ నేషనల్‌ కాన్ఫరెన్స్‌దే హవా..

  • 1967 నుంచి శ్రీనగర్‌లో 13 సార్లు ఎన్నికలు జరగ్గా.. అత్యధికంగా 10 సార్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ గెలుపొందింది. 1971లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, 1996లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ విజయకేతనం ఎగరవేసింది. ఆ ఎన్నికల్లో పీడీపీతో భాజపా పొత్తు పెట్టుకుంది.
  • బారాముల్లాలో 1957 నుంచి 14 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 9 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్‌ నాలుగుసార్లు, పీడీపీ ఒక్కసారి మాత్రమే గెలుపొందాయి.

ఈ మూడు నియోజకవర్గాలకు ఈసారి వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మైన్‌పురీలో మే 7న, శ్రీనగర్‌లో మే 13న, బారాముల్లాలో మే 20న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈసారి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img