icon icon icon
icon icon icon

Kalpana Soren: ‘తలవంచడం అనేది మా డీఎన్‌ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్‌

అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని.. తలవంచడం అనేది గిరిజనుల డీఎన్‌ఏలోనే లేదని ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) భార్య కల్పనా పేర్కొన్నారు.

Published : 02 May 2024 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) అరెస్టు ఊహించని పరిణామమని ఆయన భార్య కల్పనా సోరెన్‌ పేర్కొన్నారు. ఇది జేఎంఎంతోపాటు తమ కుటుంబాన్ని షాక్‌కు గురిచేసిందన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె (Kalpana Soren).. తలవంచడమనేది గిరిజనుల డీఎన్‌ఏలోనే లేదన్నారు. హేమంత్‌ అడుగుజాడల్లో నడుస్తానని, నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానన్నారు.

వారికి వ్యతిరేకంగా పోరాడతా..

‘అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతా. ఎందుకంటే, తలవంచడం అనేది గిరిజనుల డీఎన్‌ఏలోనే లేదు. నా భర్త అడుగుజాడల్లో నడుస్తా. హేమంత్‌ తన విలువలతో రాజీపడకుండా జైలుకు వెళ్లేందుకే సిద్ధమయ్యారు. నేను ఆయన అర్ధాంగిని. నిరంకుశ శక్తులకు తగిన సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తా’ అని కల్పనా పేర్కొన్నారు. తన భర్త అరెస్టు రాజకీయ ప్రేరేపితమని, బలవంతంగా భాజపాలో చేర్చుకునే ప్రణాళికలో భాగమన్నారు. తన భర్తను బుజ్జగించి, బెదిరించి, అవమానపరచడమే వారి ప్రయత్నమని, ఈ ఎన్నికల్లో ఓటర్లు వారికి తగిన సమాధానం చెబుతారని అన్నారు.

ప్రతిపక్షాలను అణచివేసేందుకే..

‘న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. హేమంత్‌ బెయిల్‌పై బయటకు వచ్చి, లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ప్రచారం చేస్తారని ఎదురు చూస్తున్నాం. ఆయన నిర్దోషి. కేంద్రంలో భాజపా ప్రభుత్వం చేసిన కుట్రలో ఇరుక్కున్నారు. దళితులు, గిరిజనులు, పేదల కోసం పనిచేస్తున్న నాయకులను అరెస్టు చేస్తుంటే రాజ్యాంగం ఎలా పరిరక్షించబడుతుంది. 400లకుపైగా సీట్లు వస్తాయంటూ కాషాయ పార్టీ ఇస్తోన్న నినాదాలతో రాష్ట్రంలో వాతావరణం 400ల డిగ్రీలు దాటింది. ఝార్ఖండ్‌ ప్రజలు భాజపా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఖనిజ సంపద దోచుకుంటున్న శక్తులను తరిమికొడతాం’ అని కల్పనా స్పష్టం చేశారు. భాజపా ఓ నిరంకుశ శక్తిలా వ్యవహరిస్తోందని.. ప్రతిపక్షాలను అణచివేసేందుకే ప్రయత్నిస్తోందన్నారు.

LS polls: ‘కాలా పత్తర్‌’లో.. బిహారీ బాబు-సర్దార్‌జీల పోరు

తమ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేవని.. ఉప ఎన్నికలో భాగంగా నామినేషన్‌ వేసే సమయంలో హేమంత్‌ సోదరుడు తమతోనే ఉన్నారని కల్పనా అన్నారు. పార్టీ నుంచి సీతా సోరెన్‌ వెళ్లిపోవడం ఆమె వ్యక్తిగతమని చెప్పారు. రాజకీయాలు ఎప్పుడూ తన ఎంపిక కాదని.. పరిస్థితులే ఇందులోకి తీసుకొచ్చాయని వివరించారు. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చర్యలపై స్పందించిన ఆమె.. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ దూకుడుగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img