‘హై హీల్స్‌’ అప్పట్లో మగవారివే!

ఈ కాలం అమ్మాయిలు ఎక్కువగా హైహీల్స్‌ చెప్పులు వేసుకోవడం గమనించే ఉంటారు. అవి వేసుకోవడం వల్ల అందంగా కనిపిస్తారని ఒక భావన. పొట్టిగా ఉన్నవాళ్లు కాస్త పొడవుగా కనిపించేందుకు కూడా ఈ హైహీల్స్‌ను వాడుతుంటారులేండి. కొన్ని ఉద్యోగాల్లో హైహీల్స్‌ చెప్పులు

Published : 10 Sep 2020 10:30 IST

ఈ కాలం అమ్మాయిలు స్టైలిష్‌గా కనిపించేందుకు హైహీల్స్‌ వేసుకోవడం గమనించే ఉంటారు. అలా వేసుకొంటే అందంగా కనిపిస్తారని ఫీలింగ్‌. పొట్టిగా ఉన్నవాళ్లు కాస్త పొడవుగా కనిపించేందుకూ వీటికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కొన్ని ఉద్యోగాల్లో  హీల్స్‌ వేసుకోవడం తప్పనిసరి. ఇక మోడలింగ్‌.. ర్యాంపువాకుల్లో వీటిని వాడని వారుండరు. గ్లామర్‌ ప్రపంచంలో ఒక భాగమైన ఈ హైహీల్స్‌ ఒకప్పుడు మగవాళ్లే వేసుకునేవారన్న సంగతి తెలుసా? 

హై హీల్స్‌ వేసుకునే సంస్కృతి ఇప్పటిది కాదు.. పదో శతాబ్దం నాటి నుంచే ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పట్లో పర్షియాకు చెందిన అశ్వికదళం.. ప్రత్యేకంగా తయారు చేసిన బూట్లను ధరించేవారు. ఆ బూట్లలో చివర మడమ వద్ద ఎత్తు పెంచేవారు. ఇవి సైనికులు గుర్రంపైకి ఎక్కినప్పుడు పెడెల్‌పై కాలు స్థిరంగా నిలిపేందుకు ఉపయోగపడేవట. అలాగే గుర్రం పరుగెడుతున్నప్పుడు సైనికులు నిలబడి బాణాలు సంధించాల్సి వచ్చినప్పుడు కింద పడకుండా ఈ హైహీల్స్‌ బూట్లు రక్షణ కల్పించేవి. 12వ శతాబ్దంలో ఈ హైహీల్స్‌ బూట్ల వాడకం భారతదేశంలోకి ప్రవేశించిందట. ఇందుకు వరంగల్‌లోని రామప్ప దేవాలయంలో ఉన్న విగ్రహాలే ఉదాహరణ అని చరిత్రకారులు వెల్లడించారు. ఇక 13వ శతాబ్దంలో యూరప్‌లో ప్రజలు రోడ్డుపై ఉండే బురద అంటకుండా ఆడ, మగ తేడా లేకుండా అందరూ హైహీల్స్‌ బూట్లను ధరించేవారు. ఆ సమయంలో ఆ బూట్ల ఎత్తు 30 అంగుళాలు ఉండేవి. తర్వాత అప్పటి వెనిస్‌ చట్టం ఆ ఎత్తును 3 అంగుళాలకు తగ్గించినా ఎవరూ ఆ నిబంధనను పాటించలేదట. 

ధనవంతులకు ప్రతీకగా..

18వ శతాబ్దంలో ఆధునికీకరించిన హైహీల్స్‌ బూట్లను ఇరాన్‌ చక్రవర్తి అబ్బాస్‌ ది గ్రేట్‌ యూరప్‌కి పరిచయం చేశాడు. కింగ్‌ లూయిస్‌ - XIV తన స్థాయిని తెలపడం కోసం వీటిని ధరించేవాడట. ఆ తర్వాత యూరప్‌లోని సంపన్న కుటుంబాల్లోని మగవారు కూడా సమాజంలో తమ ఉన్నత స్థాయిని ప్రదర్శించుకోవడం కోసం ఈ హైహీల్స్‌ను వేసుకోవడం మొదలుపెట్టారు. ఇందుకోసం ఈ బూట్లను దిగుమతి చేసుకొనేవారు.  దీంతో అప్పటి అధికారులు సమాజంలో ప్రజల ఆర్థిక స్థితులను బట్టి హైహీల్స్‌ ఎత్తులను నిర్ణయించారు. సామాన్య ప్రజలు అర అంగుళం, మధ్య తరగతి వ్యక్తులు ఒక అంగుళం, యోధులు ఒకటిన్నర అంగుళం, మేధావులు 2 అంగుళాలు, రాజ కుటుంబీకులు రెండున్నర అంగుళాలు ఎత్తున్న బూట్లు వేసుకోవాలని నిబంధనలు విధించారు. అయితే మహిళలు వీటిని వేసుకునేందుకు మక్కువ చూపడంతో మందంగా ఉండే బూట్లను మగవారు, పలచగా ఉండే చెప్పులు ఆడవారు వేసుకునేవారు.

కాలక్రమంలో మగవారికి దూరమై..

వైజ్ఞానికంగా ఎదుగుతున్న నేపథ్యంలో మగవారు హైహీల్స్‌ వేసుకోవడంలో అర్థం లేదని భావించి వాటిని ధరించడం మానేయడం మొదలుపెట్టారు. 1780 నాటి నుంచి హైహీల్స్‌ అనేవి ఆడవారికి సంబంధించిన విషయంగా మారిపోయింది. 1810కాలంలో హైహీల్స్‌ ఫ్యాషన్‌గా మారిపోయింది. రెండున్నర అంగుళాల ఎత్తే ప్రామాణికంగా కంపెనీలు హైహీల్స్‌ తయారు చేయడం మొదలుపెట్టాయి. 1850లో కుట్టుమిషన్‌ అందుబాటులోకి రావడంతో ఈ హైహీల్స్‌ ఉత్పత్తి, వినియోగం మరింత పెరిగింది. 

హైహీల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లా పిన్‌-అప్‌ గర్ల్స్‌

20వ శతాబ్దం ప్రారంభంలో అప్పుడప్పుడే విస్తృతమవుతున్న సినిమాలు, ఫొటోగ్రఫీల్లో అమ్మాయిలు హైహీల్స్‌ వేసుకోవడంతో ఈ ఫ్యాషన్‌ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. హైహీల్స్‌ వేసుకొని శృంగారభరితంగా పోజులిచ్చే అందమైన అమ్మాయిల పోస్టర్లు (పిన్‌-అప్‌ గర్ల్స్‌ పోస్టర్స్‌) అప్పట్లో బాగా పాపులరయ్యాయి. రెండో ప్రపంచయుద్ధం సమయంలో కొందరు సైనికులు తమ శిబిరాల్లో ఆ పోస్టర్లను పెట్టుకునేవారట. అలా.. హైహీల్స్‌ అమ్మాయిలకు బాగుంటాయన్న ముద్రపడిపోయింది. 21వ శతాబ్దం ప్రారంభంలో మళ్లీ మగవారి కోసం ఎత్తు మడమల కౌబాయ్‌ బూట్లు ట్రెండ్‌ అయ్యాయి. అయితే సమాజంలో వీటికి పెద్దగా ఆదరణ లభించలేదు. ప్రస్తుతం మగవారికి ఒక అంగుళం వరకు ఎత్తున్న హైహీల్స్‌ బూట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఈ హైహీల్స్ వేసుకొని నడవడం వల్ల ఆడవారిలో అందం మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ పోర్ట్స్‌మౌత్‌కి చెందిన సైకాలజీ పరిశోధకులు పేర్కొన్నారు. అందుకే ఈ హైహీల్స్‌ ఫ్యాషన్‌ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి రకరకాల ఎత్తుల్లో.. వివిధ రంగులు, డిజైన్లతో లభిస్తున్నాయి. ఇదండీ హైహీల్స్‌ కథాకమీషు...!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని