Football: మ్యాచ్‌ మధ్యలోకి పరిగెత్తుకొచ్చిన బాలుడు

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుంటే ప్రేక్షకుల కళ్లన్నీ గోల్‌ ఎవరు కొడతారనే దానిపైనే ఉంటాయి. నిత్యం ఫుట్‌బాల్‌ ఎటువైపు వెళితే అటువైపే తీక్షణంగా చూస్తుంటారు. కానీ, ఎఫ్‌సీ సిన్సినాటి, ఓర్లాండో సిటీ ఎస్‌సీ మధ్య అమెరికాలో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అలా జరగలేదు.

Published : 14 Aug 2021 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు  మైదానంలోకి ప్రేక్షకులు దూసుకురావడం చూస్తూనే ఉంటాం. అయితే ఎఫ్‌సీ సిన్సినాటి, ఓర్లాండో సిటీ ఎస్‌సీ మధ్య అమెరికాలో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఓ చిన్నారి గ్రౌండ్‌ మధ్యలోకి పరుగెత్తుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్‌ జరుగుతుండగా ఉన్నట్టుండి ఓ రెండేళ్ల బాలుడు గ్రౌండ్‌ మధ్యలోకి పరుగెత్తాడు. ఎందుకు పరుగెత్తుతున్నాడో తెలియని ప్రేక్షకులు ఒక్క క్షణంపాటు బాలుడ్నే చూడసాగారు. తన వెనకే తల్లి కూడా పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బాలుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా జారి పడింది. తాజాగా ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముందుగా తల్లి, కొడుకుల ఫొటోను జర్నలిస్ట్ సామ్ గ్రీన్ ట్విటర్‌లో పంచుకున్నారు. తర్వాత ఆ వీడియోను ‘మేజర్ లీగ్ సాకర్’ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. గతంలోనూ క్రీడాకారులపై విపరీతమైన అభిమానంతో సిబ్బందిని దాటుకొని అలా వచ్చిన సంఘటనలు ఉన్నాయి. కానీ, ఏమీ తెలియని రెండేళ్ల బాలుడు రావడంతో నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని