వాళ్లని చూస్తే.. కష్టానికే కన్నీళ్లొస్తాయ్‌!

ఆ ఇంటిని చూస్తే కష్టమే కన్నీరు పెట్టుకుంటుంది. ఆరుగురి కుటుంబ సభ్యుల్లో అయిదుగురు దివ్యాంగులు. సాయం లేకుండా కనీసం మంచినీళ్లు కూడా తాగలేరు. ఇంతమందికి అండగా నిలుస్తుంది ఒక అమ్మాయి మాత్రమే. కన్నోళ్లకు, తోబుట్టువులకు అమ్మగా మారి సేవలు చేస్తోంది. అంగవైకల్యంతో దశాబ్దాలుగా బతుకులు వెళ్లదీస్తున్న ఆ కుటుంబం భారాన్ని ఆ చిట్టి తల్లే మోస్తోంది.

Published : 14 Aug 2020 02:13 IST

మెదక్‌: ఆ ఇంటిని చూస్తే కష్టమే కన్నీరు పెట్టుకుంటుంది. ఆరుగురి కుటుంబ సభ్యుల్లో అయిదుగురు దివ్యాంగులు. సాయం లేకుండా కనీసం మంచినీళ్లు కూడా తాగలేరు. ఇంతమందికి అండగా నిలుస్తుంది ఒక అమ్మాయి మాత్రమే. కన్నోళ్లకు, తోబుట్టువులకు అమ్మగా మారి సేవలు చేస్తోంది. అంగవైకల్యంతో దశాబ్దాలుగా బతుకులు వెళ్లదీస్తున్న ఆ కుటుంబం భారాన్ని ఆ చిట్టి తల్లే మోస్తోంది. మెదక్‌ జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన పెంటమ్మ, బూదమ్మ, సత్తమ్మలు జన్యు సమస్యలతో జన్మించారు. పుట్టుకతోనే కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి దివ్యాంగులయ్యారు. తల్లిదండ్రులు వీరిని కంటికి రెప్పలా కాపాడుకునేవారు. పెళ్లి చేసుకుని ముగ్గురు అక్కచెల్లెళ్లను చూసుకుంటానని సమీప బంధువు నమ్మించాడు. వివాహం అనంతరం వారికి పిల్లలు ఆరోగ్య సమస్యలతో పుట్టడంతో.. అండగా ఉంటానన్న వాడు వదిలేశాడు.

వృద్ధాప్యంతో తల్లిదండ్రులు చనిపోవడం, భర్త వదిలేయడంతో కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది. వీరి ముగ్గురు సంతానంలో ఒక్కరు మాత్రమే పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కుమారుడు చంద్రశేఖర్‌ తల్లిలానే అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. మరో కొడుకు రాజుకు రేచీకటి, వినికిడి సమస్యలు ఉన్నాయి. ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక పూట తింటూ, పస్తులుంటూ క్షణమొక యుగంలా గడుపుతున్నారు.

ఈ అయిదుగురు దివ్యాంగులకు భాగ్యలక్ష్మి అమ్మగా మారింది. తల్లి, ఆమె తోబుట్టువులు, తన సోదరులుకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. వాళ్లందరి కోసం చదువును కూడా త్యాగం చేసింది. ప్రస్తుతం ఈ కుటుంబం శిధిలావస్థకు చేరిన ఇంట్లో ఉంటున్నారు. వర్షానికి గోడలు, ఇల్లు నిమ్ము పట్టి ఎప్పుడు కూలుతుందో తెలీకుండా ఉంది. అందరూ ఆ ఇంటిలోనే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ కుటుంబం దీనస్థితిని తెలుసుకున్న బీడీఎల్‌ భానూర్‌ ఉద్యోగులు, సేవా సంస్థ విన్నర్‌ ఫౌండేషన్ ద్వారా అండగా నిలుస్తున్నారు. నిత్యావసరాలతో పాటు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్‌లో జన్యుపరీక్షలు చేయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని