Updated : 26 Aug 2020 20:48 IST

ఉత్తరం రాస్తే కోర్కెలు తీర్చే వినాయకుడు!

రణథంబోర్‌లోని ఈ ఆలయం ఎంతో ప్రత్యేకం 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా పెద్ద కష్టం వస్తే మనమేం చేస్తాం? వెంటనే మన ఇష్టదైవాన్ని స్మరించుకుంటాం. కష్టాల్ని తొలగించమని వేడుకుంటాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ‘నీ సన్నిధికి వస్తాను స్వామీ’ అని ప్రతినబూనుతాం. ఆ తర్వాత ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటాం. కానీ రాజస్థాన్‌లోని సవాయ్‌ మధోపూర్‌లోని రణథంబోర్‌లో త్రినేత్ర గణేశుడి ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం. కోర్కెలు తీర్చమని నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లనక్కర్లేదు.. మన సమస్యల చిట్టాను వివరిస్తూ ఒక్క ఉత్తరం రాస్తే చాలు.. కష్టాలు మాయమవుతాయని అక్కడి భక్తజనం విశ్వాసం!

రాజస్థాన్‌లోని రణథంబోర్‌ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో వెలిశాడు. ఎన్ని కష్టాలు ఉన్నా ఇక్కడి గణపతికి లేఖరాస్తే కటాక్షిస్తాడని భక్తులకు అపార విశ్వాసం. అందుకే తమకు ఏ కష్టం ఎదురైనా నేరుగా స్వామివారికి అడ్రస్‌కు ఉత్తరం రాస్తారు. భక్తులు రాసే ఉత్తరాలను రోజూ ఓ పోస్టుమ్యాన్ స్వామి సన్నిధికి తీసుకురావడం ఈ ఆలయం మరో ప్రత్యేకత. మీరెక్కడున్నా సరే.. ఆలయం అడ్రస్‌ (సవాయ్​ మధోపుర్​ జిల్లా, రణథంబోర్​ గ్రామం, పిన్​కోడ్​ 322021)కి ఓ ఉత్తరం పంపితే చాలంటున్నారు ఆలయ పండితులు.

ఆలయ చరిత్ర ఇదీ..
రాజస్థాన్‌లోని రణథంబోర్​ కోటలో ఉన్న ఈ మహాకాయుడి ఆలయం చాలా పురాతనమైనది. 10వ శతాబ్దంలో సవాయ్‌ మధోపూర్‌కి దాదాపు 12 కి.మీల దూరంలో మహారాజా హమ్మిరదేవ దీన్ని రణథంబోర్‌ కోటలో నిర్మించారు. అల్లాఉద్దీన్​ ఖిల్జీతో యుద్ధం జరుగుతున్న సమయంలో వినాయకుడు రాజుగారి కలలోకి వచ్చి ఖిల్జీపై విజయం సాధించేందుకు సాయం చేశాడని.. దాంతో రాజు తన కోటలోనే త్రినేత్ర వినాయకుడి ఆలయం నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. కోట చుట్టూ ఆరావళి, వింధ్యాచల్‌ పర్వతాలు ఉన్నాయి. భూభాగం నుంచి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఈ త్రినేత్ర విఘ్నేశ్వరుడి ఆలయంలో ఒక్క లంబోధరుడే కాదు.. ఆయన కుటంబం మొత్తాన్ని దర్శించుకోవచ్చు. విఘ్నేశ్వరుడి భార్యలు రిద్ది, సిద్ధి, కుమారులు శుభ్‌, లాభ్‌ ఒకే ఆలయంలో వెలిశారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నప్పుడు పొరపాటున వినాయకుడిని పిలవడం మరిచిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అనేక సవాళ్లు ఎదర్కోవాల్సి వచ్చిందని.. ఆ తర్వాత శ్రీకృష్ణుడు గణనాథుడిని పూజించినట్టు ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాగే, త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా లంకకు బయల్దేరేముందు గణనాథుడిని పూజించాడని మరో ప్రసిద్ధ నమ్మకం. అలాగే, పాండవుల కాలం కంటే ముందుగానే ఈ ఆలయం ఉందని కొందరు చెబుతుంటారు. 

ఉత్తరాలే కాదు.. తొలి ఆహ్వానాలూ పంపుతారు!
తమ సమస్యలకు పరిష్కాల కోసం, కోర్కెలను తీర్చాలని దేశం నలుమూలల నుంచి భక్తులు విఘ్నేశ్వరుడికి ఉత్తరాలు రాస్తుంటారు. అంతేకాకుండా తమ ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యానికీ సంబంధించిన తొలి ఆహ్వానాన్ని స్వామి వారికే పంపుతుంటారు. మంచి ఉద్యోగం కావాలని కొందరు రాస్తే.. ప్రమోషన్లు కావాలని మరికొందరు స్వామివారి పాదాల చెంతకు ప్రతిరోజూ దరఖాస్తులు వస్తుంటాయి.  

ఈ ఏడాది వేడుకలపై కరోనా ఎఫెక్ట్‌!
కరోనా భయం వెంటాడుతుండటంతో ప్రజలు ఈసారి తమ ఇష్టదైవమైన విఘ్నేశ్వురుడి వేడుకలు ఘనంగా జరుపుకోలేకపోయారు. దేశవ్యాప్తంగా ఎక్కడా ఈసారి సందడిలేకుండా పోయింది. అలాగే, రణథంబోర్‌లోని త్రినేత్ర గణపతి ఆలయంలో కూడా అదే పరిస్థితి. ఏటా వినాయక చవితి వస్తే చాలు లక్షలాది మంది భక్తులతో ఎంతో సందడిగా ఉండేది. కానీ ఈసారి కొవిడ్‌ నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఏర్పడటంతో ఆలయానికి మూడు కి.మీల మేర మూసివేశారు. దీంతో భక్తులు స్వామివారి సన్నిధికి వెళ్లలేకపోయినా.. కరోనా కష్టాలనుంచి గట్టెక్కించు స్వామి అంటూ ఉత్తరాలు మాత్రం రాస్తున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని