సీరమ్‌ నుంచి మరో పది కోట్ల డోసులు

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థ అయిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) అదనంగా మరో పది కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్ నుంచి  గావీ వ్యాక్సిన్‌ కూటమికి

Updated : 29 Sep 2020 17:08 IST

భారత్‌ సహా ఇతర దేశాలకు

దిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థ అయిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) అదనంగా మరో పది కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్ నుంచి  గావీ వ్యాక్సిన్‌ కూటమికి మరో 150 మిలియన్‌ డాలర్లు లభించనున్నాయని వెల్లడించింది. భారత్‌తోపాటు తక్కువ, మధ్య ఆదాయం కలిగిన దేశాలకు వీటిని వచ్చే ఏడాది సరఫరా చేస్తామని తెలిపింది.

ఆగస్టులో అంతర్జాతీయ వ్యాక్సిన్‌ కూటమి అయిన గావీ,  గేట్స్‌ ఫౌండేషన్‌తో ఎస్‌ఐఐ వంద మిలియన్‌ డోసుల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో ఎస్‌ఐఐకి ఈ కూటమి ఆర్థిక సహకారం అందిస్తుంది. తాజా సహకారంతో తయారు చేసే టీకాల డోసుల మొత్తం సంఖ్య 200 మిలియన్లకు చేరిందని ఎస్‌ఐఐ తెలిపింది. అదనంగా సమకూరే ఆర్థిక సహకారం ద్వారా మొత్తం నిధుల విలువ 300 మిలియన్‌ డాలర్లకు చేరిందని పేర్కొంది. వ్యాక్సిన్‌కు  ఆమోదం లభించిన వెంటనే 2021 ఆరంభంలో గావీ కోవాక్స్‌ ఏఎంసీ మెకానిజమ్‌ ద్వారా వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతుందని సంస్థ తెలిపింది.

సురక్షిత, సమర్థవంతమైన కొవిడ్‌ వ్యాక్సిన్ల తయారీని, పంపిణీని ఈ ఒప్పందం వేగవంతం చేయనుంది. ఒక్కో డోసు గరిష్ఠంగా 3 డాలర్లకే అందించే విధంగా కృషి చేస్తున్నారు. ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్‌ వ్యాక్సిన్ల తయారీని ఎస్‌ఐఐ వేగవంతం చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేసే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ‘COVAX’ ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిలో ఇప్పటి వరకు 92 తక్కువ, మధ్య ఆదాయ దేశాలే కాకుండా 73 అధిక ఆదాయం కలిగిన దేశాలు కూడా చేరాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని