Indian Student Missing: అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..

Indian Student Missing: షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

Updated : 09 May 2024 11:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రమాదాలకు గురవడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగో (Chicago)లో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ లేదని (Indian Student Missing) అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

‘‘భారత్‌కు చెందిన విద్యార్థి రూపేశ్‌ చంద్ర చింతకింది మే 2వ తేదీ నుంచి కన్పించట్లేదని తెలిసి కాన్సులేట్‌ ఆందోళన చెందుతోంది. అతడి ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే రూపేశ్‌ జాడ తెలుస్తుందని ఆశిస్తున్నాం’’ అని షికాగోలోని భారత రాయబార కార్యాలయం (Consulate of India) సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అటు పోలీసులు కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. అతడి గురించి తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు.

తెలంగాణ (Telangana) రాష్ట్రానికి చెందిన రూపేశ్‌ ప్రస్తుతం విస్కాన్సిన్‌లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నాడు. అతడు అదృశ్యమైనట్లు తెలియగానే కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా (USA) ఎంబసీని అభ్యర్థించారు.

ఈ ఏడాది ఆరంభం నుంచి అగ్రరాజ్యంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దాడులు, కిడ్నాప్‌ల వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయ, భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. తమ గడ్డపై విదేశీ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని