Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 11 Jan 2022 17:26 IST

1. AP Budget: సభలో ప్రవేశపెట్టిన బుగ్గన

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం కొనసాగుతోంది. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 2,29,779.27 కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాలను రూపొందించినట్లు బుగ్గన తెలిపారు. ఈ బడ్జెట్‌లో వెనుకబడిన కులాలకు రూ.28,237 కోట్లు, చిన్నారుల కోసం రూ. 16,748 కోట్లు కేటాయించామన్నారు. 2020-21తో పోలిస్తే వారికి 32 శాతం అధికంగా కేటాయింపులు చేసినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. Counterattacks: విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు

విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మర్రిపాక వద్ద మావోయిస్టులు- పోలీసుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అరగంటపాటు ఎదురుకాల్పులు కొనసాగగా.. మావోయిస్టులు తప్పించుకున్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

3. corona: నాలుగువేల దిగువకు మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం 20,55,010 కొవిడ్ నమూనాలను పరీక్షించగా..2,76,110 కొత్త కేసులు వెలుగు చూశాయి. 24 గంటల వ్యవధిలో 3,874 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రితంరోజు రికార్డు స్థాయికి చేరిన మరణాలు (4,529).. నిన్న 4వేల దిగువన నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2.57కోట్లకు పైబడింది. ఇప్పటి వరకు 2,87,122 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ICMR: ఇంటి వద్దే కరోనా పరీక్షలు

పల్లెల్లో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటింటికెళ్లి పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆదేశాల మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కార్యాచరణకు సిద్ధమయింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. లక్షణాలున్నవారు, ఇప్పటికే పాజిటివ్‌గా తేలినవారితో సన్నిహిత సంబంధం ఉన్న వారికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ చేయాలి. విచక్షణారహితంగా పరీక్షలు నిర్వహించకూడదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. Tauktae: నౌకలో ఇంకా దొరకని 38మంది ఆచూకీ

తౌక్టే తుపాను ధాటికి అరేబియా సముద్రంలో మునిగిన భారీ నౌకలో ఇంకా 38 మంది ఆచూకీ తెలియరాలేదు. వారి కోసం నాలుగో రోజు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. 261 మంది ఓఎన్జీసీ సిబ్బందితో ఉన్న పీ-305 బార్జ్‌ (ఆఫ్‌షోర్‌ ఉద్యోగుల నివాసానికి ఉపయోగించే భారీ నౌక) తుపాను అలల ఉద్ధృతికి గత సోమవారం ముంబయి తీరం నుంచి లంగర్‌ ఊడిపోయి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. RRR: కొమురం భీమ్‌ని చూశారా!

గురువారం ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌తో యంగ్‌ టైగర్‌ అభిమానుల్ని మరోసారి ఫిదా చేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఓ సరికొత్త లుక్‌ను నెట్టింట్లో షేర్‌ చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ ఉగ్రరూపంలో కనిపించారు. బల్లెం గురిపెట్టి పోరాటానికి సిద్ధమైనట్లు ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ పోస్టర్‌ ప్రతిఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* నవరస నాయకుడు.. నందమూరి అందగాడు

7. Corona: ఒక్క ఔషధంతో కొవిడ్‌ చికిత్స

ఒక్క ఔషధంతో కొవిడ్‌ను అడ్డుకునే దిశగా ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందమొకటి పురోగతి సాధించినట్టు తెలుస్తోంది! గ్రిఫిత్‌ యూనివర్సీటీకి చెందిన మెంజీస్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ నేతృత్వాన తయారుచేసిన ప్రత్యేక ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించగా, మంచి ఫలితాలు వచ్చాయట. ‘‘జీవ కణాల్లోకి ప్రవేశించిన వైరస్‌ అభివృద్ధి చెంది, సంతతిని పెంచుకోకుండా ఈ మందు అడ్డుకుంటుంది. ఎలుకలపై పరీక్షలు నిర్వహించగా... వైరస్‌ పార్టికల్స్‌ 99.9% మేర క్షీణించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. corona: భారత్‌కు సాయం 50 కోట్ల డాలర్లు

కరోనా మహమ్మారి రెండో ఉద్ధృతితో అల్లాడుతున్న భారత్‌కు సాయం చేస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు భారత్‌కు 50 కోట్ల డాలర్ల కొవిడ్‌ సాయం అందించినట్లు బుధవారం శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక ముందు కూడా భారత్‌కు సహాయ సహకారాలు కొనసాగిస్తామని తెలియజేసింది. అంతేకాక వివిధ దేశాలకు 8 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపించనున్నట్లు వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి జెన్‌ సాకీ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్‌లు, వాటి వ‌డ్డీ రేట్లు.. 

క‌రోనా నేప‌థ్యంలో వేగంగా ప‌డిపోతున్న వ‌డ్డీ రేట్ల నుంచి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌ను ప‌రిర‌క్షించేందుకు ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌క‌మే సీనియ‌ర్  సిటిజ‌న్ స్పెష‌ల్ డిపాజిట్ స్కీమ్‌. ఈ ప‌థ‌కం గ‌డువు తేది మార్చి 30తో ముగియ‌గా, జూన్ 30,2021 వ‌ర‌కు పొడిగిస్తూ బ్యాంకులు నిర్ణ‌యం తీసుకున్నాయి. సాధారణంగా ఫిక్స‌డ్ డిపాజిట్లో ఇత‌రుల‌కు ఆఫ‌ర్ చేసే వ‌డ్డీ రేట్ల కంటే 50 బేసిస్ పాయింట్లు అద‌నంగా సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఇస్తుంటాయి బ్యాంకులు. అయితే స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్‌లు అంత‌కంటే ఎక్క‌వ వ‌డ్డీనే అందిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Team India: 551 కాయా? పండా?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు మరో నెల రోజులే ఉంది. సౌథాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడేందుకు కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. సుదీర్ఘ ఫార్మాట్లో రికార్డులెన్నో సృష్టించిన భారత్‌కు, అభిమానులకు ఇదో మధుర జ్ఞాపకంగా నిలిచిపోనుంది. ఎందుకంటే ఇది మనకు 551వ టెస్టు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆడిన 100, 200, 300, 400, 500 మ్యాచుల్లో ఏమైందో నెమరువేసుకొందాం! పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని