YS Jagan: సమతామూర్తి విగ్రహం.. భావితరాలకు స్ఫూర్తి : సీఎం జగన్‌

రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయన రోడ్డు మార్గంలో ముచ్చింతల్‌ చేరుకున్నారు.

Published : 08 Feb 2022 01:18 IST

హైదరాబాద్: అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకే సమతామూర్తి స్థాపన జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన సీఎం రోడ్డు మార్గంలో ముచ్చింతల్‌ చేరుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో జగన్‌ తొలుత ప్రవచన మండపానికి చేరుకున్నారు. చినజీయర్‌ స్వామి సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అసమానతలను రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారన్నారు. వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఇలాంటి గొప్పకార్యక్రమం నిర్వహిస్తున్న చినజీయర్‌ స్వామికి అభినందనలు తెలిపారు. రామానుజ స్వామి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. . సమతామూర్తి విగ్రహం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అనంతరం చిన్నారులు ప్రజ్ఞా పుస్తకాలను సీఎంకు బహూకరించారు. అక్కడి నుంచి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని సీఎం దర్శించుకున్నారు. విగ్రహ విశేషాలను చినజీయర్‌ స్వామి, ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు.

దేశంలో సమాజ సేవకులకు మంచి జరగాలని చినజీయర్‌ స్వామి ఆకాంక్షించారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని వర్గాలు క్షేమంగా ఉండాలన్నారు. సమతా స్ఫూర్తిని సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు. ‘‘ సమానత కోసం సమాజంలో ఎందరో పోరాడారు. నల్ల, తెల్లజాతీయుల మధ్య అంతరాలు తొలగించేందుకు అబ్రహం లింకన్‌ కృషి చేశారు. నల్లజాతీయుల ఉన్నతి కోసం నెల్సన్‌ మండేలా పోరాడారు. రామానుజాచార్యులు సమానత్వం కోసం ఎంతో పోరాడారు.’’ అని చినజీయర్‌ స్వామి అన్నారు.  సమతామూర్తి కేంద్రంలో హాల్‌ ఆఫ్‌ ఫ్రేమ్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. లింకన్‌, లూథర్‌ కింగ్‌, మండేలా తదితర 150 మంది చిత్రాలను హాల్‌ ఆఫ్‌ ఫ్రేమ్‌గా రూపొందించామన్నారు. వీరంతా జాతి వివక్ష, అసమానతలపై ఉద్యమించారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని