AP PRC: మాకు జరిగిన అన్యాయానికి సజ్జల సాక్ష్యం కాదా?: బొప్పరాజు

పీఆర్సీ జీవోల వల్ల తమకు తీవ్ర నష్టమని పీఆర్సీ సాధన సమితి నేత...

Published : 28 Jan 2022 01:45 IST

అమరావతి: నూతన పీఆర్సీ జీవోల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీఆర్సీ సాధన సమితి కార్యాచరణ మథనం తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. చర్చలకు వెళ్లాలంటే ముందుగా తమ మూడు చిన్న కోరికలు తీర్చాలని అడిగామని, అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. ప్రజలు, ఉద్యోగులకు ప్రభుత్వం తప్పుడు  సమాచారం ఇస్తోందని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలే చర్చలకు రావడం లేదని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సజ్జల చుట్టూ మేం అనేక సార్లు తిరిగామని, 40 పాయింట్లకుపై సజ్జల గంటన్నరసేపు వివరంగా చర్చించారని పేర్కొన్నారు. తమకు జరిగిన ప్రతి అన్యాయానికి సజ్జల సాక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. చర్చలకు కొత్త సంఘాలు కూడా రావాలని ఆహ్వానిస్తారా? అని అసహనం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారని ప్రశ్నించారు.

పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని కోరామని, చిన్న కోరికలు తీర్చలేని మంత్రుల కమిటీ మా డిమాండ్లను నెరవేరుస్తుందా?అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడకు లక్షలాది మంది ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నెలకు పాత జీతం ఇవ్వాలని, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. లిఖితపూర్వక లేఖలకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నామని బొప్పరాజు చెప్పారు. ట్రెజరీ ఉద్యోగులు కూడా తమలో భాగమేనని, వారిపై చర్యలు తీసుకుంటే మమ్మల్ని రెచ్చగొట్టినట్టేనని బొప్పరాజు వ్యాఖ్యానించారు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

ఆ మూడింటిపై సమాధానం వచ్చే వరకు చర్చల్లేవ్‌: బండి శ్రీనివాసరావు

ఉద్యోగుల మూడు ప్రధాన డిమాండ్లపై మంత్రుల కమిటీ నుంచి సమాధానం వచ్చే వరకు చర్చలకు వెళ్లేది లేదని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు తేల్చి చెప్పారు. తాము మూడు డిమాండ్లతో మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చామని.. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. విజయవాడలో ఉద్యోగుల రిలే దీక్షా శిబిరం వద్ద ఆయన మాట్లాడారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ రిపోర్టు బయటపెట్టడం, ఉద్యోగులకు ఈనెల పాత జీతాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కొత్త వేతనాలిచ్చేందుకు డీడీవోలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని.. కొందరు డీడీవోలు అత్యుత్సాహంతో బిల్లు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వం మొండిగా వెళ్లొద్దని కోరుతున్నామన్నారు. పాతజీతాలు ఇచ్చేలా ఆర్థికశాఖ అధికారులు సహకరించాలని చెప్పారు. అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం మానుకోవాలని సూచించారు.

మీరు అమలు చేసేది కేంద్ర పీఆర్సీనా?: సూర్యనారాయణ

మీరు అమలు చేసేది రాష్ట్ర పీఆర్సీనా.. కేంద్ర పీఆర్సీనా అని మరో నేత సూర్యనారాయణ ప్రశ్నించారు. మంత్రుల కమిటీ తొలుత అయోమయం వీడాలని కోరారు. ఉద్యోగులతో ప్రభుత్వం దోబూచులాట ఆడుతోందని విమర్శించారు. కేంద్రం 104 రకాల అలవెన్సులు ఇస్తోంది. మీరు సఇస్తారా? అని ప్రశ్నించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసునన్నారు. రికవరీ విధానం ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటి నివేదిక లేకుండా పే ఫిక్సేషన్‌ ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. మాకు మెచ్యూరిటీ లేదనే మాటను ఉపసంహరించుకోవాలని కోరారు. చర్చలకు పరస్పర గౌరవం, నమ్మకవం ప్రాతిపదికన కావాలని చెప్పారు. ఈ నెలకు పాత జీతమే ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు కార్యాలయాల్లోని డీడీవోలకు విజ్ఞప్తి లేఖలను ఇస్తున్నారు. విజ్ఞప్తి లేఖలు ఇచ్చి ప్రభుత్వానికి నిరసన తెలపాలని పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని