Chandrababu: శాంతి స్వరూప్‌తో కలిసి ‘ప్రజలతో ముఖ్యమంత్రి’.. ఎన్నో సమస్యలు పరిష్కరించా: చంద్రబాబు

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (Shanti swaroop) మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు.

Updated : 05 Apr 2024 14:13 IST

అమరావతి: తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (Shanti swaroop) మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. తెలుగు దూరదర్శన్‌లో వార్తలు అనగానే మొదటిగా గుర్తొచ్చేది ఆయనేనని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు.

‘‘నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి ప్రతి సోమవారం ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ కార్యక్రమం చేసేవాళ్లం. ఆరేళ్ల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకొని పరిష్కారం పొందేవారు. ఆ విధంగా మా అనుబంధం సుదీర్ఘమైనది. శాంతి స్వరూప్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

శాంతి స్వరూప్‌ మృతిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సంతాపం తెలిపారు. దూరదర్శన్‌ అంటే వార్తలు.. వార్తలు అంటే శాంతి స్వరూప్‌ అన్నంతగా తెలుగు వీక్షకులకు దగ్గరయ్యారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

కేసీఆర్‌ సంతాపం

శాంతి స్వరూప్‌ మరణంపై భారాస అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్తలు చదివే తొలితరం న్యూస్‌రీడర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారని.. మీడియా రంగంలో తనదైన ముద్రవేశారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని