Heat wave alert: మధ్యాహ్నం వేళ బయటకు రావద్దు: తెలంగాణలో ‘ఎల్లో అలర్ట్‌’

వాతావరణశాఖ వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల ప్రాంతంలో పౌరులు బయటకు రావద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

Published : 06 Apr 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. వాతావరణం పొడిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. దీంతో ఎండ సమయంలో బయటకు రావద్దని పౌరులను అప్రమత్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సైతం హెల్త్‌ అడ్వైజరీ విడుదల చేసింది.

వాతావరణ శాఖ వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల ప్రాంతంలో పౌరులు బయటకు రావద్దని ఆరోగ్యశాఖ సూచించింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో.. మద్యం, టీ, కాఫీతోపాటు చక్కెర స్థాయిలు అధికంగా ఉండే శీతల పానీయాలకు దూరంగా ఉండాలని కోరింది. అవి శరీరంలో ద్రవాలను కోల్పోయేలా చేస్తాయని, అందుకే ఎండపూట వాటిని తాగవద్దని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా.. ప్రజారోగ్య కేంద్రాల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్‌, ఔషధాలు అందుబాటులో ఉంచామని పేర్కొంది.

ఇదిలాఉంటే, ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) చెబుతోంది. ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారత్‌లో వడగాల్పుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని