Updated : 04 Jan 2021 19:16 IST

బ్రిటన్‌ చరిత్రలో 11 రోజులు మాయం! 

చరిత్రలో ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజ్యాలు పోయాయి.. రాజులు పోయారు. యుద్ధాల్లో చక్రవర్తులు ఆస్తులు కోల్పోయారు. అలాగే బ్రిటన్‌ దేశంలో ప్రజలు వారి జీవితంలో పదకొండు రోజులను కోల్పోయారట. ఆ విషయం మీకు తెలుసా? రోజులు కోల్పోవడం ఏంటి? విడ్డూరం కాకపోతే.. అనుకుంటున్నారా? నిజంగా ఇది వింతే. అయితే దీనికి కారణం మాత్రం అప్పటి బ్రిటన్‌ ప్రభుత్వమే!

క్రీస్తు పూర్వం 46లో జులియస్‌ సీజర్‌ ప్రవేశపెట్టిన జూలియన్‌ కాలెండర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించేవారు. ఈ కాలెండర్‌ ప్రకారం ఏడాదికి 365 రోజులు.. అదనంగా 6 గంటలు ఉన్నాయి. సూర్యుడి గమనాన్ని బట్టి చూస్తే ఏడాదికి 365 రోజుల 5 గంటల 49 నిమిషాలు మాత్రమే ఉంటాయి. పదకొండు నిమిషాల అంతరం వల్ల రోజుల్లో తేడాలు ఏర్పడుతున్నాయి. ఈ లోపాన్ని సరిచేసి 1582లో ఎనిమిదో పోప్‌ జార్జ్‌ గ్రెగేరియన్‌  కాలెండర్‌ను ప్రవేశపెట్టారు. దీన్నే మనం ఇప్పటికీ వాడుతున్నాం. ఈ కాలెండర్‌ను అప్పుడే బ్రిటన్‌ పొరుగు దేశాలు.. నార్వే, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ ఇలా అన్ని దేశాలు అనుసరించడం మొదలుపెట్టాయి. కానీ బ్రిటన్‌ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ‘ప్రపంచంలో మాదే శక్తిమంతమైన దేశం.. మేమెందుకు కొత్త కాలెండర్‌ను పాటించాలి’’ అన్నట్లు అహంకారం ప్రదర్శించింది. ఫలితంగా కొత్త గ్రెగోరియన్‌ కాలెండర్‌తో పోలిస్తే.. బ్రిటన్‌ పదకొండు రోజులు వెనుకబడిపోయింది. దీంతో కొన్నాళ్లకు అసలు సమస్య ఎదురైంది.

అంతర్జాతీయ ఒప్పందాలు, వాణిజ్య, తదితర అంశాల్లో ఇతర దేశాలతో తేదీల విషయంలో తేడాలు మొదలయ్యాయి. ఇబ్బందులు పెరిగాయి. ఇక ఏం చేయలేక బ్రిటన్‌ కూడా గ్రెగోరియన్‌ కాలెండర్‌ను అనుసరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నాయకులు చట్టం తీసుకొచ్చారు. అంతే 1752 సెప్టెంబర్‌ 2న రాత్రి నిద్రపోయిన బ్రిటన్‌ ప్రజలు లేచే సరికి తేదీ సెప్టెంబర్‌ 14గా మారిపోయింది. పదకొండు రోజులు మాయం కావడం ప్రజలను విస్తుపోయేలా చేసింది. అయితే విషయం అర్థమైన తర్వాత ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వారి జీవితంలో మాయమైన రోజులకు కూడా జీతం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆ పదకొండు రోజులను ‘జీతంతో కూడిన సెలవులు’గా పరిగణించి చెల్లింపులు చేసింది. ఇక్కడి నుంచే ‘జీతంతో కూడిన సెలవు’ అనే విధానం మొదలైందని చరిత్రకారులు చెబుతున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని