వీరు పేకాట ఆడితే.. కరోనా ‘షో’ కొట్టింది!

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, భౌతిక దూరం పాటించాలని ఎంత చెబుతున్నా కొందరికి పట్టడం లేదు. సమయం దొరికింది కదా అని

Updated : 25 Apr 2020 18:29 IST

 ఇద్దరి నిర్లక్ష్యంతో 39 మందికి పాజిటివ్‌


 

విజయవాడ: కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, భౌతిక దూరం పాటించాలని ఎంత చెబుతున్నా కొందరికి పట్టడం లేదు. సమయం దొరికింది కదా అని ఇరుగుపొరుగు వారితో చేసిన కాలక్షేపానికి 39 మందికి కరోనా సోకింది. కృష్ణా జిల్లా విజయవాడలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనలకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ వెల్లడించారు.

కృష్ణలంకలో లారీ డ్రైవర్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మూలంగా 24 మంది కరోనా బారిన పడ్డారని వివరించారు. కాలక్షేపం కోసం ఇరుగు పొరుగు వారిని పిలిచి అతడు పేకాట ఆడాడని చెప్పారు. వీరితో పాటు ఇరుగు పొరుగు వారి పిల్లలు, మహిళలు కూడా హౌసీ ఆడారని కలెక్టర్‌ తెలిపారు. దీంతో మొత్తం 24 మందికి కరోనా సోకిందన్నారు.

కార్మికనగర్‌లో మరో లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల 15 మందికి కరోనా సోకిందని కలెక్టర్‌ వివరించారు. డ్రైవర్‌ తన కుటుంబ సభ్యులు, పొరుగువారిని కలవడం వల్ల వారికి కరోనా సోకిందని తెలిపారు. భౌతికదూరం పాటించకపోవడం వల్లే ఈ రెండు ఉదంతాలూ జరిగాయని కలెక్టర్‌ చెప్పారు. ప్రజలు భౌతికదూరం పాటించకుంటే కరోనా నియంత్రణ కష్టమని చెప్పారు. రెడ్‌జోన్‌లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

రేపు మాంసం, చేపల అమ్మకంపై నిషేధం

విజయవాడలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. విజయవాడ నగరంలో రేపు చికెన్‌, మటన్‌, చేపల విక్రయాలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్‌ మూసివేస్తున్నట్టు వీఎంసీ కమిషనర్‌ వెంకటేశ్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని