ఏపీ ప్రభుత్వానికి ఎన్‌జీటీ షాక్‌

ఏపీలోని పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం వద్ద నిర్మాణాలను నిలిపివేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) స్టే విధించింది. ఈ మేరకు ఎన్‌జీటీ దక్షిణాది ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోతిరెడ్డిపాడుపై చేపడుతున్న నిర్మాణాలపై

Updated : 20 May 2020 21:22 IST

పోతిరెడ్డిపాడుపై నిర్మాణాలు నిలిపివేయాలని ఉత్తర్వులు

హైదరాబాద్‌: ఏపీలోని పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం వద్ద నిర్మాణాలను నిలిపివేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) స్టే విధించింది. ఈ మేరకు ఎన్‌జీటీ దక్షిణాది ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోతిరెడ్డిపాడుపై చేపడుతున్న నిర్మాణాలపై నారాయణపేటకు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఎన్‌జీటీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోతిరెడ్డిపాడు వద్ద నిర్మాణాలు చేపడితే పర్యావరణంపై పడే ప్రభావంపై పరిశీలన చేసేందుకు 4 శాఖల సభ్యులతో కమిటీ నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కేఆర్‌ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. పర్యావరణ ప్రభావంపై రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీని ఎన్‌జీటీ ఆదేశించింది. కమిటీ నివేదిక వచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఎన్‌జీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరోవైపు చట్టవిరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోందంటూ ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. ఫిర్యాదులో ఏపీ ప్రభుత్వం పేర్కొన్న అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు, డీపీఆర్‌లను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌కు బోర్డు సభ్యుడు పి.ఎస్‌.కుటియాల్‌ లేఖ రాశారు. కాళేశ్వరం, గోదావరి మూడో దశ, తుపాకులగూడెం, మిషన్‌ భగీరథ, పెన్‌గంగపై మూడు ఆనకట్టలు, రామప్పచెరువు నుంచి పాకాలకు నీటి మళ్లింపుకు సంబంధించిన డీపీఆర్ వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని