అటు కళ్లె.. ఇటు ఫోన్‌ పరీక్షలు!

కరోనా వ్యాప్తిని నివారించటానికి, తగు చికిత్స అందించటానికి వైరస్‌ను త్వరగా, కచ్చితంగా గుర్తించటం ముఖ్యం. ప్రస్తుతం దూదిపుల్లతో ముక్కు, గొంతు స్రావాలను తీసి

Updated : 28 Jul 2020 09:28 IST

రోనా వ్యాప్తిని నివారించటానికి, తగు చికిత్స అందించటానికి వైరస్‌ను త్వరగా, కచ్చితంగా గుర్తించటం ముఖ్యం. ప్రస్తుతం దూదిపుల్లతో ముక్కు, గొంతు స్రావాలను తీసి పరీక్షిస్తుండటం తెలిసిందే. దీంతో కొన్ని చిక్కులు లేకపోలేదు. నమూనాలు తీయటానికి నిపుణులైన సిబ్బంది అవసరం. ఒంటి నిండా రక్షణ కవచం కప్పుకోవాలి. పరీక్ష చేయించుకునేవారికీ అసౌకర్యమే. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా తేలికగా పరీక్ష చేయగలిగితే? ఇలాంటి ఆలోచనలతోనే బ్రైగమ్‌ అండ్‌ వుమెన్స్‌ హాస్పిటల్‌ పరిశోధకులు కళ్లె పరీక్ష మీద దృష్టి సారించారు. ఇదీ సార్స్‌ కోవ్‌2ను కచ్చితంగా.. ఆ మాటకొస్తే ముక్కు, గొంతు స్రావ పరీక్షల కన్నా మరింత పెద్దమొత్తంలో వైరస్‌ను గుర్తిస్తుండటం గమనార్హం. గట్టిగా దగ్గినప్పుడు వచ్చే కళ్లెను ఎవరికి వారు ఇంట్లోనే సీసాలో పట్టుకోవచ్చు. దీంతో పరీక్ష చేయటం చాలా తేలిక. మరి దగ్గు రానివారి సంగతో? ఇలాంటివారికి దూదిపుల్ల పరీక్షే ఉత్తమమైనప్పటికీ లాలాజలంతోనూ వైరస్‌ ఆనవాళ్లను పట్టుకునే ప్రయోగాలూ నడుస్తున్నాయి. అంతేనా? జార్జి వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు మరో అడుగు ముందుకేసి ఫోన్‌ సాయంతో వైరస్‌ను పసిగట్టే సన్నటి ‘వెంట్రుక’లాంటి పరికరాన్నీ రూపొందించారు. పలుచటి బంగారు పూతతో కూడిన దీని మీద సార్స్‌ కోవ్‌2కు అంటుకుపోయే ప్రొటీన్‌ ద్రావణాన్ని పూస్తారు. నమూనాను దీనిపై రుద్దినప్పుడు, అందులో వైరస్‌ ఉంటే పరికరానికి అతుక్కుపోతుంది. ఆ వెంటనే రంగు మారుతుంది. దీన్ని ఫోన్‌ కెమెరాలు గుర్తించి ఫొటో తీస్తాయి. ఇది అందుబాటులోకి వస్తే ఎవరైనా, ఎక్కడైనా పరీక్షలు చేయటానికి ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని