TS News: బతికున్నప్పుడు చూడలేదు.. పోయాకా మారలేదు

కన్నబిడ్డలు చూసుకోవడం లేదనే ఆవేదనతో తొంభయ్యేళ్ల వయసులో ఒక వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడటమే విషాదం అయితే....ఆయన అంత్యక్రియలకూ వారు ముందుకురాకపోవడం మరింత బాధాకరం. మనసులు కలచివేసే ఈ సంఘటన

Updated : 22 Dec 2021 07:48 IST

 తండ్రి అంత్యక్రియలకు ముందుకురాని తనయులు
 సర్పంచి, పోలీసుల జోక్యంతో పూర్తి

తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: కన్నబిడ్డలు చూసుకోవడం లేదనే ఆవేదనతో తొంభయ్యేళ్ల వయసులో ఒక వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడటమే విషాదం అయితే....ఆయన అంత్యక్రియలకూ వారు ముందుకురాకపోవడం మరింత బాధాకరం. మనసులు కలచివేసే ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెంలో మంగళవారం  చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... గ్రామానికి చెందిన చిన్నసాయిలు (90)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ వివాహాలయ్యాయి. కుమారులు మల్లయ్య, ఎల్లయ్య కరీంనగర్‌లో కూలి పని చేసుకుంటున్నారు.భార్య పదేళ్ల కిందట మరణించింది. నాటి నుంచి సాయిలు ఒంటరిగా ఉండేవాడు. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. తనను ఎవరూ చూడటంలేదని మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు కుమారులు మధ్యాహ్నం కంఠాయపాలెంకు చేరుకున్నారు. దహన సంస్కారాలు చేయడానికి ఇద్దరూ ముందుకురాలేదు. నచ్చజెప్పినా వినకపోవడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. సర్పంచి శ్రీపాల్‌రెడ్డి, కానిస్టేబుల్‌ సాయికిరణ్‌లు కౌన్సెలింగ్‌ చేయడంతో కుమారులిద్దరూ మంగళవారం సాయంత్రం తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని