అప్పు పుట్టదు.. అభివృద్ధి సాగదు

సాక్షాత్తు ప్రభుత్వమే సీఆర్డీఏకు గ్యారెంటీ ఇచ్చినా దానిని నమ్మి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు.

Updated : 22 Dec 2022 12:08 IST

రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్ల అనాసక్తి
రాజధానిపై ప్రభుత్వ వైఖరితో గడ్డు పరిస్థితులు

ఈనాడు - అమరావతి: సాక్షాత్తు ప్రభుత్వమే సీఆర్డీఏకు గ్యారెంటీ ఇచ్చినా దానిని నమ్మి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా రాజధానిపై ప్రతిష్టంబన నెలకొంది. ఈ కారణంగా బ్యాంకర్లు అప్పు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. సీఆర్డీఏ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. రూ. వెయ్యి కోట్ల రుణం కోసం ఇటీవల స్టేట్‌ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా సానుకూల ఫలితాలు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా ఇందుకు తోడైంది. దీని వల్ల బ్యాంకర్లు విశ్వసించలేని పరిస్థితులు నెలకొన్నాయి.

గ్యారెంటీ ఇచ్చినా.. రూ. 3వేల కోట్లకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ ఏడాది మార్చి, 23తో గడువు తీరింది. రుణ ప్రయత్నాలు విఫలం కావడంతో ఇది అక్కరకు రాలేదు. తర్వాత.. మళ్లీ రూ. 1,600 కోట్లకు ఇచ్చిన గ్యారెంటీ మరో మూడు నెలల వరకే చెల్లుబాటు అవుతుంది. భూములు అమ్మి బాకీ తీరుస్తామని చెబుతున్నా బ్యాంకులు స్పందించడం లేదు. తాజాగా రూ. వెయ్యి కోట్ల రుణం కోసం ఎస్‌బీఐతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. దీని కోసం స్వయంగా సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ముంబై వెళ్లి స్టేట్‌ బ్యాంకు అధికారులతో మాట్లాడారు. అయినా.. అటు వైపు నుంచి ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదు.

ప్రభుత్వం తలుచుకుంటే.. అప్పు కోసం సీఆర్డీఏ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడానికి ప్రభుత్వం నుంచి సరైన తోడ్పాటు లేకపోవడమే. రాష్ట్ర ప్రభుత్వ తలచుకుంటే నిధులు సమీకరించడం పెద్ద కష్టమేమీ కాదు. సంక్షేమ పథకాలకు రూ. లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని చెబుతోంది. రాష్ట్ర భవిష్యత్తు, ఉపాధి అవకాశాలతో ముడిపడిన రాజధాని విషయంలో మాత్రం ఉదాశీన వైఖరిని కనబరుస్తుండడమే కారణం. విశాఖపట్నంకు పాలనను తరలించేందుకు తహతహలాడుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమరవతిలో నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం అనాసక్తి చూపిస్తోంది. అదే తమకు ప్రాధాన్యం అని భావిస్తున్న వాటికి మాత్రం దిల్లీ వెళ్లి మరీ అర్థిక మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు అప్పు తెచ్చుకుంటున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాభివృద్ధితో ముడిపడిన అమరావతి అంశంలో చొరవ చూపడం లేదు. ఈ వైఖరి రాజధానికి శాపంగా పరిణమిస్తోంది.


సొంత రాబడీ అంతంతే

రుణం సంగతి అటుంచితే సొంతంగా రాబడి సమకూర్చుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. భూముల వేలం ద్వారా రాబడి సాధిద్దామని సీఆర్డీఏ ఆశించింది. గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో మొదటి విడతలో 56.2 ఎకరాలు వేలం వేయగా.. కేవలం ఒక్కరే బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. ఆ వ్యక్తి కూడా డబ్బు చెల్లింపు వరకు వచ్చేసరికి తప్పుకున్నారు. రెండో విడతలో పలు వెసులుబాట్లు ఇచ్చి ఐదు విభాగాలలో 422 ప్లాట్లను వేలానికి ఉంచింది. దీనికి 12 దరఖాస్తులే వచ్చాయి. బిడ్డింగ్‌ రోజున కేవలం ఎనిమిది మంది మాత్రమే పాల్గొన్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో భాగంగా మంగళగిరి మండలం నవులూరులోని లేఅవుట్‌లో ఎంఐజీ ప్లాట్ల అమ్మకాలకు మోస్తరు స్పందన వస్తోంది. తొలి విడతలో 120 మంది కొనుగోలు చేశారు. రెండో విడతలో 267 ప్లాట్లను అమ్మకానికి ఉంచగా.. 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు 11 మంది మాత్రమే డబ్బు చెల్లించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని