Vizianagaram-Train Accident: వేగమే బలి తీసుకుంది.. నియంత్రణ లేకపోవడం వల్లే ఘోరం

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి వేగ నియంత్రణ పాటించక పోవడమే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా తేల్చారు.

Published : 02 Nov 2023 07:21 IST

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై ప్రాథమిక నిర్ధరణ

ఈనాడు, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి వేగ నియంత్రణ పాటించక పోవడమే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. అలమండ-కంటకాపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం పలాస రైలును రాయగడ ప్యాసింజర్‌ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ మార్గంలో ఆ రైలు కొన్నిచోట్ల తక్కువ వేగంతో ప్రయాణించాల్సి ఉండగా అధిక వేగంతో వెళ్లింది. ఈ విషయాన్ని ‘స్పీడ్‌ రికార్డు’లో గుర్తించినట్లు సమాచారం. డ్యూటీ ఛార్ట్‌ ప్రకారం ఆ మార్గంలో రైలు కొన్ని చోట్ల 15 కి.మీ., మరికొన్ని చోట్ల 20 కి.మీ. వేగంతో వెళ్లాలి. వేగ నియంత్రణ హెచ్చరికలను పక్కన పెట్టి దూసుకువెళ్లడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే భద్రత కమిషనర్‌ ప్రణ్‌జీవ్‌ సక్సేనా... విశాఖ డీఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం విచారణ చేపట్టారు. ప్రమాదంపై అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది నుంచి ప్రణ్‌జీవ్‌ సక్సేనాతో పాటు తూర్పు కోస్తా జోన్‌ సీనియర్‌ అధికారుల కమిటీ వివరాలు సేకరించింది. అలమండ, కంటకాపల్లి స్టేషన్లలో ఆ రోజు, ముందు రోజు విధినిర్వహణలో ఉన్న సిగ్నల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, లోకో పైలట్లు, స్టేషన్‌ మేనేజర్లు, గార్డులు, టీటీలతో పాటు గ్యాంగ్‌మన్లను విచారణకు పిలిచారు.  వారికి 20 అంశాలతో కూడిన ప్రశ్నావళిని ఇచ్చారు. మొదటి రోజు 70 మంది నుంచి వివరాలు సేకరించారు. సుమారు 200 మంది నుంచి వివరాలు సేకరించి, తుది నివేదిక సమర్పించనున్నారు.

పరిహారం అందజేత

ప్రమాద బాధితులకు రైల్వేశాఖ పరిహారం అందించింది. మృతి చెందిన 13 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన 14 మందికి రూ.2.5 లక్షల చొప్పున, పాక్షికంగా గాయపడిన 25 మందికి రూ.50 వేల చొప్పున ఆసుపత్రుల్లోనే చెక్కులు ఇచ్చినట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు.

14కు చేరిన మృతుల సంఖ్య

రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఆదివారం నాటి దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎం.లక్ష్మి(52) బుధవారం మృతి చెందినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. లక్ష్మిది అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని