Harish Rao: అన్ని విభాగాల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత విస్తృతం: హరీశ్‌రావు

తెలంగాణలో ప్రసూతి, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ సహా అన్ని విభాగాల్లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలు మరింత విస్తృతం చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వైద్యవిద్య పరిధిలోని ఆస్పత్రుల పనితీరుపై ఉన్నతాధికారులు, వైద్యులతో...

Updated : 15 Aug 2022 15:49 IST

హైదరాబాద్: తెలంగాణలో ప్రసూతి, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ సహా అన్ని విభాగాల్లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలు మరింత విస్తృతం చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వైద్యవిద్య పరిధిలోని ఆస్పత్రుల పనితీరుపై ఉన్నతాధికారులు, వైద్యులతో మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్యవిద్య సంచాలకులు రమేష్ రెడ్డి, ఇతర వైద్యారోగ్య శాఖ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. గ‌త స‌మావేశాల్లో నిర్దేశించిన ల‌క్ష్యాల సాధ‌న‌, సాధించిన పురోగ‌తి త‌దిత‌ర అంశాల‌పై మంత్రి స‌మీక్షించారు. ప్రజలకు మ‌రింత‌గా నాణ్యమైన సేవ‌లు అందించాలని దిశానిర్దేశం చేశారు.

‘‘ఆరోగ్యశ్రీ కింద అన్ని విభాగాల్లోనూ సేవలు పెంచాలి. ప్రణాళికలు రూపొందించుకొని ఆపరేషన్ థియేటర్ వినియోగాన్ని పెంచాలి. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలి. ఈఎన్టీ, డెర్మటాలజీ సేవ‌ల‌ు మ‌రింత మెరుగుప‌ర‌చాలి. స‌మీప గ్రామాల్లో ఈఎన్టీ శిబిరాలు ఏర్పాటు చేసి సేవ‌లు అందించాలి. అన్ని ర‌కాల వైద్యసేవ‌లు అందుబాటులో ఉన్న నేప‌థ్యంలో జిల్లా స్థాయిలోనే అత్యవసర సేవలు అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలి. అన‌వ‌స‌రంగా హైద‌రాబాద్‌లోని ఆస్పత్రులకు రెఫ‌ర్ చేయ‌వ‌ద్దు. బోధనాస్పత్రుల్లో అందే వైద్యసేవ‌ల గురించి ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవసరం ఉంది. అత్యవ‌స‌ర సేవ‌లు అన్ని వేళ‌లా అందించేందుకు వీలుగా అన‌స్థీషియా విభాగం క్రియాశీలకంగా వ్యవహరించాలి.

విభాగాల వారీగా వారానికి ఒక సారి సూప‌రింటెండెంట్లు స‌మీక్షలు నిర్వహించాలి. వారంవారం పురోగ‌తి కనిపించేలా చూడాలి. చిన్నపిల్లల విభాగంలోనూ ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేష‌న్లు పెర‌గాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి. నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో బడ్జెట్ రెట్టింపు చేయడంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు వైద్యులు, సిబ్బంది కృషి చేసి ఆరోగ్య తెలంగాణ క‌ల‌ను సాకారం చేయాలి’’ అని హరీశ్‌రావు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని