
Ticket Price: సినిమా టికెట్ల ధరల పెంపునకు హైకోర్టు అనుమతి!
హైదరాబాద్: సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతిచ్చింది. టికెట్ల ధరలపై అధికారులు తుది నిర్ణయం తీసుకునే వరకు యాజమాన్యాలు కోరిన ధరలతో థియేటర్లను నిర్వహించేందుకు అనుమతివ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అఖండ, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, భీమ్లానాయక్ వంటి భారీ బడ్జెట్ సినిమాలకు ... ఒక్కో టికెట్‌పై కనీసం రూ.50 పెంచాలని థియేటర్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి. తమకు అనుమతివ్వాలని గత నెల చివరి వారంలో మల్టీప్లెక్స్‌లు సహా సుమారు వందకు పైగా థియేటర్ల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో యాజమాన్యాలు హైకోర్టులో 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి. టికెట్ల గరిష్ట ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అప్పటి వరకు తాము ప్రతిపాదించిన టికెట్ల ధరలతో థియేటర్ల నిర్వహణకు అనుమతించాలని యాజమాన్యాలు కోరాయి. వాదనలు విన్న హైకోర్టు.. థియేటర్ల అభ్యర్థనను అంగీకరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.